రేపటికి ఉంటమా? ఛస్తామా… మీడియా మానియా..?
కరోనా నిజంగానే దేశాన్ని భయపెడుతోంది. కానీ ఇది భారతదేశాన్ని తుడిచిపెట్టేస్తుందా? విషమ స్థితికి తీసుకుని వెళ్లిపోతుందా? లాక్ డౌన్ విధించక తప్పని పరిస్తితి ఏర్పడుతుందా? వీటన్నిటికీ ప్రసార, [more]
కరోనా నిజంగానే దేశాన్ని భయపెడుతోంది. కానీ ఇది భారతదేశాన్ని తుడిచిపెట్టేస్తుందా? విషమ స్థితికి తీసుకుని వెళ్లిపోతుందా? లాక్ డౌన్ విధించక తప్పని పరిస్తితి ఏర్పడుతుందా? వీటన్నిటికీ ప్రసార, [more]
కరోనా నిజంగానే దేశాన్ని భయపెడుతోంది. కానీ ఇది భారతదేశాన్ని తుడిచిపెట్టేస్తుందా? విషమ స్థితికి తీసుకుని వెళ్లిపోతుందా? లాక్ డౌన్ విధించక తప్పని పరిస్తితి ఏర్పడుతుందా? వీటన్నిటికీ ప్రసార, ప్రచురణ మాధ్యమాలు తమ సొంత కల్పనలతో సమాధానం చెప్పేస్తున్నాయి. తమ వాదనకు మద్దతుగా నిలిచే పబ్లిసిటీ స్టంట్ మాస్టర్లనే నిపుణులుగా పిలుస్తూ దేశ ప్రజల ముందు భయానక చిత్రాన్ని ఆవిష్కరిస్తున్నాయి. . కంటి మీద కునుకుపట్టని పరిస్థితిని కల్పిస్తున్నాయి. రేపటికి ఉంటామా? లేదా? అన్నంతటి ఒక విచిత్ర మానసిక భావోద్వేగానికి, ఉన్మాదానికి దిగజారిపోయే కథనాలను మీడియా ప్రసారం చేస్తోంది. ఫలితంగా దేశ జనాభాలో అత్యధికశాతం ప్రజలు సైకలాజికల్ ట్రామాలోకి వెళ్లిపోయినట్లు తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ప్రజలను అప్రమత్తం చేయాలి. ప్రభుత్వాలను హెచ్చరించడమూ తప్పు కాదు. కానీ అత్యుత్సాహంతో ఉన్న విషయాన్ని పదింతలు చేసి చెప్పడం, భయానక కల్పిత వాతావరణానికి పట్టం గట్టడం ఇప్పుడు దేశంలో సాధారణ దృశ్యంగా మారింది.
అర్ధ సత్యాలు…
ఏ టీవీ చానల్ చూసినా, ఏ పత్రిక చూసినా ఒకటే మృత్యుఘోష వినవస్తోంది. ఆర్తనాదాలు, మరణ శయ్యపై వేదనలు, ఆరని కాష్టాలతో దేశం తల్లడిల్లిపోతోందనే భావన ప్రజలందరిలో నాటుకుపోయింది. మీడియా తన విశ్వరూపంతో భయోత్పాతాన్ని సృష్టిస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే ఆయా కధనాలను చూసి, చదివి చాలా మంది మానసిక భ్రాంతికి లోనవుతున్నారు. కోవిడ్ స్వల్ప లక్షణాలున్నప్పటికీ తమకు బెడ్ దొరకదేమోననే ముందస్తు జాగ్రత్తలు ఎక్కువైపోయాయి. మధ్యతరగతి పైస్తాయి వర్గాలు తమకు తెలిసిన ఆసుపత్రుల్లో బెడ్ లను బ్లాక్ చేసి ఉంచుకుంటున్న రిపోర్టులు వినవస్తున్నాయి. ఇంటివద్దనే చికిత్స తీసుకుంటే సరిపోయేవారు సైతం ఆసుపత్రుల్లో అడ్వాన్సుగా చేరిపోతున్నారు. పోటెత్తుతున్న మీడియా రిపోర్టుల ఆధారంగానే విదేశాలు భారత్ ను ఇప్పుడు ఒక అంటరాని దేశంగా చూస్తున్నాయి. భారత్ నుంచి తమకు ఏదో ఉపద్రవం వచ్చిపడబోతోందని వణికి పోతున్నాయి. ఇదంతా