సై…రా జగన్ రెడ్డి…?
మెగాస్టార్ చిరంజీవి తో వైసిపి అధినేత ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈనెల 14 న భేటీ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. [more]
మెగాస్టార్ చిరంజీవి తో వైసిపి అధినేత ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈనెల 14 న భేటీ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. [more]
మెగాస్టార్ చిరంజీవి తో వైసిపి అధినేత ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈనెల 14 న భేటీ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. వాస్తవానికి టాలీవుడ్ నుంచి వైసిపికి సహకారం తొలి నుంచి అంతంత మాత్రమే. నటి రోజా, పృథ్వి, పోసాని కృష్ణ మురళి వంటివారు మాత్రమే జగన్ నాయకత్వానికి మద్దతును బహిరంగంగా ఇంటా బయట కొనసాగించారు, కొనసాగిస్తూ వస్తున్నారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు అధికారంలో ఉండటం ఆయనకు టాలీవుడ్ తో వున్న మంచి సంబంధాలు వైసిపి తో చెలిమిని దూరం చేసింది. దానికి తోడు ఇండస్ట్రీలో ఇప్పుడు రెండు ప్రధాన సామాజిక వర్గాల ఆధిపత్యం కొనసాగుతూ వస్తుంది.
ఇప్పుడు ఆ రెండే ….
ఒకటి చంద్రబాబు సామాజిక వర్గం కాగా మరొకటి చిరంజీవి ఆయన కుటుంబం కావడంతో వైసిపికి సహజంగానే మద్దతు లేదు. పవన్ జనసేన పార్టీ పెట్టడంతో మెగా ఫ్యామిలీ సపోర్ట్ పవన్ వైపు నిలిచింది. ఇక టిడిపికి పూర్తి స్థాయిలో అందండలను టాలీవుడ్ అందిస్తూ వస్తుంది. తెలుగుదేశం పార్టీ స్థాపించింది ఎన్టీఆర్ కావడంతో సహజంగానే తొలి నుంచి ఈ వర్గం నుంచి టిడిపి పట్ల సానుకూల వైఖరి కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. ప్రస్తుత జనరేషన్ లో మెగా ఫ్యామిలీ డామినేషన్ కూడా గట్టిగానే వుంది. అందుకే ఎన్నికల్లో వైసిపి ప్రభంజనం తో అధికారంలోకి వచ్చినా ఎలాంటి గుర్తింపు ప్రాధాన్యత సినీ రంగం నుంచి జగన్ కి లభించలేదు.
గతంలో చిరంజీవి వస్తున్నారనే ….
వైఎస్ మరణం తరువాత కాంగ్రెస్ అధిష్టానం వ్యూహాత్మకంగా చిరంజీవి ప్రజారాజ్యాన్ని విలీనం చేసుకుంది. దాంతో ఉమ్మడి రాష్ట్ర భావి ముఖ్యమంత్రి చిరంజీవిని ప్రమోట్ చేసే ఛాన్స్ వుందన్నది రాజకీయ వర్గాల్లో టాక్ అయ్యింది . దీన్ని జగన్ కూడా గ్రహించారు. సినిమా గ్లామర్ తో వున్న ప్రజాదరణ మెగాస్టార్ కి ఉంటుందని భవిష్యత్తులో అధిష్టానం తమ వైపు చూసే ఛాన్స్ లేదంటూ పలువురు సూచనలతో జగన్ కాంగ్రెస్ ను వీడి వైసిపి పార్టీ స్థాపించారు. కాంగ్రెస్ అధిష్టానానికి షాక్ ఇచ్చారు. ఎదురు తిరిగిన జగన్ కి అధిష్టానం చుక్కలు చూపించింది. కేసులు జైలు రుచులు చూపించినా జగన్ వెనుకడుగు వేయలేదు. ఒకరకంగా వైసిపి పార్టీ జగన్ తొందరగా ప్రకటించడానికి పరోక్షంగా చిరంజీవే కారణం కావడం విశేషం.
సీన్ మారుతుందా …?
తెలంగాణ సర్కార్ పరిధిలో సినిమాలు రూపొందుతూ ఉండటం కూడా ఎపి ప్రభుత్వానికి విలువను కుదించింది. ప్రస్తుతం గులాబీ పార్టీతో ఇండస్ట్రీ లో సఖ్యత బాగానే వుంది. కానీ జగన్ సర్కార్ విషయంలో మాత్రం భిన్నవైఖరే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి తో ఈనెల 14 న ముఖ్యమంత్రి జగన్ తో సమావేశానికి రంగం సిద్ధమైంది. సైరా సినిమా చూడాలని ఆహ్వానించడానికే జగన్ ను చిరంజీవి కలుస్తున్నారని ఆయన సన్నిహితుల నుంచి ప్రచారం సాగుతున్నా వెనుక మాత్రం చాలా వ్యూహమే ఉందంటున్నారు. వైఎస్ జగన్ సైతం టాలీవుడ్ అంశంలో కలుపుకునే వైఖరి అవలంబించాలని భావిస్తూ ఉండటంతో సాధారణ భేటీ కాస్తా లంచ్ మీటింగ్ గా మారిపోయింది.
చిరంజీవితో సఖ్యత …
చిరంజీవి తో చేతులు కలిపినా లేక ఆయనతో సానుకూల వైఖరి కోస్తాలో బలమైన కాపు సామాజికవర్గం ను ప్రసన్నం చేసుకునే పని చాలా సులువు అవుతుందని జగన్ అంచనా అంటున్నారు. ఇటీవల చిరంజీవి సైరా చిత్రానికి స్పెషల్ షో లకు ఎపి సర్కార్ అనుమతి ఇచ్చింది. దీనివల్ల కలెక్షన్ల పరంగా సైరా కు కాసుల వర్షం కురిసింది. ఈ సానుకూల వాతావరణం ఇలాగే కొనసాగాలని మెగాస్టార్ చిరంజీవి సైతం భావిస్తున్నారని తెలుస్తుంది. ఇప్పటికే సినిమాలే ఇక తన గమ్యంగా చిరంజీవి సాగుతున్న నేపథ్యంలో అందరితో సఖ్యత అవసరమని అందుకే జగన్ తో మంచి స్నేహపూర్వక వాతావరణం కొనసాగించాలని లెక్క వేసినట్లు విశ్లేషకులు అంచనా. మరో పక్క ఇదే తీరుతో చిరంజీవితో సాగితే జనసేన అరకొర హడావిడికి చెక్ పెట్టినట్లే అన్న లెక్కల్లో జగన్ ఉన్నట్లు ప్రచారం నడుస్తుంది. ఏది ఏమైనా వీరిద్దరి భేటీ పై మాత్రం అన్ని వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.