జగన్ ఎదుట నిరూపించుకునేందుకేనా
శ్రీకాకుళం జిల్లాకు చెందిన ధర్మాన ప్రసాదరావు సీనియర్ నేత. ఆయన అనర్గళంగా ప్రసంగాలు చేయడంతో దిట్ట. మూడున్నర దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న ఆయన నేదురుమల్లి జనార్ధనరెడ్డి హయాంలో [more]
శ్రీకాకుళం జిల్లాకు చెందిన ధర్మాన ప్రసాదరావు సీనియర్ నేత. ఆయన అనర్గళంగా ప్రసంగాలు చేయడంతో దిట్ట. మూడున్నర దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న ఆయన నేదురుమల్లి జనార్ధనరెడ్డి హయాంలో [more]
శ్రీకాకుళం జిల్లాకు చెందిన ధర్మాన ప్రసాదరావు సీనియర్ నేత. ఆయన అనర్గళంగా ప్రసంగాలు చేయడంతో దిట్ట. మూడున్నర దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న ఆయన నేదురుమల్లి జనార్ధనరెడ్డి హయాంలో తొలిసారిగా మంత్రిగా పనిచేశారు. ఆ రోజుల్లో ఆయన జిల్లా రాజకీయాలను శాసించారు. ఇక వైఎస్సార్ అనుచరుడిగా ఉంటూ 1999 నుంచి 2004లో అసెంబ్లీలో కాంగ్రెస్ తరఫున ప్రతిపక్ష నేతగా ధర్మాన ప్రసాదరావు తన వాగ్దాటి చూపించారు. దానికి మెచ్చిన వైఎస్సార్ తన మంత్రి వర్గంలో ఆయనకు కీలకమైన శాఖలను ఇచ్చి ప్రోత్సహించారు. ఇక జగన్ మంత్రి వర్గంలో కచ్చితంగా తనకు బెర్త్ ఉంటుందని ధీమాగా ఉన్న ధర్మాన ప్రసాదరావుకు సీన్ రివర్స్ అయింది. దాంతో ఆయన లోలోపల రగిలిపోతున్నారు.
ఆ సామాజికవర్గం పెత్తనం….
జిల్లాలో మొదటి నుంచి వెలమలు, కాళింగుల మధ్యన రాజకీయ పోరు గట్టిగా సాగుతోంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కాళింగులు పెత్తనం చేసేవారు. ఆ మాటకు వస్తే వరసగా దశాబ్దాల పాటు శ్రీకాకుళం ఎంపీ సీటుని ఏలింది కూడా కాళింగులే. టీడీపీ వచ్చాక వెలమలను ముందు వరసలో పెట్టి కాళింగులకు దెబ్బ తీసింది. ఎర్రన్నాయుడు ఆ టైంలో జిల్లాలో తిరుగులేని హవా చాటారు. ఇక వైఎస్సార్ హయాంలోనూ వెలమల పెత్తనం ధర్మాన ప్రసాదరావు రూపంలో సాగింది. ఈ పరిణామాలతో విసుగుచెందిన కాళింగులు రాజకీయ పునర్ వైభవం కోసం ఎదురుచూస్తున్నారు. సరిగ్గా జగన్ దాన్ని పట్టుకుని కాళింగులకు సీట్లు ఇవ్వడమే కాకుండా పదవులు కూడా ఇచ్చారు. ఫలితంగా ఆ సామాజికవర్గం నుంచి తమ్మినేని సీతారాం స్పీకర్ గా ఉన్నారు. ఇక కాళింగులు తీవ్రంగా వ్యతిరేకించే ధర్మాన ప్రసాదరావుకు మంత్రి పదవి కూడా దక్కకుండా చేయగలిగారు.
బలమైన గొంతు ద్వారా…..
ఇంత చేసినా తన అవమానాన్ని దిగమింగుకుని ధర్మాన ప్రసాదరావు అసెంబ్లీ వేదికగా బడ్జెట్ మీద కీలకమైన ప్రసంగం చేశారు. అయితే దాని కధ వేరే ఉందని ఇపుడు జిల్లాలో వినిపిస్తున్న మాట. జగన్ తనని తక్కువ చేయాలని చూసారని, అయితే తన సత్తా ఇదీ అంటూ తెలియచెప్పడానికే సుదీర్ఘమైన ప్రసంగాన్ని అసెంబ్లీలో చేసి ధర్మాన ప్రసాదరావు ఆకట్టుకున్నారని అంటున్నారు. తనని మంత్రిని చేయలేకపోయినందుకు జగన్ బలమైన వాణిని ఎలా కోల్పోయారో తెలియచెప్పడం కూడా ధర్మాన ప్రసాదరావు ప్రసంగం వెనక ఉన్న ఆంతర్యమట. మరి జగన్ దీన్ని గుర్తించి ధర్మాన ప్రసాదరావుకు కీలకమైన బాధ్యతలు అప్పగిస్తారా, ఆయన్ని అలాగే ఎమ్మెల్యేగానే ఉంచుతారా అన్నది చూడాలి. ఏది ఏమైనా ధర్మాన ప్రసాదరావు తాను సమర్ధుడైన నాయకుడినని జగన్ సాక్షిగా నిరూపించుకునేందుకు తనదైన ఎత్తుగడలు వేస్తున్నారు.