మేమింతే… మారబోమంతే…?
తాటి చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడ గడ్డి కోసమని సమాధానం చెప్పాడట వెనకటికి ఒకాయన. తాగుబోతు తెలివితేటలు అలాగే ఉంటాయి. ఎవరు ఏమనుకుంటే నాకేమిటి? ఏదో ఒక [more]
తాటి చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడ గడ్డి కోసమని సమాధానం చెప్పాడట వెనకటికి ఒకాయన. తాగుబోతు తెలివితేటలు అలాగే ఉంటాయి. ఎవరు ఏమనుకుంటే నాకేమిటి? ఏదో ఒక [more]
తాటి చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడ గడ్డి కోసమని సమాధానం చెప్పాడట వెనకటికి ఒకాయన. తాగుబోతు తెలివితేటలు అలాగే ఉంటాయి. ఎవరు ఏమనుకుంటే నాకేమిటి? ఏదో ఒక సమాధానం చెప్పేస్తే చాలు అనుకుంటాడు. కేంద్ర ప్రభుత్వ వైఖరి అచ్చం ఆ మొరటు సామెతను తలపింపచేస్తోంది. వాక్సిన్లు, మెడికల్ ఆక్సిజన్, వైద్య ఉపకరణాలపై జీఎస్టీ రద్దు చేయమని డిమాండ్లు వస్తున్నాయి. చాలా రాష్ట్రప్రభుత్వాలు ఈ విషయంలో కేంద్రానికి విజ్ణప్తి చేస్తున్నాయి. జీఎస్టీ రద్దు చేస్తే వినియోగదారులపైన భారం పడుతుందంటూ కేంద్రం వితండ వాదం మొదలు పెట్టింది. పైపెచ్చు మేము విధించే జీఎస్టీలో సగం మీకు కూడా ఇస్తున్నాం కదా.. అంటూ రాష్ట్రాలను మచ్చిక చేసే ప్రయత్నమూ చేస్తోంది. తోలు వలచి ప్రజలపై విధించే పన్నులను మనమూ మనమూ పంచుకుందామంటూ రాష్ట్రాలను బులిపిస్తోంది. ఒకవేళ జీఎస్టీ రద్దు చేస్తే తయారీ దారులు ముడిపదార్థాలు, సేవలకు చెల్లించిన పన్నులను రాబట్టుకోలేక ధరలు పెంచేస్తారనే సాకు చెబుతోంది. ధరలను అదుపులో ఉంచేందుకే వాటిపై జీఎస్టీ విధిస్తున్నామంటూ కొత్త వాదన ముందుకు తెస్తోంది. ఇవన్నీ కట్టుకథలు, ఊహా జనితాలు అంటూ ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తయీరీదారులకు పరిహారం కేంద్రం చెల్లించవచ్చని , కావాలనే జీఎస్టీని రద్దు చేయడం లేదని స్పష్టంగా చెబుతున్నారు.
సున్నితత్వం శూన్యం..
ప్రజాప్రభుత్వానికి ఉండాల్సిన సున్నితత్వాన్ని కేంద్రం కోల్పోయింది. మెడికల్ ఉపకరణాలు, మందులపై జీఎస్టీ తీసేయమని రాష్ట్రాలే డిమాండ్ చేస్తున్నాయి. అందువల్ల వాటికీ కొంత నష్టం వాటిల్లుతుంది. దానిని భరించేందుకు సిద్దంగా ఉన్నాయి. అయినప్పటికీ కేంద్రం తన వాటా పన్నును వదులుకోవడానికి సిద్దంగా లేదు. అందుకే పన్నులు కొనసాగిస్తోంది. పైపెచ్చు ఈ కొత్త పధ్దతిని అమలు చేస్తే భవిష్యత్తులో మరిన్ని డిమాండ్లు రావచ్చనే భయమూ కారణం కావచ్చు. తమకు మంచి చేస్తాయని ప్రభుత్వాలను ప్రజలు ఎన్నుకుంటారు. ముక్కుపిండి పన్నులు రాబట్టుకోవడమే ధ్యేయంగా పనిచేస్తారని కలలో కూడా ఊహించరు. మమతా బెనర్జీ లేఖకు కేంద్ర ఆర్థిక మంత్రి ఇచ్చిన సమాధానంతో ఒక విషయం స్పష్టమైపోయింది. కేంద్ర ప్రభుత్వానికి ప్రజలతో సంబంధాలు తెగిపోయాయి. ప్రజలు ఏమనుకుంటున్నారో, ఎలా స్పందిస్తున్నారో కూడా ఆలోచించేందుకు సిద్ధపడటం లేదు. మమతా బెనర్జీ ప్రజలతో మమైకమై తిరిగే మాస్ లీడర్. ప్రజలకు కావాల్సింది ఏమిటో ఆమెకు బాగా తెలుసు. దానిని స్వీకరించేందుకు సిద్దంగా లేకపోవడం కేంద్ర ప్రభుత్వ మూర్ఖత్వం.
