ఇద్దరిలో ఎవరి వైపు…?
అమెరికా రెండు శతాబ్దాల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ప్రత్యేక పరిస్థితుల్లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. మహిళలు ప్రచారపర్వంలో ముందుండటం, వలస ఓటర్లకు విపరీతమైన డిమాండ్ [more]
అమెరికా రెండు శతాబ్దాల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ప్రత్యేక పరిస్థితుల్లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. మహిళలు ప్రచారపర్వంలో ముందుండటం, వలస ఓటర్లకు విపరీతమైన డిమాండ్ [more]
అమెరికా రెండు శతాబ్దాల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ప్రత్యేక పరిస్థితుల్లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. మహిళలు ప్రచారపర్వంలో ముందుండటం, వలస ఓటర్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడటం, ఆర్థిక వ్యవస్థ అధ్వానంగా ఉండటం, కోవిడ్ ప్రభావం, అంతర్జాతీయంగా అమెరికా ఆధిపత్యానికి సవాళ్లు చైనా నుంచి ఎదురవుతుండం వంటి ప్రత్యేక పరిస్థితుల్లో నవంబరు 3న ప్రజలు కొత్త అధినేతను ఎన్నుకోనున్నారు. ప్రచారపర్వంలో మహిళా నేతలు ముందుండటం అన్నింటికీ మించి ఆసక్తికరం. అదీ వారు బారతీయ సంతతికి చెందినవారు కావడంతో ఆసక్తి మరింత అధికమైంది.
అంతా ఆమె చుట్టూనే…
డెమొక్రటిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థిగా భారతీయ సంతతికి చెందిన కమలా హారిస్ ఎంపికతోనే అధ్యక్ష ఎన్నికలు రసకందాయంలో పడ్డాయి. భారతీయ, ఆఫ్రికా మూలాలు వ్యక్తి కావడంతో అధ్యక్ష అభ్యర్థులు ట్రంప్, బైడెన్ ప్రాధాన్యం తగ్గింది. ప్రచారం అంతా ఆమె చుట్టూనే తిరగడం మొదలైంది. ఒక దశలో రిపబ్లికన్లకు ఈ పరిస్థితి సంకటంగా మారింది. దీనిని ఎలా అధిగమించాలో తెలియక తలలు పట్టుకున్నారు. ప్రస్తుతానికి భారత్ తో మంచి సంబంధాలనే నెరపుతున్నప్పటికీ ప్రవాస భారతీయులు ఎక్కడ కమలా హారిస్ వైపు ఏకపక్షంగా మొగ్గు చూపుతారోనని రిపబ్లికన్లు కలవరపడ్డారు. ఈ పరిస్థితుల్లో తమ ఉపాధ్యక్ష అభ్యర్థిగా భారతీయ మూలలున్న మహిళను నామినేట్ చేయాలని తలపోసింది.
నిక్కీ హేలినీని తీసుకొచ్చి…..
సౌత్ కరోలినా సెనెటర్ అయిన నిక్కీ హేలీని రంగంలోకి దించాలని యోచించింది. కానీ చివరి నిమిషంలో ప్రస్తుత ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ను నామినేట్ చేసింది. పెన్స్ మాజీ గవర్నర్. కమలా హరిస్ కు విరుగుడుగా నిక్కీ హేలీని తెరపైకి తీసుకు వచ్చింది రిపబ్లికన్ పార్టీ. హేలీ కూడా కమల మాదిరిగానే కాకలుతీరిన రాజకీయ వేత్త. వాగ్దాటి గల నాయకురాలు. పార్టీ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటూ దూసుకుపోతున్న నేత. ఈ ప్రత్యేకతలతోపాటు భారతీయ మూలాలున్న మహిళా నాయకురాలుకావడంతో పార్టీ ఆమె వైపు మొగ్గు చూపింది. ఉపాధ్యక్ష అభ్యర్థిత్వం ఇవ్వనప్పటికీ కీలకమైన ప్రచార బాధ్యతలు అప్పచెప్పడంతో నిక్కీ హేలీ ఒక్కసారి వార్తల్లో వ్యక్తిగా మారిపోయారు.