స్వదేశీ మీడియా సృష్టిస్తున్న అల్లకల్లోలమే. తమ టెలివిజన్ రేటింగ్ కాపాడుకోవడానికి, రీడర్షిప్ పెంచుకోవడానికి అనుసరిస్తున్న ఎత్తుగడల్లో కరోనా కూడా ఒక భాగమై పోయింది. సాధారణంగా ఏదేని సంఘటన జరిగినప్పుడు దాని స్థాయిని, తీవ్రతను పెంచి చెప్పడం మీడియా లక్షణం. ప్రేక్షకులు, పాఠకుల దృష్టిలో విషయాన్ని భూతద్దంలో చూపిస్తారు. దానివల్ల ప్రజల అటెన్షన్ పెరుగుతుందనేది అంచనా. కానీ కల్లోలకారకమైన కరోనా విషయంలోనూ అదే ఎత్తుగడ అనుసరించడం దిగ్భ్రాంతి కరం. ప్రజలకు ఏమాత్రం ధైర్యం, భరోసా ఇచ్చే ఒక్క రిపోర్టు కూడా రావడం లేదు. దేశం ఈ ఉత్పాతంలో ఊడ్చుకు పెట్టుకుపోవడం ఖాయమన్నట్టుగానే మీడియా తన విశ్రుంఖలత్వాన్ని ప్రదర్శిస్తోంది.
వక్రీకరణలు…
భారత్ ఆరోగ్య వ్యవస్థ ప్రమాదకరంగానే ఉంది. కానీ ప్రజలు అప్రమత్తమైతే బయటపడటం కష్టం కాదు. ఈ సమయంలో కావాల్సింది భరోసా, అవగాహన. ప్రభుత్వానికి మార్గదర్శకత్వం. మీడియా ఈ విషయంలో తన పాత్రను పోషించడం లేదు. దురద పుట్టినా, కాలు తిమ్మిరి వచ్చినా , నీరసంగా కనిపించినా, అసలు పడుకున్నప్పుడు లేవడానికి బద్దకంగా అనిపించినా కోవిడ్ కావచ్చనే బ్రాంతికి లోను చేస్తోంది. నిపుణుల పేరిట రకరకాల వాదనలతో వస్తున్న వార్తలు, వాదనలకు కథన రూపమిచ్చి ప్రాధాన్యం కల్పిస్తోంది. దీనివల్ల నిరక్షరాస్యులు, గ్రామ ప్రాంతాల ప్రజలే కాదు, విద్యావంతులే ఎక్కువ ప్రభావానికి గురవుతున్నారు. ఏదేని అంటు వ్యాధి ప్రబలినప్పుడు పదిశాతం జనాభా దాని బారిన పడితే తీవ్రమైన రుగ్మతగా భావిస్తారు. అదే 20శాతానికి చేరితే దానిని అతి తీవ్రమైన విషయంగా పరిగణిస్తారు. 25 శాతం దాటితే అదుపు చేయలేని రుగ్మతగా గుర్తిస్తారు భారత్ లో అధికారిక గణాంకాల ప్రకారం నూటికి ఒక్కరికి కూడా ఈ వ్యాధి సోకలేదు. ఇకపై విస్తరణ వేగాన్ని అడ్డుకోవాలంటే ప్రజలు జాగ్రత్తలు పాటించాలి. ప్రభుత్వం తగిన చికిత్సా చర్యలు తీసుకోవాలి. అమెరికా వంటి విదేశాల్లో తొలిదశలో కరోనా సోకినవారిలో మరణాల రేటు మూడు శాతం వరకూ ఉంటే భారత్ లో అది నూటికి ఒకటి మాత్రమే. గ్రామీణ భారతావనిలో తీవ్రత ఏమాత్రం కనిపించడం లేదు. అంటే నూటికి 70శాతం ప్రజలు సురక్షితంగానే ఉన్నారు. పట్ఠణాలలోనూ మెట్రో, కాస్మొపాలిటన్ నగరాలు, అదిక జనసమ్మర్థం ఉన్న ప్రాంతాల్లోనే తీవ్రంగా ఉంది. అంటే జాగ్రత్తలు తీసుకుంటే అదుపు చేయడం సాధ్యమే. ఇవన్నీ పాజిటివ్ అంశాలు . మన దేశం కరోనాను తట్టుకుని నిలబడగలుగుతుందన్న భరోసా నిచ్చే వాస్తవాలు. కానీ మీడియా ఇవేమీ పట్టించుకోవడం లేదు. దేశం మొత్తాన్ని ఒకే గాటన కట్టి ఇక మన పని అయిపోయిందన్నట్లుగానే కథనాలు ప్రసారమవుతున్నాయి.
