దేవినేని జంప్ ఎందుకు?
తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాష్ వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. టీడీపీ నేతల ఒత్తిడి ఫలిస్తే చివరి నిమిషంలో ఏమైనా వెనకడుగు వేస్తారేమో కానీ దాదాపు అవినాష్ [more]
తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాష్ వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. టీడీపీ నేతల ఒత్తిడి ఫలిస్తే చివరి నిమిషంలో ఏమైనా వెనకడుగు వేస్తారేమో కానీ దాదాపు అవినాష్ [more]
తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాష్ వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. టీడీపీ నేతల ఒత్తిడి ఫలిస్తే చివరి నిమిషంలో ఏమైనా వెనకడుగు వేస్తారేమో కానీ దాదాపు అవినాష్ ఓ నిర్ణయానికి వచ్చేశారు. గత ఎన్నికల్లో టీడీపీ ఓటమి తర్వాత కూడా అవినాష్ చంద్రబాబు మీద బోలెడు నమ్మకం పెట్టుకున్నారు. చంద్రబాబు హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చినప్పుడల్లా ఎవరు వచ్చినా రాకున్నా అవినాష్ మాత్రం అనుచరులతో ఎదురేగి స్వాగతం పలికే వారు. మొన్నటి ఎన్నికల్లో గుడివాడ నుంచి బరిలో దిగిన అవినాష్ కొడాలి నానితో తల పడ్డారు. అక్కడ పోటీ చేయడం ఇష్టం లేకున్నా చంద్రబాబు ఆదేశం, బాబాయ్ ఉమా చాణక్యంతో పోటీ చేయక తప్పలేదు. దాదాపు 60కోట్లు గుడివాడ ఎన్నికల కోసం ఖర్చు చేసినా ఓటమి తప్పలేదు. నిజానికి నూజివీడు, పెనమలూరు స్థానాల నుంచి పోటీ చేయాలని అవినాష్ భావించారు. ఆ రెండు దక్కకపోవడం వెనుక సొంత మనుషుల కుట్రే ఎక్కువగా ఉండటం అవినాష్ ను బాధించింది. ఫలితాల తర్వాత కూడా పార్టీలో తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం దేవినేని వారసుడిలో నైరాశ్యం నింపింది.
ఎప్పుడో రావాల్సింది….
దేవినేని నెహ్రూ కుమారుడిగా 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేశారు. నాటి రాన్నికల్లో టీడీపీ గెలవడం, ఆ తర్వాత నెహ్రూ కూడా అదే పార్టీలో చేరారు. కొన్నాళ్ళకి నెహ్రూ కన్ను మూయడంతో రాజకీయంగా అవినాష్ కి అండ కరువైంది. తండ్రి బ్రతికి ఉన్న సమయంలోనే 2014 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరాలని భావించినా అందుకు రాజకీయ ప్రత్యర్థుల నుంచి అభ్యంతరాలు ఎదురయ్యాయి. వంగవీటి కుటుంబంతో ఉన్న విభేదాలు, అప్పటికే వంగవీటి రాధా వైసీపీ లో ఉండటంతో దేవినేని ఫ్యామిలీ వైసీపీలో చేరలేకపోయింది. దేవినేని కుటుంబాన్ని చేర్చుకుంటే తాను పార్టీ వీడుతానని అప్పట్లో రాధా బెదిరించినట్లు పార్టీ నేతలు చెబుతారు. రాధ ఒత్తిడితో జగన్ మోహన్ రెడ్డి కూడా దేవినేని కుటుంబాన్ని దూరం పెట్టారు.
స్వయంకృతం ఎవరిది….?
