సెకండ్ వేవ్.. మావోయిస్టులకు…?
దండకారణ్యంలో మావోయిస్టులకు కరోనా టెన్షన్ పెడుతోంది. అడవుల్లో మావోయిస్టు అగ్రనేతలను సైతం ఈ మహమ్మారి వదలడం లేదు. అగ్ర నేతలు కరోనా పాజిటివ్ తో పోరాడుతున్నారనే ప్రచారం [more]
దండకారణ్యంలో మావోయిస్టులకు కరోనా టెన్షన్ పెడుతోంది. అడవుల్లో మావోయిస్టు అగ్రనేతలను సైతం ఈ మహమ్మారి వదలడం లేదు. అగ్ర నేతలు కరోనా పాజిటివ్ తో పోరాడుతున్నారనే ప్రచారం [more]
దండకారణ్యంలో మావోయిస్టులకు కరోనా టెన్షన్ పెడుతోంది. అడవుల్లో మావోయిస్టు అగ్రనేతలను సైతం ఈ మహమ్మారి వదలడం లేదు. అగ్ర నేతలు కరోనా పాజిటివ్ తో పోరాడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. పదుల సంఖ్యలో మావోయిస్టులు కరోనాతో అస్వస్థతకు గురైనట్లుగా ప్రచారం జరుగుతుంది. ఒకవైపు పోలీసులు.. మరోవైపు కరోనా మహమ్మారి మావోయిస్టులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కానీ పోలీసులు మాత్రం కరోనా సాకుతో మావోయిస్టులను అరెస్ట్ చేయాలని ప్రచారం చేస్తున్నారు. కోవర్టులు ద్వారా ఆహరం లో విషం కలిపి పంపుతున్నారని , అందుచేతనే అనారోగ్యం పాలవుతున్నట్లు దక్షిణ సబ్ జోనల్ బ్యూరో మావోయిస్టు పార్టీ ప్రకటన చేసింది.
సెకండ్ వేవ్ తీవ్రతతో….?
తెలంగాణ సరిహద్దులోని మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లోని బస్తర్, బీజాపూర్, సుక్మా, చంద్రాపూర్, గడ్చిరోలి జిల్లాల్లోని దండకారణ్యంలో రెండు దశాబ్దాలుగా మావోయిస్టులు కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉండడంతో మావోయిస్టులకు కూడా కరోనా వ్యాపించినట్లుగా ప్రచారం జరుగుతోంది. కరోనా చికిత్స కోసం దండకారణ్య స్పెషల్ జోనల్ డివిజన్ కార్యదర్శి శోభరాయ్ అలియాస్ మధుకర్‌తో పాటు ఓ బాలుడు జూన్ 1వ తేదీన వరంగల్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందేందుకు వస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. వారి సమాచారం మేరకు మావోయిస్టు అగ్రనేతలు 12 మందికిపైగా కరోనాతో బాధపడుతున్నట్లుగా పోలీసులు అంచనాకు వచ్చారు.
కరోనా పేరు చెప్పి….?
కరోనా బారీన పడిన అగ్రనేతల్లో కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్ , తిప్పరి తిరుతి ఆలియాస్ దేవుజీ , యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ , చొక్కారావు అలియాస్ దామోదర్ , కటకం రాజిరెడ్డి అలియాస్ ధర్మన్న,కట్టా రాంచందర్ రెడ్డి అలియాస్ వికల్స్, ములా దేవేందర్ రెడ్డి అలియాస్ మాస దడ, కున్‌కటి వెంకటయ్య అలియాస్ వికాస్, ముచ్చకి ఉజల్ అలియాస్ రఘు, కొడి మంజుల అలియాస్ నిర్మల, పూసం పద్మ , కాకర్ల సునీత అలియాస్ బుర్రా కరోనా బారీన పడినట్లు సమాచారం. దీంతో కరోనా బారిన పడిన నేతలు పోలీసులు ముందు లొంగిపోతే తామే వైద్య పరీక్షలు చేయిస్తామని ప్రకటించడం తో మావోయిస్టు పార్టీ ఒంటికాలుతో లేచింది. కరోనా ను సాకు చూపి మావోయిస్టు లను అరెస్ట్ చేయాలనీ చూస్తుందని , మావోయిస్టు నేత మధుకర్ అలియాస్ శోబ్రాయ్ ను పోలీసులు హత్య చేసి కరోనా తో చనిపోయినట్లు ప్రకటన చేశారని లేఖ లో పేర్కొన్నారు. మధుకర్ తోపాటు మే 27 తేదీన పీల్జీఏ కి చెందిన ఫ్లాటూన్ కమాండర్ గంగాళ్ ను కూడా పోలీసులు ఇదే తరహా లో హత్య చేశారని మావోయిస్టు పార్టీ ఆరోపిస్తుంది ..
