అందుకే అన్ని సందేహాలు…?
ప్రభుత్వ కార్యాలయాల్లో ప్యూన్, అటెండర్ వంటి చివరిస్థాయి ఉద్యోగాల భర్తీకి సైతం కొన్ని నిబంధనలు, అర్హతలు ఉంటాయి. వాటిని కూడా ప్రతిభ ప్రాతిపదికనే భర్తీ చేయాల్సి ఉంటుంది. [more]
ప్రభుత్వ కార్యాలయాల్లో ప్యూన్, అటెండర్ వంటి చివరిస్థాయి ఉద్యోగాల భర్తీకి సైతం కొన్ని నిబంధనలు, అర్హతలు ఉంటాయి. వాటిని కూడా ప్రతిభ ప్రాతిపదికనే భర్తీ చేయాల్సి ఉంటుంది. [more]
ప్రభుత్వ కార్యాలయాల్లో ప్యూన్, అటెండర్ వంటి చివరిస్థాయి ఉద్యోగాల భర్తీకి సైతం కొన్ని నిబంధనలు, అర్హతలు ఉంటాయి. వాటిని కూడా ప్రతిభ ప్రాతిపదికనే భర్తీ చేయాల్సి ఉంటుంది. పారదర్శకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. నియామకాల్లో లోపాలున్నా, అవతవకలు చోటు చేసుకున్నా సంబంధిత అధికారులు జవాబుదారీ అవుతారు. అక్రమాలు జరిగితే న్యాయస్థానాలు శిక్షలు సైతం విధిస్తాయి. పన్నుల రూపంలో ప్రజలు చెల్లించే సొమ్మునే ప్రభుత్వం ఉద్యోగులకు జీతాల రూపంలో చెల్లిస్తుంది. అందువల్లే అంత జవాబుదారీతనం, పారదర్శకతతో చిన్నపాటి నియామకాలకూ పకడ్బందీ నిబంధనలను ప్రభుత్వం రూపొందించింది. కిందిస్థాయి లోనే ఇలా ఉంటే, ఇక అత్యున్నత స్థాయిలో ఎలా ఉండాలి.
న్యాయమూర్తుల నియామకాల్లో….?
ముఖ్యంగా హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, ప్రధాన న్యాయమూర్తుల నియామకాల్లో ఎంతటి పారదర్శకత ఉండాలి, ఎంతటి జవాబుదారీతనం ఉండాలి, నిబంధనలు ఎంత పకడ్బందీగా ఉండాలన్న సందేహాలు రావడం సహజం. శాసన, కార్యనిర్వాహక వ్యవస్థల్లోని లోటుపాట్లను, పొరపాట్లను సమీక్షించి సరిదిద్దే న్యాయవ్యవస్థలో న్యాయమూర్తుల నియామకంలో పైన చెప్పుకున్నంత పారదర్శకత, జవాబుదారీతనం ఉందా అని ప్రశ్నించుకుంటే ఎవరి కైనా ఒకింత సందేహం రావడం సహజం.
కొలీజియంను ఏర్పాటు చేసినా…..
న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన ‘కొలీజియం’పై తాజాగా దేశవ్యాప్తంగా సదీర్ఘ చర్చ జరుగుతోంది. నిజానికి రాజ్యాంగంలో కొలీజియం ప్రస్తావనే లేదు. న్యాయమూర్తులను రాష్ర్టపతి నియమిస్తారని మాత్రమే రాజ్యాంగం పేర్కొంటోంది. ఇందిరాగాంధీ హయాంలో న్యాయవ్యవస్థపై ప్రభుత్వం పైచేయి కోసం ప్రయత్నించిందన్న ఆరోపణలు రావడంతో కొలీజియం అంశం తెరపైకి వచ్చింది. ప్రభుత్వ తీరుతో న్యాయవ్యవస్థ స్వతంత్రతకు భంగం వాటిల్లుతుందని సుప్రీంకోర్టు భావించింది. ఆ తరవాత 1981, 1993, 1998 ల్లో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుల ఫలితంగా కొలీజియం వ్యవస్థ అమల్లోకి వచ్చింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, మరో నలుగురు సీనియర్ న్యాయమూర్తులతో ఏర్పాటయ్యే కొలీజియం హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకం, బదీలీలను చేపడుతుంది.
