కాంగ్రెస్… మళ్లీ పాత బాటలోనే..!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ అధిష్ఠానికి భారీ షాకే తగిలింది. ఊహించని స్థాయిలో ఆ పార్టీ ఓటమి పాలయ్యింది. అయితే, ఓటమికి టీఆర్ఎస్ [more]
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ అధిష్ఠానికి భారీ షాకే తగిలింది. ఊహించని స్థాయిలో ఆ పార్టీ ఓటమి పాలయ్యింది. అయితే, ఓటమికి టీఆర్ఎస్ [more]
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ అధిష్ఠానికి భారీ షాకే తగిలింది. ఊహించని స్థాయిలో ఆ పార్టీ ఓటమి పాలయ్యింది. అయితే, ఓటమికి టీఆర్ఎస్ పార్టీకి ఉన్న సానుకూలత ఒక కారణమైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో చేసిన తప్పిదాలు కూడా కారణాలే. అసెంబ్లీ ఎన్నికలు పోయినా పార్లమెంటు ఎన్నికల్లోనైనా కొన్ని స్థానాలను గెలుచుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకోవాలంటారు.. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం అసెంబ్లీ ఎన్నికల ఓటమి నుంచి గుణపాఠం ఏమీ నేర్చుకున్నట్లు కనపడటం లేదు. మూడు నెలల ముందుగానే పార్లమెంటు ఎన్నికలకు సిద్ధమవుతున్న ఆ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో అవలంభించిన విధానాన్నే మరోసారి అమలు చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే పార్లమెంటు ఎన్నికల కోసం జంబో కమిటీలు వేసింది.
ఆ నేతలతోనే కొత్త కమిటీలు…
ఎన్నికల కోసం కాంగ్రెస్ అధిష్ఠానం మూడు కమిటీలు వేసింది. ఇందులో ప్రచార కమిటీకి ఛైర్ పర్సన్ గా విజయశాంతిని నియమించి… 19 మందిని సభ్యులుగా చేర్చింది. ఇక, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నేతృత్వంలో పబ్లిసిటీ కమిటీని ఏర్పాటు చేసి అందులో 15 మందిని సభ్యులుగా నియమించారు. మీడియా కమిటీ పేరుతో మధు యాష్కి సారథ్యంలో మరో కమిటీ వేసి అందులో ఐదుగురు సభ్యులను ఉంచారు. ఇక ఎన్నికల కో ఆర్డినేషన్ కమిటీని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి ఆర్సీ కుంతియా చైర్మన్ గా, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కన్వీనర్ గా ఏకంగా 35 మంది సభ్యులతో ఏర్పాటు చేసింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే విధంగా జంబో కమిటీలను ఏర్పాటు చేశారు. అయితే, రాష్ట్ర కాంగ్రెస్ లో ముఖ్య నేతలుగా ఉన్న వారందరినీ ఈ కమిటీల్లో ఇరికించే ప్రయత్నం చేసి ఎవరినీ నొప్పించవద్దనే ఆలోచన తప్పించి ఈ కమిటీల ఏర్పాటులో పెద్దగా కసరత్తు చేసినట్లు కనిపించడం లేదు.
వారంతా పని చేస్తారా..?
ఈ జంబో కమిటీల ప్రయోగం ఈసారైనా సక్సెస్ అవుతుందా అంటే అనుమానమే అంటున్నారు. ఇప్పటికే ఓటమితో నైరాశ్యంలో ఉన్న నేతలు ఈ కమిటీల్లో అసలు ఉత్సాహంగా పనిచేస్తారా అనేది కూడా నమ్మకం తక్కువే. పైగా కమిటీల్లో ఇంచుమించు 70 శాతం నేతలు తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన వారే. వారంతా ఇప్పుడు సైలెన్స్ మోడ్ లో ఉన్నారు. గాంధీ భవన్ వైపు కూడా రావడం లేదు. ఇక, కమిటీలు నియమించే వరకు బాగానే ఉన్నా.. అసలు వారు ఏమి చేయాలనేది కూడా క్లారిటీ లేదని తెలుస్తోంది. ఇవే కమిటీలు, ఈ నేతలే పనిచేసినా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడింది. అయితే, ఓటమికి కారణాలు పూర్తిగా విశ్లేషించని అధిష్ఠానం ఇలా మళ్లీ పాత దారిలోనే వెళ్తే లాభం లేదని పార్టీ నేతలే అంటున్నారు. మరి, ఈసారైనా కాంగ్రెస్ అధిష్ఠానం ప్రయత్నం ఫలిస్తుందో లేదో చూడాలి.