ఆధిపత్యం.. డ్రాగన్ ఆరాటం.. పతనమైపోతున్న పేద దేశాలు
ప్రపంచ ఆధిపత్యం కోసం పోరాడుతున్న చైనా ఆ దిశగా వేగంగా పావులు కదుపుతోంది. అంతర్జాతీయ వ్యవహారాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది. ఒకప్పటి సోవియట్ యూనియన్ (ప్రస్తుత రష్యా) స్థానాన్ని [more]
ప్రపంచ ఆధిపత్యం కోసం పోరాడుతున్న చైనా ఆ దిశగా వేగంగా పావులు కదుపుతోంది. అంతర్జాతీయ వ్యవహారాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది. ఒకప్పటి సోవియట్ యూనియన్ (ప్రస్తుత రష్యా) స్థానాన్ని [more]
ప్రపంచ ఆధిపత్యం కోసం పోరాడుతున్న చైనా ఆ దిశగా వేగంగా పావులు కదుపుతోంది. అంతర్జాతీయ వ్యవహారాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది. ఒకప్పటి సోవియట్ యూనియన్ (ప్రస్తుత రష్యా) స్థానాన్ని భర్తీ చేసేందుకు తహతహలడుతోంది. ఇందులో భాగంగా అగ్రరాజ్యమైన అమెరికాను ఢీకొంటోంది. అంతర్జాతీయ వ్యవహారాలలో ఆ దేశానికి చికాకులు కల్పిస్తోంది. అనేక విషయాలలో ఆ దేశ అధ్యక్ష్డుడు డొనాల్డ్ ట్రంప్ తో తలపడుతోంది. అమెరికా సైతం రష్యా కాకుండా చైనానే తన ప్రత్యర్థిగా పరిగణిస్తోంది. ఈ ఒక్క వ్యూహంతోనే చైనా సరిపెట్టుకోవడం లేదు. చిన్నా చితకా దేశాలకు ఆర్థిక సహాయం చేస్తూ వాటిని తన గుప్పెట్లో పెట్టుకుంటోంది. ముఖ్యంగా పేద ఆసియా, ఆఫ్రికా దేశాలకు సాయం చేస్తూ వాటిపై పట్టు సాధిస్తోంది. తద్వారా ఆయా దేశాలపై పెత్తనం చేస్తోంది. చివరికి అవి ఆర్థికంగా దెబ్బతినేలా, దివాలా తీసేలా, పూర్తిగా తనపై ఆధారపడేలా వ్యవహరిస్తోంది. ఈ విషయం పేద దేశాలకు తెలిసినప్పటికీ వేరే మార్గం లేక బీజింగ్ పై ఆధారపడుతున్నాయి.
ప్రపంచ బ్యాంకు సయితం…..
ఈ పరిస్థితికి కొంతవరకు పాశ్ఛాత్య దేశాలైన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ కొంతవరకు కారణమని చెప్పకతప్పదు. కీలక ప్రపంచ ఆర్థిక సంస్థలు అయిన ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్), ఆసియా అభివద్ధి బ్యాంకు (ఏడీబీ) వంటి ఆర్థిక సంస్థలు దాదాపుగా పాశ్చాత్య దేశాల పెత్తనంలోనే ఉన్నాయి. ఇవి పేద దేశాలకు రుణాలు ఇవ్వడానికి కఠినతరమైన నిబంధనలు విధిస్తున్నాయి. ఎక్కువ వడ్డీని వసూలు చేస్తున్నాయి. 1944లో అమెరికాలో ప్రారంభమైన ప్రపంచబ్యాంకులో 189 దేశాలకు సభ్యత్వం ఉంది. వాషింగ్టన్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ బ్యాంకుపై సహజంగానే అమెరికా పెత్తనం అధికం. బ్యాంకులో అధిక వాటా కూడా అగ్రరాజ్యానిదే. అమెరికా సన్నిహిత దేశాలకు, దానికి నచ్చిన దేశాలకే ఎక్కువగా రుణాలు మంజూరవుతాయన్న ఆరోపణలను తోసిపుచ్చలేం. చిన్న దేశాలకు మొండిచేయి చూపుతోంది. వాషింగ్టన్ కేంద్రంగా పనిచేసే ఐఎంఎఫ్ ది కూడా దాదాపు ఇదే పరిస్థితి. 29 దేశాలు సభ్యత్వం గల ఈ సంస్థపైనా అమెరికా పెత్తనమే నడుస్తోంది. 1966లో ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా నగరంలో ప్రారంభమైన ఆసియా అభివద్ధి బ్యాంకుదీ దాదాపు ఇదే పరిస్థితి. ఇందులో 68 దేశాలకు సభ్యత్వం ఉంది. ఇది కూడా పేద ఆసియా, ఆఫ్రికా దేశాలకు రుణాల మంజూరులో చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదన్న అభిప్రాయం అంతర్జాతీయ వర్గాల్లో బలంగా ఉంది.
