మోడీ ఎటు వైపు…? నిర్ణయించుకోలేక పోతున్నారా?
అమెరికా అధ్యక్ష ఎన్నిక కేవలం ఆ దేశానికే మాత్రమే పరిమితమైన అంశం కాదు. యావత్ ప్రపంచం ఆసక్తి కనబరుస్తుంది. అక్కడ ఉండే తమ దేశీయులు ఏ పక్షాన [more]
అమెరికా అధ్యక్ష ఎన్నిక కేవలం ఆ దేశానికే మాత్రమే పరిమితమైన అంశం కాదు. యావత్ ప్రపంచం ఆసక్తి కనబరుస్తుంది. అక్కడ ఉండే తమ దేశీయులు ఏ పక్షాన [more]
అమెరికా అధ్యక్ష ఎన్నిక కేవలం ఆ దేశానికే మాత్రమే పరిమితమైన అంశం కాదు. యావత్ ప్రపంచం ఆసక్తి కనబరుస్తుంది. అక్కడ ఉండే తమ దేశీయులు ఏ పక్షాన ఉండాలో, ఏ పార్టీ అధికారంలోకి వస్తే తమ దేశానికి కలిగే మేలు ఏమిటన్న అంశంపై ఆయా దేశాలు అంతర్గతంగా చర్చించుకుంటాయి. ఇది సహజ పరిణామం. అలాంటిది తమ దేశ మూలాలు ఉన్న వ్యక్తి స్వయంగా బరిలో ఉంటే ఇంకెంత ఆసక్తి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఆ అభ్యర్థికి, ఆ పార్టీకి సంబంధిత దేశం మద్దతు ఇవ్వాలా, ఇస్తే ప్రత్యక్షంగా ఇవ్వాలా, పరోక్షంగా ఇవ్వాలా అనే అంశంపై తర్జనభర్జనలు పడుతుంది. అదే సమయంలో కేవలం తమ దేశ మూలాలు ఉన్న ఏకైక కారణం చూపి మద్దతు ఇవ్వడం దౌత్యపరంగా సమంజసం కాదు.
సందిగ్దతలోనే భారత్…..
ఇప్పుడు అమెరికా డెమొక్రటిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థిగా భారతీయ మూలాలున్న కమలా హారిస్ బరిలోకి దిగిన తరవాత భారత్ కు ఈ సందిగ్థ పరిస్థితి ఏర్పడింది. ఒకపక్క కమలా హారిస్ అభ్యర్థిత్వంపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తమ దేశ మూలాలతోపాటు ఒక మహిళకు అమెరికా చరిత్రలో అత్యున్నత పదవికి పోటీచేసే అవకాశం రావడం అరుదని అందువల్ల ఆమెకు భారత్ మద్దతు ప్రకటించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదే సమయంలో కమలా హారిస్ అ్యభ్యర్థిత్వంపై భారత ప్రభుత్వం మౌనం దాల్చడంపై చర్చ జరుగుతోంది. ఇందుకు గల కారణాలు ఏమిటన్న దానిపై ఎవరికి తోచిన రీతిలో వారు వ్యాఖ్యానాలు చేస్తున్నారు.
కమల అభ్యర్థిత్వంపై…..
