దీక్షల రమేష్.. ఈ సారి వెరైటీగా.. భలే ఉంది బాస్
కడప జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యుడు, అప్పట్లో ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేయడంతో వార్తల్లోకి వచ్చిన టీడీపీ మాజీ నాయకుడు సీఎం రమేష్.. ఉరఫ్ దీక్షల [more]
కడప జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యుడు, అప్పట్లో ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేయడంతో వార్తల్లోకి వచ్చిన టీడీపీ మాజీ నాయకుడు సీఎం రమేష్.. ఉరఫ్ దీక్షల [more]
కడప జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యుడు, అప్పట్లో ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేయడంతో వార్తల్లోకి వచ్చిన టీడీపీ మాజీ నాయకుడు సీఎం రమేష్.. ఉరఫ్ దీక్షల రమేష్ గుర్తున్నాడా? అంటున్నారు సోషల్ మీడియా జనాలు. దీనికి కారణం.. చాన్నాళ్ల తర్వాత ఆయన మళ్లీ ప్రజల ముందుకు వచ్చాడు. మీడియా ముందుకు వచ్చాడు. మళ్లీ.. దీక్షలు అంటూ.. పల్లవి అందుకున్నారు. గతంలో చంద్రబాబు హయాంలో చివరి ఏడాది చివరి నెలల్లో కడపలో స్టీల్ ప్లాంట్ కోసం సీఎం రమేష్ దీక్షలు చేశారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం మెడలు వంచైనా ప్లాంట్ సాధిస్తానని అప్పట్లో ప్రకటించారు. పది రోజుల నాటకీయ పరిణామాలు,దీక్షల నడుమ.. అప్పట్లో సీఎం చంద్రబాబే.. దీనికి శంకుస్థాపన చేసి.. ఎన్నికలకు ముందు వ్యూహాత్మకంగా విషయాన్ని రక్తి కట్టించారు.
రమేష్ చెప్పిందాని కల్లా…
అయితే, అది సక్సెస్ కాలేదు. ఎన్నికల్లో ఒక్కచోట కూడా టీడీపీకి కనీసం పరువు నిలబడలేదని అంటారు కడప జిల్లా నాయకులు. టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కాలు… చేతులు పెట్టేసి ఏ ఒక్క నియోజకవర్గంలోనూ పార్టీ ఎదగకుండా తన వంతుగా తాను టీడీపీ పతనానికి సీఎం రమేష్ కారకులయ్యారు. చంద్రబాబు సైతం సీఎం రమేష్ కు ఎదురు చెప్పే ధైర్యం లేక రమేష్ చెప్పిందానికల్లా ఊ కొట్టడంతో కడప పతనాన్ని బాబు, రమేష్ ఇద్దరే దగ్గరుండి చూసుకున్నట్టైంది. ఎన్నికల అనంతరం ఈ సీఎం రమేష్ బాబుకు జల్లకొట్టి (పైకి ఇలా ప్రచారం.. లోలోన మాత్రం బాబు చెప్పారనే) బీజేపీలోకి వెళ్లారు. ఇక, అప్పటి నుంచి ఆయన అడ్రస్ ఎక్కడా కనిపించలేదు.
భూముల విక్రయ జీవోను….
అప్పటి వరకు జిల్లా మొత్తం తనదే అన్నట్టుగా వ్యూహాత్మ కంగా వ్యాఖ్యలు చేయడం, కేంద్రంపై ప్రత్యేక హోదా విషయంలో నిలదీయడం వంటివి చేసిన సీఎం రమేష్ బీజేపీ కండువా కప్పుకొని కమల దళంలో చేరిన తర్వాత మాత్రం సైలెంట్ అయ్యారు. దీంతో దాదాపు ఆ ఒక్క జిల్లా తప్ప.. మిగిలిన ప్రజలు, నేతలు కూడా సీఎం రమేష్ ను మరిచిపోయారు. అయితే, ఇప్పుడు అనూహ్యం గా దీక్షల రమేష్ మరోసారి తెరమీదికి వచ్చాడు. విద్యుత్ బిల్లుల పెంపునకు నిరసనగా తన స్వంత గ్రామం పోట్లదుర్తిలో సీఎం రమేష్ దీక్షకు దిగారు. ప్రభుత్వ భూముల విక్రయ జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంపును చిత్తశుద్ధితో చేపట్టాలని సూచించారు.
ఉనికి కోసమేనా?
30 మంది ప్రభుత్వ సలహాదారులకు పూర్తి వేతనాలు అందిస్తున్నారని, అధికారులు, పెన్షనర్లకు సగం వేతనాలు ఇవ్వడం అన్యాయమని సీఎం రమేష్ తప్పుబట్టారు. మొత్తానికి ఈ వ్యవహారంతో మళ్లీ తాను ఉన్నానని జిల్లా వాసులకు చెప్పడం కోసమే ఇలా దీక్షలకు దిగాడని అంటున్నారు జిల్లా రాజకీయ నేతలు. ఇక, పోతిరెడ్డిపాడుపై జగన్ చిత్తశుద్ధిని ప్రశ్నిస్తున్న ఈ బీజేపీ ఎంపీ.. మరి కేంద్రానికే ఆ మాటేదో చెప్పి.. తెలంగాణను నిలువరించే ప్రయత్నం చేస్తే బెటర్ కదా?? అని అంటున్నారు విశ్లేషకులు. మరి దీక్షల రమేష్ దీక్షగా ఈవిషయంపై దృష్టి పెడితే.. ఇన్నాళ్లు సీమ వాసులు పడ్డ కష్టాలకు తెరపడుతుంది కదా!?