ఆర్ కే …షర్మిల క్విడ్ ప్రో కో…?
రాజకీయ నాయకులు మీడియాను ప్రచారానికి వాడుకోవడం సర్వసామాన్యం. మీడియా యాజమాన్యాలు తమ ఆర్థిక అవసరాలు, అక్రమాలకు నేతల అండదండలు కోరుకోవడమూ సహజం. అందుకే మీడియా సచ్ఛీలత ప్రశ్నార్థకమవుతోంది. [more]
రాజకీయ నాయకులు మీడియాను ప్రచారానికి వాడుకోవడం సర్వసామాన్యం. మీడియా యాజమాన్యాలు తమ ఆర్థిక అవసరాలు, అక్రమాలకు నేతల అండదండలు కోరుకోవడమూ సహజం. అందుకే మీడియా సచ్ఛీలత ప్రశ్నార్థకమవుతోంది. [more]
రాజకీయ నాయకులు మీడియాను ప్రచారానికి వాడుకోవడం సర్వసామాన్యం. మీడియా యాజమాన్యాలు తమ ఆర్థిక అవసరాలు, అక్రమాలకు నేతల అండదండలు కోరుకోవడమూ సహజం. అందుకే మీడియా సచ్ఛీలత ప్రశ్నార్థకమవుతోంది. నేతలకు కొమ్ముకాయడంలో ఒక్కొక్కరికి, ఒక్కో విధానం ఉంటుంది. ఒక్కో తరహా సమర్థన ఉంటుంది. నాయకులు గడప దూకేందుకు , అధికార పార్టీ పంచన చేరేందుకు రాష్ట్ర ప్రయోజనాలు, దేశప్రయోజనాలు అంటూ రొటీన్ వాదన చేస్తుంటారు. ఆ ముసుగులో తమ పబ్బం గడుపుకుంటుంటారు. మెయిన్ స్ట్రీమ్ మీడియా సైతం అదే విధంగా ప్రవర్తిస్తుంది. ఒక పార్టీని భుజానికి ఎత్తుకోవడం, కొందరు నేతలకు వెన్నుదన్నుగా నిలవడంలో తమ ప్రయోజనాలేమీ లేవని బుకాయిస్తుంది. రాష్ట్రం కోసం ప్రతిపక్షం పాత్ర పోషిస్తున్నామంటుంది. ఈవిషయంలో ఎటువంటి జంకు లేకుండా , నిర్భీతిగా , ఎందాకైనా వెళ్లేందుకు తెగించే వైఖరి ఆంధ్రజ్యోతి తీసుకుంటుంది. తెలుగుదేశం పార్టీని సమర్థించడంలో ఆ పత్రిక ఎండీ రాధాకృష్ణ ది ఒక ప్రత్యేక ముద్ర. ఈనాడు వంటి ప్రధాన పత్రిక శైలిలో కూడా తెలుగుదేశానికి మద్దతు కనిపిస్తుంది. కానీ బరితెగించి, బహిరంగంగా సమర్థిస్తున్నట్లుగా కనిపించకుండా జాగ్రత్త పడాలని ప్రయత్నిస్తుంది. ప్రస్తుతం ఆంధ్రజ్యోతి వై.ఎస్. తనయ షర్మిలకు రాజకీయ ప్లాట్ ఫామ్ గా ఇతోధిక ప్రాధాన్యమిస్తోంది. ఇందులోని మతలబు మీడియా, పొలిటికల్ సర్కిళ్లను తికమక పెడుతోంది. టీడీపీకి కుడిభుజంగా వ్యవహరించే జ్యోతి తాజాగా షర్మిల వార్తలపై మక్కువ కనబరచడంలో కేవలం వార్తా ప్రాముఖ్యమేనా? నిజంగానే మీడియా సంచలనం కోసమే ప్రచురిస్తోందా? లోగుట్టు మరేదైనా ఉందా? అన్నదే ప్రశ్న. షర్మిల కు సంబంధించిన ప్రతి స మాచారమూ, ఆమె పార్టీ ఏర్పాటుపై ప్రతి అడుగూ ఆంధ్రజ్యోతికే అందడంలోని మతలబు ఏమిటన్న విషయమూ చర్చకు తావిస్తోంది.
