కుదుట పడుతున్న కాశ్మీర్… ఇక ఆల్ ఈజ్ వెల్ ?
సరిహద్దు రాష్ర్టమైన జమ్ము కాశ్మీర్ లో క్రమంగా పరిస్థితులు కుదుటపడుతున్నాయి. పాలన గాడిన పడుతోంది. శాంతి భద్రతల పరిస్థితి మెరుగు పడుతోంది. తుపాకీ కాల్పులు, లాఠీఛార్జీలు, భాష్ప [more]
సరిహద్దు రాష్ర్టమైన జమ్ము కాశ్మీర్ లో క్రమంగా పరిస్థితులు కుదుటపడుతున్నాయి. పాలన గాడిన పడుతోంది. శాంతి భద్రతల పరిస్థితి మెరుగు పడుతోంది. తుపాకీ కాల్పులు, లాఠీఛార్జీలు, భాష్ప [more]
సరిహద్దు రాష్ర్టమైన జమ్ము కాశ్మీర్ లో క్రమంగా పరిస్థితులు కుదుటపడుతున్నాయి. పాలన గాడిన పడుతోంది. శాంతి భద్రతల పరిస్థితి మెరుగు పడుతోంది. తుపాకీ కాల్పులు, లాఠీఛార్జీలు, భాష్ప వాయు గోళాల ప్రయోగాలు, అరెస్టులు తగ్గిపోతున్నాయి. అధికార యంత్రాంగం రోజువారీ వ్యవహారాలపై దృష్టి పెడుతోంది. జిల్లా అభివ్రద్ధి మండళ్ల (డీడీసీ) ఎన్నికల అనంతరం స్థానిక పాలన ప్రజాప్రతినిధుల చేతుల్లోకి వెళ్లింది. దీంతో ఒకనాటి సంక్షుభిత జమ్ము కాశ్మీర్రాష్ర్టంలో ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలో 24 విదేశీ రాయబారులు గత నెల 17న రాష్ర్టం సందర్శించారు. స్థానిక పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. విదేశీ రాయబారులు, పార్లమెంటు సభ్యులు జమ్ము కాశ్మీర్ రావడం ఇదిమూడోసారి. గతంలో 2019 అక్టోబరు నెలాఖరులో, 2020 ఫిబ్రవరి రెండో వారంలో వారు జమ్ము కాశ్మీర్ లో పర్యటించారు.
విదేశీ రాయబారులు మూడుసార్లు…..
కాశ్మీరుకు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించే 370 అధికరణ రద్దు, రాష్రాన్ని కశ్మీర్, లద్దాఖ్ కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజన అనంతరం ఇప్పటివరకు మూడుసార్లు విదేశీ రాయబారులు సందర్శించారు. తాజా బృందంలో 24 దేశాల రాయబారులు ఉన్నారు. యూరోపియన్ యూనియన్ (ఈయూ), ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ (ఓ ఐ సీ)కు చెందిన వారున్నారు. గత ఏడాది జిల్లా అభివద్ధి మండళ్ల (డీడీసీ) ఎన్నికల అనంతరం విదేశీ రాయబారులు రావడం ఇదే తొలిసారి. ఇందులో చిలీ, బ్రెజిల్, క్యూబా, బొలీవియా, ఫిన్లాండ్, ఫ్రాన్స్ దేశాలకు చెందిన రాయబారులు ఉన్నారు. ఇందులో పాశ్చాత్య దేశాల ప్రతినిధులే కాకుండా, ముస్లిం దేశాలకు ప్రాతినిథ్యం వహించే ఓ ఐ సీ (ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్) ప్రతినిధులు సైతం ఉన్నారు. ఇతర దేశాల ప్రతినిధులు చూసీ చూడనట్లు వ్యవహరించినా ఇస్లామిక్ దేశాల ప్రతినిధులు నిశితంగా ఉంటారన్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ కొంతమంది కాశ్మీరీ నాయకులు ఈ పర్యటనవల్ల ఒరిగేదేమీ లేదని వ్యాఖ్యానించడం వారి మొండి వైఖరికి నిదర్శనం. దీనివల్ల ఉపయోగమేమిటని కాంగ్రెస్ నాయకుడు సైపుద్దీన్ సౌజ్ ప్రశ్నించారు.
ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందంటూ…..
గతంలో పీసీసీ చీఫ్ గా, కేంద్రమంత్రిగా పనిచేసిన సౌజ్ లాంటి సీనియర్ నాయకుడు ఇలా అనుచితంగా మాట్లాడటం ఆయన స్థాయికి తగని పని. ఇక ఎప్పటిలాగానే వేర్పాటువాద సంస్థ హురియత్ కాన్ఫరెన్స్ నాయకుడు మిర్వాయిజ్ ఉమర్ ఫరూఖ్ ప్రతికూలంగా స్పందించారు. అంతా ప్రశాంతంగా ఉందని చూపించి, ప్రపంచాన్ని తప్పుదారి పట్టించేందుకు కేంద్రం ఈ పర్యటనలు ఏర్పాటు చేసిందని ఆరోపించారు. ఇదే సమయంలో జమ్ము కాశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు (సవరణ)పై పార్లమెంటులో మాట్లాడిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ విమర్శలను తోసిపుచ్చారు. ప్రతిపాదిత చట్టం ఆ రాష్రానికి మళ్లీ రాష్ర్ట హోదా ఇవ్వాలన్న రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అవరోధంగా నిలుస్తుందన్న విమర్శను కొట్టిపారేశారు.
ఎవరు ఎన్ని విమర్శలు చేసినా…?
కేంద్ర పాలిత హోదా తాత్కాలికమేనని, సరైన సమయంలో రాష్ర్ట హోదా కల్పిస్తామని భరోసా ఇచ్చారు. జమ్ము కాశ్మీర్ కేడర్ సివిల్ సర్వీసుల అధికారులను అరుణాచల్ ప్రదేశ్, గోవా, మిజోరాం కేంద్ర పాలిత కేడర్లో విలీనం చేసేందుకు ప్రతిపాదిత సవరణ బిల్లు వీలు కల్పిస్తుంది. బీఎస్పీ (బహుజన్ సమాజ్ పార్టీ) కూడా సవరణ బిల్లును సమర్థించింది. 370వ అధికరణ రద్దు తరవాతే జమ్ము కాశ్మీర్ లో గుజ్జర్లు, దళితులు, ఇతర వెనకబడిన వర్గాల వారు గతంలో తాము కోల్పోయిన హక్కులను పొందగలిగారని ఆ పార్టీ సభ్యుడు మలూక్ నగర్ పేర్కొన్నారు. ఈ సవరణ బిల్లు ఇప్పటికే రాజ్యసభలో ఆమోదం పొందింది. విమర్శలు, ప్రతి విమర్శలు ఎలా ఉన్నప్పటికీ సరిహద్దు రాష్ర్టంలో కొంతవరకు ప్రశాంతత నెలకొంటున్న మాట వాస్తవం. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ పరిస్థితిని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది.
– ఎడిటోరియల్ డెస్క్