కమలా అభ్యర్థిత్వానికి సంబంధించి భారత వైఖరి ఏమిటన్నది నిర్దిష్టంగా తెలియరాలేదు. కానీ భారత విధాన నిర్ణేతలు ఆమె పట్ల అంత సుముఖంగా లేరన్న వాదన అధికార వర్గాల్లో వినపడుతోంది. కమలా హారిస్ ఆమె భారతీయ మూలాలున్న వ్యక్తి అయినప్పట్టికీ గతంలో ఎన్నడూ భారత్ కు అనుకూలంగా మాట్లాడలేదు. అంతేకాక పార్టీ వేదికలపై వ్యతిరేక వ్యాఖ్యలు సైతం చేశారని అధికార వర్గాలు గుర్తు చేస్తున్నాయి. మోదీ ప్రభుత్వం ఇటీవల కాలంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలను డెమొక్రట్లు బహిరంగంగా వ్యతిరేకించారు. ముఖ్యంగా జమ్ము కశ్మీర్ కు సంబంధించి గత ఏడాది ఆగస్టులో 370వ అధికరణ రద్దు, పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ- సిటిజెన్ షిప్ ఎమెండ్ మెంట్ యాక్టు) తదితర అంశాలను డెమొక్రటిక్ పార్టీ నాయకులు కొందరు బహిరంగంగా వ్యతిరేకించారు. 370వ అధికరణ రద్దు తరవాత కశ్మీర్లో నెలకొన్న పరిస్థితులపై కమలా హారిస్ నేరుగా విమర్శలు సంధించారు.
భారత్ నిర్ణయాలపై….
గత ఏడాది డిసెంబరులో కశ్మీర్ పై జరిగిన ‘హౌస్ ఆఫ్ రిలేషన్స్’ సమావేశానికి భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ గైర్హాజరవడాన్ని ఆమె తప్పుపట్టారు. గత ఏడాది హ్యూస్టన్ లో జరిగిన ‘హౌడీ-మోడీ’ కార్యక్రమానికి అక్కడి చట్టసభ ప్రతినిధులు, ప్రవాస భారతీయులు పెద్దయెత్తున హాజరయ్యారు. ప్రధాని నరేంద్రమోదీ, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరైన ఈ కార్యక్రమానికి కమలా హారిస్ దూరంగా ఉండిపోయారు. డెమొక్రటిక్ పార్టీ నాయకురాలిగా ఈ కార్యక్రమానికి హాజరవడం ఆమెకు ఇబ్బందికరమే. దీనిని ఎవరైనా అర్థం చేసుకోగలరు. కానీ ఒక ప్రవాస భారతీయురాలి హోదాలో అయినా ఆమె హాజరై ఉండాల్సిందన్న వ్యాఖ్యలు అప్పట్లో వినిపించాయి. దీనిని తోసిపుచ్చలేం. మానవహక్కులు, మతపరమైన స్వేచ్ఛ తదితర అంశాలకు సంబంధించి రిపబ్లికన్ల కన్నా సంప్రదాయ డెమొక్రట్లు ఎక్కువగా మరీ సునిశితంగా స్పందిస్తుంటారు. రేపటి ఎన్నికల ప్రచారంలో ఆ పార్టీ నాయకులు ఈ విషయమై మాట్లాడక తప్పదు. ఇది భారతకు ఇబ్బంది కలిగించే పరిణామమే. భారత్ కు సంబంధించిన పర్యావరణ విధానాలు, పర్యావరణ ప్రభావ అంచనాపై డెమొక్రట్లు కీలకంగా చర్చించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కమలా హారిస్ కు మద్దతు ప్రకటించడం వల్ల భారత్ కు ప్రత్యేకంగా వచ్చే ప్రయోజనాలు లేవు. అందువల్లే న్యూఢిల్లీ మౌనం పాటిస్తుందని దౌత్యవర్గాలు పేర్కొంటున్నాయి.
