ప్లస్సా.. మైనస్సా..?
ఎట్టకేలకు ఈటల రాజేందర్ బయటికి వచ్చేశాడు. తెలంగాణ రాష్ట్రసమితితో తెగతెంపులైపోయాయి. ఆయన నిష్క్రమణ వల్ల టీఆర్ఎస్ కు లాభమా? నష్టమా? ఈటల ప్రవేశించబోతున్న కమలానికి కలిసి వస్తుందా? [more]
ఎట్టకేలకు ఈటల రాజేందర్ బయటికి వచ్చేశాడు. తెలంగాణ రాష్ట్రసమితితో తెగతెంపులైపోయాయి. ఆయన నిష్క్రమణ వల్ల టీఆర్ఎస్ కు లాభమా? నష్టమా? ఈటల ప్రవేశించబోతున్న కమలానికి కలిసి వస్తుందా? [more]
ఎట్టకేలకు ఈటల రాజేందర్ బయటికి వచ్చేశాడు. తెలంగాణ రాష్ట్రసమితితో తెగతెంపులైపోయాయి. ఆయన నిష్క్రమణ వల్ల టీఆర్ఎస్ కు లాభమా? నష్టమా? ఈటల ప్రవేశించబోతున్న కమలానికి కలిసి వస్తుందా? వస్తే ఆదరిద్దామని కాచుకున్న కాంగ్రెసు కి కలవరం కలిగించారా? మొత్తమ్మీద స్తబ్ధంగా ఉన్న రాష్ట్ర రాజకీయాల్లో ఈటల రాజేందర్ కదలిక తెచ్చారు. మళ్లీ రాజకీయ అజెండాలలో రగడ పుట్టించారు. తను రాష్ట్ర స్తాయి ప్రభావం చూపగలరా? లేదా? అన్న అంశాన్ని పక్కన పెడితే ఈటల పర్వం నేపథ్యంతో తమ అస్త్రాలను బయటికి తీశాయి విపక్షాలు. టీఆర్ఎస్ పై ఎక్కుపెట్టేందుకు వాటికి కొత్త ఆయుధం దొరికింది. ఉప ఎన్నిక వచ్చేంత వరకూ మరో ఆరునెలలపాటు వేడిని రగిలించి ఉంచడానికి వీలు చిక్కింది. గ్రేటర్ హైదరాబాద్, నాగార్జున సాగర్ ఎన్నికలు ముగిసిన తర్వాత పార్టీల చేతుల్లో ఘర్షణ పడటానికి పెద్దగా రాజకీయ వాదనలు కరవు అయ్యాయి. కరోనా వంటి అంశాలున్నప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెంటిపైనా విమర్శలు ఉండటంతో ఆరోపణలు పెద్దగా పేలడం లేదు. కాంగ్రెసు, కమ్యూనిస్టు స్వరాలు ప్రజల్లో ప్రతిధ్వనించడం లేదు. ఈటల రాజేందర్ ప్లాట్ ఫామ్ పై టీఆర్ఎస్ , బీజేపీ కొత్త సమరానికి కసరత్తు మొదలైంది.
ఊపు తెస్తాడా..?
ఆత్మాభిమానం, తెలంగాణ ఉద్యమం, బానిస భవన్ అంటూ ఈటల రాజేందర్ ఎన్ని మాటలు చెప్పినా అవి రాజకీయ నినాదాలే. టీఆర్ఎస్ నుంచి వేరుపడటం వ్యక్తిగతంతో ముడిపడిన అంశమే. కేసీఆర్ వ్యవహార శైలి ఉద్యమ కాలం నుంచి తెలిసిందే. అందువల్ల అధికారంలోకి వచ్చిన తర్వాత అందులో పెద్దగా మార్పు వస్తుందనుకోవడం అత్యాశే అవుతుంది. రాజేందర్ కు అన్నీ ఇచ్చామంటుంది టీఆర్ఎస్. సొంత కుటుంబ మంత్రుల తర్వాత నిజంగానే ఈటల రాజేందర్ కు పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ అధిక ప్రాదాన్యమే దక్కింది. అయినా ఏదో దొరకలేదన్న అసంతృప్తి అతనిని వెన్నాడుతూ వస్తోంది. దానిపై ఎవరికీ స్పష్టత లేదు. జిల్లాలో తనకు ఎదురు లేకుండా ఉండాలని ఈటల భావిస్తూ ఉంటారు. అయితే దేనికైనా తెగించి మాట్టాడే రాజేందర్ వల్ల సమస్యలు తలెత్తవచ్చని భావించే జిల్లాలో పోటీనాయకులను ప్రోత్సహించారు కేసీఆర్. అదే ఈటల నిష్క్రమణకు ప్రధాన కారణంగా చెప్పుకోవాలి. కేసీఆర్ ను ఢీ కొట్టగల ఆలోచన కానీ, అంతటి ధైర్యం కాని ఈటల రాజేందర్ లో లేవనేది టీఆర్ఎస్ లో అతని సన్నిహితుల వాదన. పొమ్మనకుండా పొగబెట్టిన కారణంగానే బలవంతపు నిష్క్రమణ జరిగిందనేది జగమెరిగిన సత్యం. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదగాలనుకుంటున్న బీజేపీ కి ఈటల రాజేందర్ వల్ల రాజకీయంగా కలిసి వస్తుందా? అన్నదే ముఖ్యమైన అంశం.