బాబు ప్రచారం బోరు..
చంద్రబాబు నాయుడి సిద్దాంతం నచ్చో, లేకపోతే సామాజిక వర్గ సమీకరణనో, అదీ కాకుంటే టీడీపీ హయాంలో ఆంద్రజ్యోతికి ప్రభుత్వ నుంచి ఆర్థిక, వాణిజ్యపరంగా లభించిన సహకారమో.. ఏదేమైనా ఆంద్రజ్యోతి టీడీపీకి అండదండగా నిలుస్తూ వస్తోంది. వైసీపీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను అవసరానికి మించి విమర్శిస్తూ, భూతద్దంతో నిశితంగా శోధిస్తూ ప్రభుత్వ ప్రతిష్టను మసకబార్చే ప్రయత్నంలో తన వంతు కృషి చేస్తోంది. ఒక పార్టీగా టీడీపీ చేస్తున్న దానికంటే ప్రతిపక్ష పాత్రను ఆంధ్రజ్యోతి సమర్థంగా పోషిస్తోంది. ఈక్రమంలోనే చంద్రబాబు నాయుడికి పెద్ద పీట వేయడమూ సహజమే. అయితే చంద్రబాబు నాయుడి మోనాటనస్ విమర్శలు, ప్రజల్లో అతని పట్ల ఏర్పడిన ఏవగింపు ధోరణి కారణంగా ఆంధ్రజ్యోతి పత్రికగా కొంత నష్టపోతోంది. స్థల, సమయాలను కోల్పోతోంది. అయినప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో చంద్రబాబు సిద్దాంతాల సామీప్యతతో ఈనాడు కంటే అధికంగా తన స్థలకాలాదులను టీడీపీ ప్రచారానికి ఆంధ్రజ్యోతి వెచ్చిస్తోంది. దీనివల్ల ఆంధ్రజ్యోతి క్రెడిబిలిటీ కొంతమేరకు దెబ్బతింటోంది. టీడీపీ శ్రేణులు ఎక్కువగా ఇష్టపడే పత్రికలో ఆ పార్టీని సమర్థించే వార్తలు రాకపోతే ఎలా అనేవారు కూడా ఉన్నారు. ఏదేమైనా తెలుగుదేశం పార్టీని, ఆంధ్రజ్యోతి పత్రికను విడదీసి చూడలేమన్న అవినాభావం ఏర్పడింది.
ఒక్క దెబ్బకు రెండు పిట్టలు..
ఆంధ్రజ్యోతి ప్రచారం వల్ల నిజంగానే టీడీపీ లాభపడుతోందా? అంటే కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఒకానొక దశలో బీజేపీ హవా తగ్గిపోయింది. రానున్నది సంకీర్ణమే అంటూ సార్వత్రిక ఎన్నికలకు ఏడాదిన్నర ముందే ఆంధ్రజ్యోతి రకరకాల విశ్లేషణలు, అంకెల సమీకరణలు ఇచ్చింది. అది నిజమేనని నమ్మి టీడీపీ అధిష్ఠానం బీజేపీని దూరం చేసుకుని నష్టపోయింది. కేవలం చంద్రబాబు నాయుడి వార్తలు, వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ప్రచారంతో ఆంధ్రజ్యోతి కి పెద్దగా ప్రయోజనం చేకూరడం లేదు. అన్న జగన్ తో ఏర్పడిన విభేదాలతో కొత్త పార్టీ పెట్టాలనుకుంటున్న షర్మిలకు భారీ ప్రచార వేదికగా ఉపయోగపడటంలో ఆంధ్రజ్యోతి రెండు లక్ష్యాలను సాధించేందుకు వీలు ఏర్పడింది. షర్మిల రూపంలో వైసీపీ వ్యతిరేక ప్రచారంతో టీడీపీకి పరోక్షంగా లాభం చేకూరుతుంది. ప్రజల్లో షర్మిల పట్ల వ్యక్తమవుతున్న ఆదరణతో పత్రికగా తన సర్క్యులేషన్, రీడర్షిప్ పెరుగుతుంది. అందుకే రానున్న రోజుల్లో టీడీపీ అధినేత చంద్రబాబు స్థాయిలోనే షర్మిలకూ ఆంధ్రజ్యోతి వార్తల్లో స్థానం దక్కనుందనేది రాజకీయ అంచనా.
