హస్తం ఆశలు ఆ ‘ఐదు’ పైనే..!
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్లమెంటు ఎన్నికల్లోనైనా పరువు కాపాడుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. తెలంగాణలోని 17 పార్లమెంటు సీట్లలో సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాలు దక్కించుకోవాలని అనుకుంటోంది. [more]
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్లమెంటు ఎన్నికల్లోనైనా పరువు కాపాడుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. తెలంగాణలోని 17 పార్లమెంటు సీట్లలో సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాలు దక్కించుకోవాలని అనుకుంటోంది. [more]
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్లమెంటు ఎన్నికల్లోనైనా పరువు కాపాడుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. తెలంగాణలోని 17 పార్లమెంటు సీట్లలో సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాలు దక్కించుకోవాలని అనుకుంటోంది. ఇదే సమయంలో ఆపరేషన్ ఆకర్ష్ కు తెరతీసిన టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ను పూర్తిగా కోలుకోలేని దెబ్బతీయాలని భావిస్తోంది. మొత్తం అన్ని స్థానలను ఎంఐఎంతో కలిసి దక్కించుకోవాలని టీఆర్ఎస్ పక్కా వ్యూహం అమలు చేస్తోంది. ఈ సమయంలో పార్లమెంటు ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో పెద్దగా ఆశలు మాత్రం కనిపించడం లేదు. అయితే, అన్ని స్థానాల్లోనూ బలమైన అభ్యర్థులను పోటీలో పెట్టడం ద్వారా గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తోంది ఆ పార్టీ. ఐదు స్థానాలపై మాత్రమే కాంగ్రెస్ కు ఆశలు ఉన్నట్లు కనిపిస్తోంది.
ఖమ్మంలో మళ్లీ కాంగ్రెస్ జెండా ఎగురుతుందా..?
అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంటు పరిధిలో ఒక్క అసెంబ్లీ స్థానం మినహా అన్ని స్థానాలనూ ప్రజా కూటమి అభ్యర్థులు గెలుచుకున్నారు. ఖమ్మం పార్లమెంటులో కాంగ్రెస్ బలంగా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కంటే ప్రజాకూటమికి ఎక్కువ ఓట్లు వచ్చాయి. దీంతో ఈ సీటు దక్కించుకోవచ్చని కాంగ్రెస్ భావిస్తోంది. ఇంకా టిక్కెట్ ఎవరికీ ఖరారు చేయకున్నా టీడీపీ నుంచి నామా నాగేశ్వరరావును చేర్చుకొని ఆయనకు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. రేణుకా చౌదరితో పాటు మరికొందరు కూడా ఈ టిక్కెట్ పై ఆశలు పెట్టుకున్నారు. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ సత్తా చాటినా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బలు తగిలాయి. కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్నారు. దీంతో ఇప్పుడు కాంగ్రెస్ ఇక్కడ కొంత బలహీనంగా మారినట్లు కనిపిస్తోంది. అయినా ఖమ్మం సీటును దక్కించుకుంటామని కాంగ్రెస్ ధీమాగా ఉంది.
ఎమ్మెల్యేలు వీడినా గెలుస్తుందా..?
మహబూబాబాద్ పార్లమెంటు సీటుపై కూడా కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో నాలుగు నియోజకవర్గాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకోగా మూడు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. దీంతో ఈ స్థానాన్ని దక్కించుకునుందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయని కాంగ్రెస్ భావిస్తోంది. ఎంపీ అభ్యర్థిగా మాజీ కేంద్రమంత్రి బలరాం నాయక్ ను నిలబెట్టారు. అయితే, కాంగ్రెస్ పార్టీని నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ వీడి టీఆర్ఎస్ లో చేరనున్నట్లు ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోల్ అయినట్లుగానే ఓట్లు వస్తే కాంగ్రెస్ ఇక్కడ విజయం సాధించవచ్చు.
భువనగిరిలో కష్టపడితే విజయం సాధ్యమేనా..
భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ రెండు గెలుచుకోగా మరో రెండు స్థానాలను స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో ఇక్కడ కూడా కాంగ్రెస్ బలంగా కనిపిస్తోంది. ఈ స్థానానికి మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు దాదాపుగా ఖరారైంది. కోమటిరెడ్డి కుటుంబానికి ఇక్కడ కొంత పట్టుంది. 2019లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భువనగిరి ఎంపీగా పనిచేశారు. 2014లో ఆయన స్వల్ప తేడాతో ఓడిపోయారు. నకిరేకల్ ఎమ్మెల్యే కాంగ్రెస్ ను వీడేందుకు సిద్ధమైనా క్యాడర్ మాత్రం కాంగ్రెస్ లోనే కొనసాగుతోంది. దీంతో ఇక్కడ ఇప్పటికైతే టీఆర్ఎస్ కు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నా కాంగ్రెస్ కూడా బోలెడన్ని ఆశలు పెట్టుకుంది.
గ్రౌండ్ వర్క్ మొదటు పెట్టిన కొండా
టీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో ఆయనకే మళ్లీ టిక్కెట్ ఖరారు చేశారు. విశ్వేశ్వరరెడ్డి ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టారు. చేవెళ్లలో మహేశ్వరం, తాండూరు సీట్లను కాంగ్రెస్ గెలుచుకోగా మిగతా స్థానాలను టీఆర్ఎస్ దక్కించుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కంటే టీఆర్ఎస్ కు 1.40 లక్షల ఓట్లు ఎక్కువ వచ్చాయి. ఇక, కాంగ్రెస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పార్టీ టీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకోవడం, ఆమె కుమారుడు కార్తీక్ రెడ్డి టీఆర్ఎస్ తరపున చేవెళ్ల ఎంపీ స్థానానికి పోటీ చేసే అవకాశం ఉండటంతో కాంగ్రెస్ గెలుపు అవకాశాలు తగ్గుతున్నా కొండా విశ్వేశ్వరరెడ్డి మాత్రం గెలుపుపై ధీమాగా ఉన్నారు.
రేవంత్ పార్లమెంటులో అడుగుపెడతారా..?
దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గంగా ఉన్న మల్కాజ్ గిరి పార్లమెంటు స్థానంపై కూడా కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది. ఇక్కడ గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తోంది. వాస్తవానికి టీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ పూర్తి ఆధిక్యాన్ని ప్రదర్శించింది. కేవలం ఎల్బీనగర్ మినహా అన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు భారీ మెజారిటీలతో విజయం సాధించారు. టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డిని ఇక్కడ అభ్యర్థిగా ఖరారు చేశారు. ఆయన కూడా ప్రచారాన్ని ప్రారంభించేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తామని కాంగ్రెస్ ఇక్కడ ధీమాగా ఉంది. అయితే, గెలిచిన ఒక్క ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కూడా పార్టీ వీడి టీఆర్ఎస్ లో చేరాలనుకోవడం కాంగ్రెస్ కు కొంత ఇబ్బందికరంగా మారింది. మొత్తానికి కాంగ్రెస్ కు మొత్తం 17 పార్లమెంటు స్థానాల్లో ఐదు స్థానాలపైనే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తోంది.