పంజాబ్ నుంచి వలస వచ్చి….
నిక్కీ హేలీ కుటుంబం దశాబ్దాల క్రితం భారత్ లోని పంజాబ్ నుంచి వలస వచ్చింది. సిక్కుల పవిత్ర స్వర్ణ దేవాలయం కొలువుదీరి ఉన్న అమృతసర్ వారి స్వస్థలం. అమెరకాకు వలస వచ్చి ఇక్కడే స్థిరపడింది. హేలీ పూర్తి పేరు నిమ్రత్ నిక్కీ హేలీ. ఆమె బహుముఖ ప్రతిభా శాలి. దౌత్యవేత్త, రచయిత, మంచి వ్యాపారవేత్త. 2011 నుంచి 17 వరకు సౌత్ కరోలినా గవర్నరుగా పనిచేశారు. ఉన్నత విద్య అభ్యసించిన ఆమె కీలకమైన ఐక్యరాజ్యసమితిలో అమెరికా శాశ్వత ప్రతినిధిగా పనిచేశారు. 48 సంవత్సరాల ఆమె ఇప్పుడు రిపబ్లికన్లకు తురుపు ముక్కగా మారారు. 2024 ఎన్నికల నాటికి ఆమెను పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందన్న ప్రచారం కూడా మరో పక్క జరుగుతోంది.
ఇద్దరి లో ఎవరి వైపు…?
భారతీయ మూలాలున్న మహిళా నేతలను బరిలోకి దింపినంత మాత్రాన ప్రవాస భారతీయులు ఏకపక్షంగా ఎవరో ఒకరి వైపు మొగ్గు చూపుతారనుకోడం వట్టిమాట. ఎవరో ఒకరు బరిలో ఉంటే స్వదేశాభిమానంతో వారి వైపే ప్రవాస భారతీయులు నడిచే అవకాశం ఉంటుంది. ఇప్పుడుఇద్దరూ భారతీయ మూలాలున్నవారే కావడంతో ఓట్ల విభజన అనివార్యమవుతుంది. డెమొక్రట్లకు సంప్రదాయకంగా భారతీయులు మద్దతుదారులన్న పేరుంది. కానీ గత ఎన్నకల్లో వారు ట్రంప్ వైపు మొగ్గు చూపారు. గత నాలుగేళ్లగా ట్రంప్-మోదీ సంబంధలు వ్యక్తిగతంగా బాగున్నాయి. దౌత్యపరంగా రెండు సంబంధాలు కూడాబాగానే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో సహజంగా ఎటువైపు నిలబడాలో తేల్చుకోవడం కష్టమే. అయితే వ్యక్తుల కన్నా విధానాలే ఎక్కువగా ప్రభావం చూపుతాయి. వలస విధానం, ముఖ్యంగా హెచ్ 1బి వీసా నిబంధనల సడలింపు, వర్ణ వివక్ష, అందరికీ సమాన అవకాశాలు తదితర అంశాలపై చర్చ జరుగుతోంది. భారతీయ మూలాలున్నంత మాత్రాన కమల హేరిస్, హేలీ గతంలో భారత్ ను ఎప్పుడూ ఏకపక్షంగా వెనకేసుకురాలేదు. కొన్ని సందర్భాల్లో విమర్శలు కూడా సంధించారు. కశ్మీర్ పై భారత విధానాన్ని కమలా హారిస్ సమర్థించలేదు. ఐరాసలో అమెరికా శాశ్వత ప్రతినిధిగా హేలీ కూడా భద్రతామండలిలో భారత్ కు శాశ్వత సభ్యత్వంపై సానుకూలంగా మాట్లాడలేదు. వారిద్దరూ అమెరికా విధానాలు, ముఖయంగా పార్టీ వైఖరుల మేరకే మాట్లాడారు తప్ప అంతకు మించిముందుకు పోలేదు. రేపు ఎన్నికల్లో గెలిచాక కూడా ఇందుకు భిన్నమైన పరిస్థితి ఉంటుందా అన్నది ప్రశ్నే.
-ఎడిటోరియల్ డెస్క్