షర్మిలకు ఇదే మార్గం..
రాజకీయంగా తనకు తగిన ప్రాముఖ్యం లభించాలనే షర్మిల డిమాండ్ చాలా హేతుబద్ధమైనది. జగన్ ఆమెలోని రాజకీయ ఆకాంక్షలను గుర్తించకుండా తప్పు చేశారు. ఫలితంగానే ఆమె తిరుగుబాటు ధోరణితో సొంతపార్టీకి శ్రీకారం చుడుతున్నారు. ఈ విషయంలో షర్మిల పట్ల ప్రజల్లో సైతం సానుభూతి వ్యక్తమవుతోంది. అయితే ఆమె ఆలోచనలు ప్రజల్లోకి వెళ్లడానికి ఒక ప్రధాన వేదిక కావాలి. సాక్షి వార్త రాయదు. ఈనాడు జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా షర్మిలకు ప్రాధాన్యమిచ్చేందుకు సాహసించదు. తాను సొంతంగా పత్రిక పెట్టే స్థితి షర్మిలకు లేదు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రజ్యోతిని ఎంచుకున్నారు షర్మిల. తమ ఆలోచనలకు పట్టం గట్టి జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా రాయగలిగిన శక్తి ఆంధ్రజ్యోతికి మాత్రమే ఉందని విశ్వసించారు. రెండు నెలల ముందునుంచే ఆంధ్రజ్యోతికి షర్మిల వర్గం నుంచి లీకేజీలు అందేలా జాగ్రత్త పడ్డారు. అందులోని వార్తా పరమైన సంచలనం, ముందుగా ప్రచురిస్తే తన పత్రికకు కలిగే ప్రయోజనం, జగన్ మోహన్ రెడ్డి శిబిరంలో ఏర్పడే కలకలం గ్రహించింది ఆంధ్రజ్యోతి. షర్మిలను అడాప్ట్ చేసుకుంది. ఆమె కథనాలను వండి వార్చి మేమే ఫస్టు అంటూ ప్రకటించుకుంది. ఇది ఒక రకంగా మీడియా, పాలిటిక్స్ క్విడ్ ప్రో కో. నీకు నేను లీకేజీలు ఇస్తాను. నువ్వు నాకు భారీ ప్రచారం చేసి పెట్టు. ఇద్దరం లాభపడదాం. అనే ధోరణికి నాంది. షర్మిల , ఆంద్రజ్యోతి ఎండీ రాధాకౄష్ణ అనుసరించిన విధానం. ఈ ఫార్ములా సక్సెస్ అయినట్లే కనిపిస్తోంది. అయితే తెలుగుదేశం పార్టీతో ఆంద్రజ్యోతికి ఉన్న అనుబంధం విడదీయలేనిది. ఆ స్థాయి లో షర్మిలకు ఆంధ్రజ్యోతి ఎప్పటికీ సొంత పత్రిక కాదు. అందువల్ల అందలం ఎక్కిస్తూనే అవసరమైనప్పుడు కింద పడేసే ప్ర మాదం కూడా ఉంది. ఈ విషయంలో గేమ్ ఎన్ని మలుపులు తిరుగుతుందన్నదే ఏపీ పొలిటికల్, మీడియా సర్కిళ్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్న పరిణామం.
-ఎడిటోరియల్ డెస్క్