ఇందిర, ఎన్టీఆర్ తర్వాత జగన్…!!
పేదలకు ఇల్లు పెద్ద సమస్యే. పెళ్ళి అంటే ఎలాగో అయిపోతుంది. ఇల్లే పెద్ద సమస్య. నా చిన్నప్పుడు మా చుట్టూ అన్నీ పూరిపాకలే ఉండేవి. పైన తాటాకు [more]
పేదలకు ఇల్లు పెద్ద సమస్యే. పెళ్ళి అంటే ఎలాగో అయిపోతుంది. ఇల్లే పెద్ద సమస్య. నా చిన్నప్పుడు మా చుట్టూ అన్నీ పూరిపాకలే ఉండేవి. పైన తాటాకు [more]
పేదలకు ఇల్లు పెద్ద సమస్యే. పెళ్ళి అంటే ఎలాగో అయిపోతుంది. ఇల్లే పెద్ద సమస్య. నా చిన్నప్పుడు మా చుట్టూ అన్నీ పూరిపాకలే ఉండేవి. పైన తాటాకు కప్పు. చుట్టూ తాటాకులతో కట్టిన దడి. కింద మట్టితో అలికిన నేల. ఇళ్ళు చాలా వరకు ఇలానే ఉండేవి. ఏవో కొందరి ఇళ్ళు మాత్రం మట్టిగోడలతో ఉండేవి. సంవత్సరాలు గడుస్తుంటే, కుటుంబంలో సంఖ్య పెరిగి, పిల్లలకు పెళ్ళిళ్ళు అయినా అదే ఇల్లు. అదే వాకిలి.
ఇందిర వల్ల….
ఈ పరిస్థితుల్లోనే మొదటిసారిగా ఇందిరాగాంధీ 1978 తర్వాత సామూహికంగా పేద ప్రజలకు ఇళ్లస్థలాలు ఇచ్చారు. దేశం మొత్తం కొన్ని లక్షల ఎకరాల భూమి ఇళ్ళ స్థలాలకు పంపిణీ చేశారు. ఆ తర్వాత ఇందిరాగాంధీ హయాంలోనే పేదలకు ఇళ్ళు కట్టించే పథకం ప్రవేశపెట్టారు. అది కూడా తాటాకు ఇళ్ళే. ఈ దేశంలో అలా పేదల ఇళ్ళ సమస్య మొదటిసారిగా ప్రభుత్వ ఎజెండా అయింది.మన రాష్ట్రం విషయానికి వస్తే, 1985 తర్వాత ఎన్టీఆర్ కూడా ఇందిరాగాంధీ తరహాలోనే ఇళ్ళ స్థలాలు, ఇళ్ళ గురించి ఆలోచన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సామూహికంగా ఇళ్ళ స్థలాలు పంపిణీ చేశారు. మరో అడుగు ముందుకేసి పక్కా ఇళ్ళ నిర్మాణం కూడా ఎన్టీఆర్ మొదలు పెట్టారు. అప్పటివరకు దొరలు, ధనవంతులు ఉండే పెంకుటిళ్ళు మొదటిసారి పేదలకు దక్కాయి. అదో గొప్ప అనుభూతి. పేదవాడు పెంకుటింట్లో ఉండగలగడం అనూహ్యం.
రెండు రూపాయలకు కిలో బియ్యం…..
ఎన్టీఆర్ వల్ల పేదవాడి జీవితంలో అసాధ్యం అనుకున్న మూడు గొప్ప సదుపాయాలు వచ్చాయి. మొదటిది బియ్యం. వరి అన్నం తినగల అదృష్టం ఎప్పుడో పండుగలకో, చుట్టాలు వచ్చినప్పుడో కలిగేది. అలాంటిది ఎన్టీఆర్ ఇచ్చిన బియ్యం వల్ల మొదటిసారి వరి అన్నం తిన్న కుటుంబాలు లక్షల్లోనే ఉంటాయి. ఎన్టీఆర్ కల్పించిన రెండో సదుపాయం పక్కా ఇల్లు. మూడోది మరుగుదొడ్డి. (మరుగు దొడ్డి ప్రజలు ఇంకా అలవాటు పడలేదు కానీ, ఈ పథకం వల్ల అధికారులు, కాంట్రాక్టర్లు, నేతలు బాగా లాభపడ్డారు. ప్రజలకు ఇచ్చిన మరుగుదొడ్లు ఇలా కొంతమందికి సంపద పెంచాయి.)
ఇన్నేళ్ల తర్వాత…..
ఇన్నేళ్ళ తర్వాత, ఈ ఇద్దరు నేతల తర్వాత పెద్ద ఎత్తున ఇళ్ళు, ఇళ్ళ స్థలాల గురించి సామూహికంగా జరుగుతోన్న ప్రయత్నం ఇదే. ఇప్పటివరకు వైస్సార్, సీబీఎన్ వంటి ముఖ్యమంత్రుల కాలంలో ఇళ్ళు, ఇళ్ళ స్థలాలు వచ్చాయి కానీ, అవన్నీ కొన్ని ప్రాంతాలకో, కొన్ని కుటుంబాలకో పరిమితం అయ్యాయి. రాష్ట్రంలో 30 లక్షల కుటుంబాలకు ఇళ్ళ స్థలాలు అంటే ఊర్లు విస్తరిస్తున్నట్టు లెక్క. ఇందిర, ఎన్టీఆర్ తర్వాత, అంటే మూడు దశాబ్దాల తర్వాత చాలా కుటుంబాల్లో పెళ్ళిళ్ళు జరిగి, కొత్త కుటుంబాలు వచ్చిన తర్వాత జరుగుతున్న ఈ ప్రయత్నం స్వాగతించదగ్గదే. అభినందించదగ్గది కూడా. కొత్తగా ఊర్లు వెలిసే ఈ ప్రయత్నం చరిత్రలో నిలిచిపోతుంది.(ఇళ్ళ స్థలాల కోసం చేసిన భూసమీకరణలో అవినీతి అంటే… చెప్పేదేముంది!? పేదల మరుగుదొడ్లల్లోనే తిన్న వాళ్ళు భూముల్లో తినరా!? ఒక మహా ప్రవాహం మొదటిగా చెత్తతోనే వస్తుంది. మంచినీరు ఆ తర్వాతే వస్తుంది.)
-గోపి దారా, సీనియర్ జర్నలిస్ట్