సైకిల్ స్పీడెంత..? ఫ్యాన్ జోరెంత..?
ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి ఎవరో తేలడానికి మరికొన్ని గంటల సమయమే ఉంది. ఎవరు గెలుస్తారనే ఉత్కంఠకు తెరపడనుంది. 43 రోజులుగా ఈవీఎంలలో నిక్షిప్తమై ఉన్న నేతల భవితవ్యం [more]
ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి ఎవరో తేలడానికి మరికొన్ని గంటల సమయమే ఉంది. ఎవరు గెలుస్తారనే ఉత్కంఠకు తెరపడనుంది. 43 రోజులుగా ఈవీఎంలలో నిక్షిప్తమై ఉన్న నేతల భవితవ్యం [more]
ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి ఎవరో తేలడానికి మరికొన్ని గంటల సమయమే ఉంది. ఎవరు గెలుస్తారనే ఉత్కంఠకు తెరపడనుంది. 43 రోజులుగా ఈవీఎంలలో నిక్షిప్తమై ఉన్న నేతల భవితవ్యం మరికాసేపట్లో తేలనుంది. 7 గంటలకు ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది ఎన్నికల సంఘం. మొదట సర్వీస్ ఓట్లు, పోస్టల్ బ్యాలెట్ ఓట్లను అరగంట పాటు లెక్కించనున్నారు. తర్వాత ఈవీఎంల ఓట్ల కౌంటింగ్ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 12 గంటల వరకు కౌంటింగ్ ట్రండ్స్ పూర్తిగా తెలియనున్నాయి. మధ్యాహ్నానికల్లా ఎవరు విజయం సాధిస్తారో, ఏ పార్టీ అధికారంలోకి రానుంది ఓ స్పష్టత వస్తుంది. అయితే, సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం ప్రతీ నియోజకవర్గంలో ఐదు వీవీప్యాట్ల స్లిప్పులను లెక్కించాల్సి ఉన్నందున అధికారికంగా ఫలితాలు రావడానికి కొంత సమయం పట్టవచ్చు.
హోరాహోరీ పోరు జరగడంతో
గతంలో ఎన్నడూ లేనంత హోరాహోరీగా ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలను తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు జీవన్మరణ సమస్యలా భావించి గెలుపే లక్ష్యంగా అన్ని అస్త్రాలను ప్రయోగించాయి. ఈసారి కూడా అధికారం కాపాడుకొని జగన్ ను ప్రతిపక్షానికే పరిమితం చేస్తే వైసీపీని పూర్తిగా దెబ్బతీయవచ్చని తెలుగుదేశం భావించింది. ఇక, ఇప్పటికే పార్టీ స్థాపించి తొమ్మిదేళ్లు అయినా అధికారంలోకి రాకపోవడంతో ఈ ఎన్నికలు అత్యంత కీలకంగా తీసుకున్నారు జగన్. కచ్చితంగా ఈసారి అధికారంలోకి రాకపోతే పార్టీ భవిష్యత్తే ప్రమాదంలో పడుతుందనేది వైసీపీ నేతల ఆందోళన. ఇక, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఆ పార్టీ భవిష్యత్ కు కూడా ఈ ఎన్నికలు కీలకమే. అధికారంలోకి రాకపోయిన పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు స్థానాలతో పాటు గౌరవప్రదమైన సంఖ్యలో సీట్లు దక్కించుకుంటేనే ఆ పార్టీకి మనుగడ ఉండే అవకాశం ఉంది. దీంతో ఎన్నికల వేళ పవన్ కూడా బాగానే కష్టపడ్డారు.
ఉత్కంఠ పెంచిన ఎగ్జిట్ పోల్స్
ప్రధాన పోటీ తెలుగుదేశం, వైసీపీ మధ్యే జరిగింది. రెండు పార్టీలూ ఎక్కడా వెనక్కు తగ్గకుండా ఎన్నికల్లో తలపడ్డాయి. చంద్రబాబు నాయుడు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎన్నికలకు సన్నద్ధం అవడంతో పాటు పార్టీని కూడా సిద్ధం చేశారు. రెండుమూడు నెలల పాటు ఆయన అర్థరాత్రి వరకు కూడా ఎన్నికల పనుల్లో మునిగిపోయారు. ఇక, జగన్ సైతం విజయమే లక్ష్యంగా రెండేళ్లుగా కష్టపడుతున్నారు. 14 నెలల పాటు ఆయన సుదీర్ఘ పాదయాత్ర చేసి ప్రజల్లోకి వెళ్లారు. హోరాహోరీ పోరు జరగడంతో ఎవరికీ గెలుపోటములపై అంచనా రావడం లేదు. ఎగ్జిట్ పోల్స్ కూడా ఒక స్పష్టత ఇవ్వలేకపోయాయి. మెజారిటీ సంస్థలు వైసీపీ అధికారంలోకి వస్తాయని చెప్పినా పలు సంస్థలు తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని చెప్పడంతో ఇంకా ఉత్కంఠ పెరుగుతోంది. రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. మరి, ఇవాళ ఎవరి జాతకాలు ఎలా ఉన్నాయో తేలిపోనుంది. జగన్ తన లక్ష్యాన్ని చేరుకుంటారా.? చంద్రబాబు మరోసారి కింగ్ అవుతారా..? చూడాలి.