ఒప్పందాలను తుంగలో తొక్కి…?
అత్యంత తీవ్ర అనారోగ్యపాలైనందున దండకారణ్యం నుండి మెరుగైన వైద్య సేవల కోసం బయటికి పంపితే ఇద్దరు మావోయిస్టులను అవమానవీయంగా పోలీసులు కరోనా పేరుతో హత్య చేశారని సంచలన ఆరోపణలు చేసింది మావో యిస్టు పార్టీ .. ఇక పౌర సంఘాల నేతలు సైతం మావోలకు కరోనా అంశం పై స్పందించారు. మావోయిస్ట్ అగ్రనేతలు కరోన బారీన పడ్డారు అనేది ప్రచారమా , వాస్తవం అనేది తెలియాలని , కరోనా సాకు తో మావోయిస్టులు ఉద్యమాన్ని అణచివేయలని పోలీసులు చూస్తున్నారన్నారు పౌర హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్. తాత్కాలికంగా పోలీసులకు ఫలితం కనిపించవచ్చు, కానీ దీర్ఘకాలం లో సమాజం ఒప్పుకోదన్నారు. దండకారణ్యంలో అగ్ర నేతలకు కరోనా సోకిందనేది ప్రచారం మాత్రమేనని, దాన్ని సాకుగా చూపెట్టి మావోలు లొంగిపోవాలని పోలీసులు చెపుతున్నారు అన్నారు .. జెనివా ఒప్పందం ప్రకారం రసాయన పదార్థాలు వాడకూడదని అంతర్జాతీయ యుద్ధ నియమాలు తుంగలో తొక్కుతున్నారన్నారు.
అనేక ఆరోగ్య సమస్యలతో…?
కరోనా తో పాటు ఇతర ఆరోగ్య సమస్యల తో బాధపడుతున్న వారికి చికిత్స అందించే విషయంలో మావోయిస్టు పార్టీ అధినాయకత్వం తీవ్రమైన ఆంక్షలు విధిస్తోందన్న ప్రచారం జరుగుతోంది. మరీ తీవ్రంగా… అదీ ప్రాణాపాయంలో ఉన్న సమయంలోనే చికిత్సకు అనుమతి ఇస్తుండడంతో పరిస్థితి విషమించి ప్రాణాలమీదకు వస్తోందని తెలిసింది. తాజాగా అరెస్ట్ అయిన మావోయిస్టులు పోలీసులకు అక్కడి పరిస్థితిని పూస గుచ్చినట్టు వివరించినట్టు, దీంతో మావోయిస్టుల ఉనికి మొత్తం పోలీసులు చేతుల్లో ఉన్నట్లు సమాచారం. ఇది పార్టీ కి రాబోయే రోజుల్లో తీవ్ర నష్టం చేకూర్చడం ఖాయమన్న అంచనాలో పోలీసులు ఉన్నారు. ఏదిఏమైనా దశాబ్దాలుగా సాయుధ పోరాటం చేస్తున్న మావోయిస్టులకు …కరోనా మహమ్మారి శరాఘాతం గా మారుతోంది.