బ్రిటిష్ రాజ్ ను తలపిస్తారా..?
పూర్వకాలంలో రాజులు, ఆ తర్వాత బ్రిటిష్ పాలకులు దేశ ప్రజలతో సంబంధాలు లేకుండా ఇష్టారాజ్యంగా పన్నులు విధించేవారు. గడ్డం పెంచుకుంటే పన్ను, తీర్థయాత్రకు వెళితే పన్ను, ఉప్పుపై పన్ను ఇలా నానారకాలుగా వేధించేవారు. ఆ తీరును నయా పాలకులు తలపింపచేస్తున్నారు. దేశం విలవిలలాడిపోతోంది. రెండు నెలలపాటు ఎన్నికల పుణ్యమా అంటూ సెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెంచకుండా ఉంచారు. తాజాగా నాలుగు రోజుల నుంచి వరసగా పెరుగుతున్నాయి. ప్రజల ఆదాయం పడిపోయింది. ఉపాధి కోల్పోతున్నారు. నిత్యావసరాల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. బ్యాంకుల్లో ఖాతా ఉంటే చాలు జీఎస్టీ రూపంలో నెలవారీ కొంత మొత్తం వసూలు చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని పన్ను ఇది. ఈ ఎన్డీఏ ప్రభుత్వంలోనే ప్రవేశపెట్టారు. అంతకుముందు తమ కాతాదారులకు బ్యాంకులు ఉచితంగాఈ సేవలను అందించేవి. చట్టబద్ధమైన దోపిడీగా ప్రజల నుంచి పన్నులు రాబడుతున్నారు. మతం కార్డు, భావోద్వేగాలు ఎల్లకాలం పని చేయవు. మరోసారి అధికారంలోకి రాకపోయినా ఫర్వాలేదనుకుంటున్న నాయకులకు ప్రజలే సకాలంలో బుద్ధి చెబుతారు.
మీతోనే మేము…
తెలుగు రాష్ట్రాలది విచిత్రమైన పోకడ. మమత బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, నవీన్ పట్నాయక్ వంటి ముఖ్యమంత్రులు తమ ప్రజలకోసం డిమాండ్లు పెడుతూ కేంద్రాన్ని నిలదీసే ప్రయత్నం చేస్తున్నారు. మన రాష్ట్రాల్లో కక్ష సాధింపు రాజకీయాలకే పెద్ద పీట. ఈటల రాజేందర్ టార్గెట్ గా ఐఏఎస్ ల బృందాల నియామకాన్ని హైకోర్టు తప్పు పట్టింది. ఇప్పుడున్న పరిస్థితులు ఏమిటి? ప్రభుత్వ వైఖరి ఏమిటంటూ నిరసన వ్యక్తం చేసింది. అటు ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడిపై కేసు పెట్టి సవాల్ విసురుతోంది ప్రభుత్వం. దానిపై కొందరు టీడీపీ సానుభూతిపరులు రాష్ట్ర మంత్రిపై కేసు పెట్టారు. మొత్తమ్మీద ఈ రెండు రాష్ట్రాలు కేంద్రం తరహాలోనే వింత పోకడలతో ప్రవర్తిస్తున్నాయి. వ్యవస్థలను దుర్వినియోగం చేసే తెగింపు, తమకు చెప్పేవారెవరన్న అహంకార ధోరణి ప్రబలిపోతున్నాయి. తాత్కాలికంగా సంతృప్తి కలిగించినా పాలకులకు దీర్ఘకాలంలో ఇటువంటి నిర్ణయాల వల్ల కీడే జరుగుతుంది.
– ఎడిటోరియల్ డెస్క్