దేవినేని అవినాష్ వైసీపీ తీర్థం పుచ్చుకునే సందర్భంలో వంగవీటి రాధ గురించి తప్పకుండా చెప్పుకోవాలి 2004 ఎన్నికల్లో వైఎస్ ఆశీస్సులతో చిన్న వయసులో ఎమ్మెల్యే అయిన రాధా తన తండ్రి వారసత్వాన్ని కొనసాగించలేకపోయారు. వంగవీటి రంగా తనయుడిగా కోస్తా జిల్లాలలో ఉన్న క్రేజ్ ని రాధా తన దుడుకు స్వభావంతో కోల్పోయారు. 2009 నాటికి విజయవాడలో చిన్న చిన్న విషయాలకు గొడవలు పెట్టుకోవడం, ట్రాన్స్ పోర్ట్ కార్యాలయం ముందు డీటీసీ సంక ప్రసాద రావుకి వ్యతిరేకంగా ధర్నా చేసి వైఎస్ ఆగ్రహానికి గురవడం, హైదరాబాద్ బంజారాహిల్స్ దేవినేని నెహ్రూ భూమి క్రమ బద్దీకరణను వ్యతిరేకించి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం వంటి పనులు చేశారు. అప్పటి కంకిపాడు ఎమ్మెల్యేగా ఉన్న నెహ్రూ మంత్రి పదవిలో లేకున్నా జిల్లా మొత్తాన్ని చెప్పు చేతల్లో ఉంచుకోవడం రాధా జీర్ణించుకోలేక పోయారు. అదే సమయంలో చిరంజీవి ప్రజా రాజ్యం పార్టీ పెట్టడంతో కాపులకు అధికారం లక్ష్యంలో భాగం అవ్వాలనుకుని పార్టీ మారారు. 2009 ఎన్నికలకు ముందు పార్టీ వీడొద్దని రాధాను వైఎస్., కేకే లాంటి వారు బుజ్జగించినా ఫలితం లేకపోయింది. 2008 చివరలో అప్పటి ఉడా చైర్మన్ మల్లాది విష్ణు వంగవీటి రంగా విగ్రహానికి పూల మాల వేసే సందర్భంలో రాధా అనుచరులు ఆయనపై దాడి చేశారు. ఎన్నికలకు కొద్ది నెలల ముందు జరిగిన ఈ ఘటన వంగవీటి రాజకీయ జీవితం మీద ప్రభావం చూపింది. నాటి ఎన్నికల్లో అనూహ్యంగా విష్ణు ఎమ్మెల్యే అయిపోయారు. 2011లో జగన్ కాంగ్రెస్ వీడి వైసీపీ ఏర్పాటు చేసిన తర్వాత రాధాకు తగిన ప్రాధాన్యత ఇచ్చారు. 2014 ఎన్నికల్లో విజయవాడ తూర్పు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తూర్పులో బలమైన అభ్యర్థిని నిలిపే క్రమంలో వంగవీటి రాధకు బందరు ఎంపీ, అవనిగడ్డ నియోజకవర్గాల నుంచి పోటీ చేయడంతో పాటు ఎన్నికల ఖర్చుకు భరోసా కూడా వైసీపీ అధిష్టానం నుంచి లభించింది. అదే సమయంలో చెప్పుడు మాటలు వినడం, ఓ మీడియా సంస్థ యజమాని ప్రోద్భలంతో రాధా వైసీపీని వీడి టీడీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేయకున్నా ప్రచారం నిర్వహించారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత టీడీపీ లో ఆయన్ని పలకరించే వారు కరువయ్యారు.
ఒకరి పంతం…..ఇద్దరి కెరీర్….
వంగవీటి రంగా తనయుడిగా రాధా వ్యవహార శైలి అటు దేవినేని అవినాష్ మీద కూడా ప్రభావం చూపింది. వైసీపీలోకి దేవినేని కుటుంబాన్ని రానివ్వకుండా, మరోవైపు వైసీపీలో తాను కూడా ఉండకుండా ఇద్దరి పొలిటికల్ కెరీర్ మీద ప్రభావం చూపింది. బలమైన ఆర్థిక మూలాల ఉన్న దేవినేని అవినాష్ గత ఎన్నికల్లో 60కోట్లకు పైగా ఖర్చు చేసి నష్టపోయారు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చే సమయంలో పార్టీ వీడి రాధా తనకి తాను భారీ నష్టం చేసుకున్నారు. రంగా కుమారుడిగా ఉన్న ఇమేజ్ కాపాడుకోలేక “తప్పు”టడుగులు వేసి చేతులరా నష్టపోయారు.ఇప్పుడు దేవినేని అవినాష్ వైసీపీ తీర్థం పుచ్చుకుంటే రాజకీయంగా భరోసా లభించడంతో పాటు వచ్చే నాలుగున్నరేళ్లలో అంతో ఇంతో లాభ పడొచ్చు. వైసీపీకి రాజధాని ప్రాంతంలో బలమైన సామాజిక వర్గ అండదండలు లభిస్తాయి.
-ఎడిటోరియల్ డెస్క్