సంప్రదాయ పరంగా……
సంప్రదాయపరంగా ప్రవాస భారతీయులు డెమొక్రటిక్ పార్టీ మద్దతుదారులు అన్నది తెలిసిందే. అయితే 2016 ఎన్నికల్లో వారు ట్రంప్ వైపే మొగ్గు చూపారు. ట్రంప్ అధికారంలో వచ్చినప్పటి నుంచి ప్రధాని నరేంద్రమోదీతో మంచి సంబంధాలను నెరపుతున్నారు. దౌత్యపరంగాతో పాటు, వ్యక్తిగతంగానూ ఇద్దరు నేతల మధ్య సత్సంబధాలు ఉన్నాయి. గత ఏడాది హ్యూస్టన్లో జరిగిన ‘మోదీ-హౌదీ’ కార్యక్రమం ఇందుకు నిదర్శనం. పైకి ఇది అధికారిక కార్యక్రమం అయినప్పటికీ పరోక్షంగా ఇది ట్రంప్ ఎన్నికల ప్రచార కార్యక్రమం అన్న భావన అప్పట్లో కలిగింది. ఇందులో ప్రవాస భారతీయులు పెద్దయెత్తున పాల్గొన్నారు. ఆ తరవాత ఈ ఏడాది ట్రంప్ భారత్ పర్యటనలో భాగంగా మోదీ స్వరాష్ట్రమైన గుజరాత్ లోని అహ్మదాబాద్ లో నిర్వహించిన ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమం కూడా ఇలాంటిదే. పరోక్షంగా భారతీయుల మద్దతు ట్రంప్ కే అన్న సందేశాన్ని ఈ సభ చాటింది. 2014లో మోదీ అధికారంలోకి వచ్చినప్పుడు అమెరికా అధినేతగా బరాక్ ఒబామా ఉండేవారు. ఆయనతోపాటు తరవాత 2016లో ఎన్నికైన ట్రంప్ తోనూ మంచి సంబంధాలు సాగించారు. కాలక్రమంలో ఇవి మరింత బలోపేతమయ్యాయి. ఇందుకు అంతర్జాతీయ పరిస్థితులు కూడా కొంతవరకు దోహదపడ్డాయి.
ట్రంప్ నకు దూరమవ్వాల్సిన…..
అంతర్జాతీయంగా పెరుగుతున్న చైనా ప్రాబల్యం, దానితో భారత్ ఎదుర్కొంటున్న చిక్కులు, చైనా కట్టడిలో భారత్ పాత్ర తదితర అంశాల కారణంగా ట్రంప్ భారత్ పట్ల సానుకూలంగా వ్యవహరించారు. అందువల్ల ఇప్పటికప్పుడు ట్రంప్ నకు దూరమవ్వాల్సిన అవసరం భారత్ కు లేదు. ఇక నిబంధనల ప్రకారం చూస్తే ఒక దేశ ఎన్నికల్లో ఇతర దేశా లప్రభుత్వాలు బహిరంగంగా ఒక పక్షాన నిలబడటం దౌత్య సంప్రద్రాయలకు విరుద్ధం. దానివల్ల భవిష్యత్తులో అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. ఇక ఇప్పటి పరిస్థితుల్లో డెమొక్రటిక్ పార్టీ గెలిచినా భారత్ కు ప్రత్యేకంగా వచ్చే ఇబ్బందులు లేవు. తమంతట తాము వారు భారత్ ను దూరం చేసుకునే పరిస్థితి కూడా లేదు. చైనాను ఎదుర్కనేందుకు భారత్ పై అది ఆధారపడక తప్పదు. ఆసియా- పసిఫిక్ లో భారత్ ప్రాధాన్యాన్ని కూడా తక్కువగా అంచనా వేయలేరు డెమొక్రట్లు. ఒక పెద్ద ప్రజాస్వామ్య దేశంగా, వంద కోట్లకు పైగా జనాభా, అతిపెద్ద మార్కెట్ గల భారత్ ను ఏ దేశమైనా అనివార్యంగా గుర్తించక తప్పదు. ఇందుకు అమెరికా మినహాయింపు కాదు. అందువల్లే కమలాహారిస్ పట్ల అత్యుత్సాహాన్ని గానీ, అనాసక్తతను గానీ భారత్ ప్రదర్శించడం లేదు. దౌత్యపరంగా ఇది సరైన విధానమే.
-ఎడిటోరియల్ డెస్క్
- Tags
- modi
- à°®à±à°¦à±