ఉసూరుమనిపిస్తాడా?
చాలా మంది జాతీయ పార్టీల్లో ప్రవేశించిన తర్వాత ఉసూరుమంటూ కనిపిస్తారు. ప్రాంతీయ పార్టీల్లో లభించిన ప్రాధాన్యం వారికి అక్కడ దక్కదు. ప్రగతి భవన్ బానిసత్వమంటూ నిరసించిన ఈటల రాజేందర్ రేపొద్దున్న ఢిల్లీ బానిసత్వం చేస్తున్నారా? అని ప్రశ్న ఎదురైతే జవాబు చెప్పలేకపోవచ్చు. లోక్ సభ ఎన్నికల కాలం నుంచి రాష్ట్రంలో బీజేపీ బలపడుతూ వస్తోంది. చాలామంది నాయకులు ఆ పార్టీ తీర్తం పుచ్చుకున్నారు. ఆయా నాయకుల ప్రభ మాత్రం తగ్గిపోయింది. కేసీఆర్ ను అనునిత్యం తిట్టి పోసే వారు మాత్రమే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. ఈటలకు టీఆర్ఎస్ బలాలు, బలహీనతలు చాలా వరకూ తెలుసు. సుదీర్ఘకాలం కేసీఆర్ సహచరునిగా, అనుచరునిగా ఉండటం వల్ల ఎత్తుగడలు సైతం అపోశన పట్టారు. వాటిని బీజేపీకి అనుకూలంగా ప్రయోగిస్తే మాత్రం కచ్చితంగా కమలం పార్టీకి అసెట్ అవుతారు. లేదంటే జాతీయ పార్టీలో నియోజకవర్గ, లేదా జిల్లా స్తాయి నాయకునిగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది. హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఆయన సాధించే విజయంపై ఆధారపడే పార్టీలో ఈటల రాజేందర్ ప్రాబల్యం పెరగడమో, తగ్గడమో జరుగుతుంది. అంతవరకూ ఈటల కేంద్రంగా రాష్ట్ర రాజకీయాలను రక్తి కట్టించడానికి బీజేపీ ప్రయత్నిస్తుంది.
బీసీ కమలం…
రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో ఉన్న వెనకబడిన తరగతులపై పట్టు బిగించడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది. కాంగ్రెసు పార్టీ రెడ్డి సామాజిక వర్గంతో పాటు ఎస్పీలను ఆకర్షించడం ద్వారా తన రాజకీయ ప్రాబల్యం స్థిరపరుచుకుంది. ఓట్ల రీత్యా తన సామాజిక వర్గాన్నే నమ్ముకోవడం సాధ్యం కాదు కాబట్టీ టీఆర్ఎస్ ఉద్యమ వేడి, సంక్షేమ మంత్రంతో రాజకీయ అధికారాన్ని కాపాడుకోవాలని ప్రయత్నిస్తోంది. దానికి తోడు సామాజిక వర్గ రీత్యా ముస్లింలను ఓవైసీ ద్వారా ఓటు బ్యాంకుగా మార్చుకుంటోంది. ఈ నేపథ్యంలో బీసీ వర్గాలను ఆకట్టుకోవడం పైనే బీజేపీ ఫోకస్ పెట్టింది. హస్తం పార్టీ అత్యధిక ప్రాదాన్యం ఇస్తున్న రెడ్డి, ఎస్సీ సామాజిక వర్గాలు ఎటూ బీజేపీ వైపు పెద్దగా తొంగి చూసే అవకాశాలు లేవు. ఆయా వర్గాల నాయకులు చేరినా ఓట్లు బీజేపీకి వస్తాయన్న గ్యారంటీ లేదు. ముస్లింల నుంచి బీజేపీ ఆశించేది ఏమీ లేదు. బీసీలే భవిష్యత్ రాజకీయానికి పెట్టుబడిగా భావిస్తోంది. బండి సంజయ్ పగ్గాలు చేపట్టిన తర్వాత ఆయా వర్గాల్లో కదలిక వచ్చిందని అంచనా వేస్తోంది. ఈటల రాజేందర్ రాక ఈ కోణంలో మరింతగా కలిసి వస్తుందని బీజేపీ లెక్కలు వేసుకుంటోంది.
– ఎడిటోరియల్ డెస్క్