నిబంధనలను విధించినా…..
హైకోర్టు న్యాయమూర్తి పదవికి జిల్లా జడ్జిగా పదేళ్ల అనుభవం లేదా హైకోర్టులో పదేళ్ల పాటు న్యాయవాదిగా పని చేసిన అనుభవం ఉంటే చాలునని నిర్దేశించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవికి హైకోర్టు న్యాయమూర్తిగా కనీసం అయిదేళ్లు పనిచేయడం, లేదా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచసిన అనుభవం, లేదా న్యాయవాదిగా పదేళ్ల అనుభవం చాలని పేర్కొన్నారు. ఈ అర్హతలు ఉన్నవారిని కొలీజియం పరిశీలిస్తుంది. ఇందులో లోపాలున్నాయని కాలక్రమంలో విమర్శలు వచ్చాయి. పెద్దగా ప్రతిభ లేనివారు, కొందరు న్యాయమూర్తుల బంధువులు, వారి జూనియర్లు న్యాయమూర్తులుగా ఎంపికవుతున్నరన్న ఆరోపణలు వచ్చాయి.
ఎన్జేఏసీని ఏర్పాటు చేసి……
ఈ నేపథ్యంలో అత్యున్నత న్యాయమూర్తుల పదవులకు ఏకపక్ష ఎంపికలు సరికాదంటూ 2014లో మోదీ ప్రభుత్వం 99వ రాజ్యంగ సవరణ ద్వారా ఎన్ జే ఏ సీ (నేషనల్ జుడీషియల్ అపాయింటెమెంట్ కమిషన్) చట్టాన్ని తీసుకువచ్చింది. ఆరుగురు సభ్యులుండే ఈ కమిషన్ కు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సారథ్యం వహిస్తారు. ఇందులో ఇద్దరు సీనియర్ న్యాయమూర్తులు, కేంద్ర న్యాయమంత్రి, ఇద్దరు ప్రముఖులు సభ్యులుగా ఉంటారు. ఈ ఇద్దరు ప్రముఖులను కేంద్రం నియమిస్తుంది. ఈ చట్టం చెల్లదంటూ 2015అక్టోబరు16న జె.ఎస్. ఖేహార్ సారథ్యంలోని రాజ్యాంగ ధర్మాసనం తీర్పిచ్చింది. ధర్మాసనంలో జస్టిస్ కురియన్ జోసెఫ్, మదన్ బి లోకూర్, ఏకే గోయల్, జాస్తి చెలమేశ్వర్ సభ్యులు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన చెలమేశ్వర్ మాత్రం తీర్పుతో విభేదించారు. దీంతో మళ్లీ కొలీజియం వ్యవస్థ పురుడు పోసుకుంది.
మరోసారి తెరపైకి…..
తాజాగా ఏపీ హైకోర్టు, సుప్రీంకోర్టులోని ఒక న్యాయమూర్తి వ్యవహార శైలిపై ఆ రాష్ర్ట ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ అరవింద్ బోబ్డేకి లేఖ రాసిన నేపథ్యంలో కొలీజియం స్థానంలో ఎన్ జే ఏ సీ ని తీసుకు రావాలన్న డిమాండ్లు వివిధ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. పారదర్శకత, జవాబుదారీ ఉండాలని, వివిధ కోణాల్లో సంబంధిత వ్యక్తులతో చర్చ జరిగిన తరవాతే న్యాయమూర్తుల నియామకం జరగాలన్నఅభిప్రాయం వ్యక్తమ వుతోంది. ఎవరి వాదనలు ఎలా ఉన్నప్పటికీ ప్రజాస్వామ్యానికి ప్రాణపదమైన పారదర్శకత, జవాబుదారీతనం కావాలని పౌరులు కోరుకోవడంలో అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు.
-ఎడిటోరియల్ డెస్క్