దూసుకుపోతున్న చైనా….
ఈ పరిస్థతిని ఆసరాగా చేసుకుని చైనా ఇప్పుడు దూసుకుపోతోంది. చిన్న దేశాలకు ఆర్థికంగా చేయూత అందిస్తూ వాటిని తన మిత్రదేశాలుగా మలచుకుంటోంది. అదే సమయంలో వాటిపై పెత్తనం చెలాయిస్తోంది. ఆయా దేశాలను అప్పుల ఊబిలోకి దించుతోంది. ఇది ప్రమాదకరమైన పోకడ అనడంలో ఎలాంటి సందేహం లేదు. హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యయనం ప్రకారం 152 దేశాలకు చైనా 1.50 లక్ష్లల కోట్ల డాలర్ల రుణం ఇచ్చింది. ఇది భారత అభివధ్ధిలో దాదాపు సగం మొత్తం. వర్థమాన దేశాల నుంచి చైనా కొనుగోలు చేసిన రుణపత్రాలు, పలు భాగస్వాములకు అందించిన రుణాలను లెక్కగట్టినట్లయితే ఈ మొత్తం అయిదు లక్ష్లల కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ విలువలో ఆరుశాతం. 12 దేశాల చైనా రుణాలు వాటి జీడీపీలో 20 శాతాన్ని మించిపోవడం గమనార్హం.
పేద దేశాలను…..
చైనా అప్పులతో పీకలలోతులో కూరుకుపోయిన అతి చిన్నదేశమైన డిజిబౌటి చేసేదేమీ లేక తమ దేశంలో చైనా సైనిక స్థావరం ఏర్పాటుకు అంగీకరించాల్సి వచ్చింది. విదేశాల్లో చైనా తొలి సైనిక స్థావరం ఇదే కావడం గమనార్హం. వంద కోట్ల డాలర్ల బకాయి చెల్లించలేక దక్ష్ణణాసియా దేశమైన శ్రీలంక చేతులెత్తేసింది. దీంతో తమ దేశంలోని హంబన్ టోట ఓడరేవులోని సింహభాగాన్ని చైనాకు కట్టబెట్టింది. చమురు సంపన్న దేశం అంగోలా రుణం తీర్చలేక తమ దేశంలో చైనా నగర నిర్మాణానికి అనుమతిచ్చింది. టాంజనియా, మలేసియా, చివరికి పాకిస్థాన్ సౌతం చైనా అప్పుల వలలో చిక్కుకుని విలవిలాడుతున్నాయి. చైనా అప్పులతో తమ దేశంలో ప్రాజెక్టు నిర్మాణానికి ముందుకొచ్చిన మలేసియా చివరకు వెనక్కుతగ్గింది. హిమాలయ పర్వత రాజ్యమైన నేపాల్ సైతం బీజింగ్ వ్యూహంలో చిక్కుకుంది. ఆ దేశం ఇప్పుడు 800 కోట్ల డాలర్ల రుణ ఊబిలో కూరుకుపోయింది. మొత్తం మీద అనేక పేద ఆసియా, ఆఫ్రికా దేశాలు చైనా వలలో చిక్కకుని దిక్కుతోచని పరిస్థతిని ఎదుర్కొంటున్నాయి. దీనిని నుంచి ఎలా బయటపడాలో తెలియక సతమతమవుతున్నాయి.
-ఎడిటోరియల్ డెస్క్