రైజ్ అవుతారా..? రిటర్న్ అవుతారా..?
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి తొమ్మిది మంది ఎమ్మెల్యే టీఆర్ఎస్ లో చేరడం ఒక షాక్ అయితే ఆ పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి డీకే అరుణ [more]
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి తొమ్మిది మంది ఎమ్మెల్యే టీఆర్ఎస్ లో చేరడం ఒక షాక్ అయితే ఆ పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి డీకే అరుణ [more]
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి తొమ్మిది మంది ఎమ్మెల్యే టీఆర్ఎస్ లో చేరడం ఒక షాక్ అయితే ఆ పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి డీకే అరుణ పార్టీ వీడటం పార్టీకి మింగుడుపడని అంశం. ఇక, ఆమె భారతీయ జనతా పార్టీలో ఎందుకు చేరారో కాంగ్రెస్ కు అంతుచిక్కడం లేదు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న, బలంగా ఉన్న టీఆర్ఎస్ లో చేరితే ఎవరూ పెద్దగా ఆలోచించే వారు కాదు కానీ ఆమె బీజేపీలో చేరడంతో డీకే అరుణ, బీజేపీ వ్యూహం ఎంటనేది ఎవరికీ అర్థం కాకుండా ఉంది. ఆమె మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే, కేవలం ఒక ఎంపీ టిక్కెట్ కోసం ఆమె కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరే అవకాశం లేదు. వాస్తవానికి మహబూబ్ నగర్ ఎంపీ టిక్కెట్ ను ఆమెకు ఇస్తామని కాంగ్రెస్ ముందుగానే ఆఫర్ ఇచ్చింది. ఆమెనే ఆ టిక్కెట్ తనకు వద్దని చెప్పారు. బీజేపీ కంటే కాంగ్రెస్ ఇక్కడ అనేక రెట్లు బలంగా ఉంది. ఈ విషయం ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ చూస్తే తెలిసిపోతుంది.
ఎంపీగా పోటీ చేస్తారా..?
అన్నీ తెలిసి బీజేపీ నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు డీకే అరుణ ఎందుకు సిద్ధమయ్యారో ఎవరికీ అర్థం కావడం లేదు. మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు 3 లక్షలకు పైగా ఓట్లు వస్తే బీజేపీ అభ్యర్థులకే సుమారు 60 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక్కడ కాంగ్రెస్ కు బలమైన ఓటు బ్యాంకు ఉంది. అయినా కూడా ఆమె కాంగ్రెస్ ను కాదనుకొని బీజేపీలో చేరారు. అయితే, ఆమెకు రాజకీయ భవిష్యత్ పై బీజేపీ అగ్రనేతలు హామీ ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని, డీకే అరుణకు సరైన ప్రాధాన్యత ఇస్తామని బీజేపీ నేతలు చెప్పినట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయాలని ఆమెకు సూచించారు. అయితే, రాష్ట్ర బీజేపీలో డీకే అరుణ ఇమడగలరా అనే అనుమానాలు వస్తున్నాయి. సుదీర్ఘ రాజకీయ అనుభవం, స్వతంత్రంగా పనిచేసుకునే స్వభావం కలిగిన ఆమెకు బీజేపీ పద్దతి సెట్ అవ్వదని అంటున్నారు.
బీజేపీలో ఇమడగలరా..?
రాష్ట్ర బీజేపీలో కొందరు నేతల పెత్తనమే నడుస్తుంది. కిషన్ రెడ్డి, లక్ష్మణ్, దత్తాత్రేయ వంటి ఐదారుగురు నేతలు తప్ప మిగతా ఎవరూ పెద్దగా ఫోకస్ కారు. ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వారికే అక్కడ ప్రాధాన్యత ఉంటుంది. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పెద్దగా గుర్తింపు ఉండదు. బీజేపీపై ఎన్నో ఆశలు పెట్టుకుని ఆ పార్టీలో చేరిన నాగం జనార్ధన్ రెడ్డి వంటి వారే బీజేపీలో వేగలేక బయటకు వచ్చేవారు. పార్టీలో ఎమ్మెల్యే, హిందుత్వవాది రాజాసింగ్ కూడా అప్పడప్పుడు తాను బీజేపీ నేతలతో వేగలేనని అలక వహిస్తుంటారు. అటువంటిది డీకే అరుణకు పార్టీలో ప్రాధాన్యత ఉంటుందా అనేది అనుమానమే. బయటి పార్టీల నుంచి ఎవరు ఆ పార్టీలో చేరినా సాధారణ నాయకులుగా మిగిలిపోవాల్సిందే కానీ పెద్దగా ప్రాధాన్యత ఉండదు. 2014 మెదక్ ఉప ఎన్నికల వేళ కూడా కాంగ్రెస్ నుంచి జగ్గారెడ్డి బీజేపీలో చేరి ఎంపీగా పోటీ చేసి ఓడాక బయటకు వచ్చి మళ్లీ కాంగ్రెస్ లో చేరిపోయారు. ఇలా పలువురు బయటి పార్టీల నేతలు బీజేపీలోకి వెళ్లి అక్కడి పరిస్థితి చూసి వేగలేక బయటకు వచ్చారు. అయితే, డీకే అరుణ వీరికి భిన్నంగా పార్టీలో తన ప్రత్యేకతను చాటుకుంటారా ? ఆమెకు పాత బీజేపీ నేతలు ప్రాధాన్యత ఇస్తారా ? లేకపోతె ఆమె నాగం జనార్ధన్ రెడ్డి, జగ్గారెడ్డి బాటలో మళ్లీ కాంగ్రెస్ కండువా కప్పుకుంటారా చూడాలి.