ప్రాణాలు బెంబేలు….
కొన్ని స్వచ్చంద సంస్థలు వైద్యుల అభిప్రాయాలను సేకరించాయి. ప్రస్తుతం ఆసుపత్రుల్లో ప్రత్యేకించి ప్రయివేటు ఆసుపత్రుల్లో చేరుతున్న వారిలో 62 శాతం మందిలో తీవ్రత నామమాత్రమే. వారు ఇంటివద్దనే చికిత్స పొందితే సరిపోతుంది. కానీ భయాందోళనలు, కుటుంబ సభ్యుల ఒత్తిడి, ఇన్సూరెన్సు సదుపాయాలు రకరకాల కారణాలతో ముందస్తుగానే ఆసుపత్రులలో చేరిపోతున్నారు. బీపీ, షుగర్, గుండెపోటు, ఇతర అనుబంధ రోగాలున్న వారు మనో దైర్యంతో ఉన్నప్పుడే దేనినైనా జయించగలుగుతారు. కానీ ఆసుపత్రుల్లో చేరిన తర్వాత వారి పరిస్థితి మరింత దిగజారుతోంది. గుండె నిబ్బరం కోల్పోతున్నారు. తమకు ఏదో జరిగిపోతోందనే భావనకు లోనవుతున్నారు. పలితంగా రోగనిరోధక వ్యవస్థ పనిచేయడం లేదు. రోగం ప్రాణాంతకమవుతోంది. ఒక రకంగా కరోనాకు సరెండర్ అయిపోతున్నారు. గుండెపోటు ఇతర కారణాలతో చనిపోతున్నారు. అసలు రోగం కంటే మానసిక అస్వస్థత పెరిగిపెద్దదైపోతోంది. సోషల్ మీడియాలోనూ, మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ వస్తున్న వార్తలు ప్రజలనే కాదు, డాక్టర్లను సైతం అయోమయంలో పడేస్తున్నాయి. ప్రజలు సైకలాజికల్ ట్రామాలో ఉంటే ప్రభుత్వం, డాక్టర్లపై ఒత్తిడి పెరిగిపోతోంది. ఇదంతా మీడియా చలవే అని చెప్పాలి. నిజంగానే మరోసారి దేశంలో లాక్ డౌన్ విధించక తప్పని పరిస్థితిని మీడియా కల్పిస్తోంది. ప్రసార మాధ్యమాల ఒత్తిడి నుంచి తాత్కాలికంగా గట్టెక్కడానికి దానినే మార్గాంతరంగా ప్రభుత్వం ఎంచుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు. అసంఘటిత రంగంలో కూలీనాలీ చేసుకుని బ్రతికేవారు దేశ జనాభాలో 86శాతం ఉన్నారు. వారి జీవితం ఇప్పటికే చిద్రమై పోయింది. కరోనా చావుల సంగతి పక్కనపెట్టండి. మళ్లీ లాక్ డౌన్ విధిస్తే ఆకలి చావులు, ఆత్మహత్యలు చేసుకునే వారి సంఖ్య రెండింతలు, మూడింతలు ఉంటుంది. రోగానికి విరుగుడు భయపెట్టడం కాదు, భరోసానిచ్చి భుజం తట్టడం, భవిష్యత్తుపై ఆశలు కలిగించడం. ఇప్పటికైనా రెక్కలు తెగినట్లు రెచ్చిపోతున్న మీడియా ఈ విషయాన్ని గుర్తిస్తే దేశానికి ఎంతో మేలు చేసినట్లవుతుంది.
-ఎడిటోరియల్ డెస్క్