Explainer: ఢిల్లీలో వాయు కాలుష్యం ఎలా ఉంది? ఎలా కొలుస్తారు?
శీతాకాలం వచ్చిందంటే చాలు దేశ రాజధాని లోని ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతూ ఉంటారు. అందుకు కారణం చలి కాదు.. కాలుష్యం. ఢిల్లీ
దేశ రాజధానిలో గాలి పీల్చడం కూడా కష్టమే..!
శీతాకాలం వచ్చిందంటే చాలు దేశ రాజధాని లోని ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతూ ఉంటారు. అందుకు కారణం చలి కాదు.. కాలుష్యం. ఢిల్లీ, చుట్టుపక్కల ప్రాంతాలు నవంబర్ 13, 2024 నుండి దట్టమైన పొగమంచుతో కప్పబడి ఉన్నాయి. గాలి పీల్చడం ఎంతో హానికరం అని తేల్చేశారు. నవంబర్ 18, 2024 నాటికి AQI 493 గా ఉంది. ఢిల్లీలోని నాలుగు ప్రాంతాలలో గాలి నాణ్యత క్షీణించి ఏకంగా 500కి చేరుకున్నాయి, అనేక ప్రాంతాల్లో 490-500 మధ్య ఉన్నాయి. దట్టమైన పొగమంచు కారణంగా 150 మీటర్ల వరకు దృశ్యమానత తగ్గడంతో, దాదాపు 14 విమానాలను పొరుగు రాష్ట్రాల్లోని విమానాశ్రయాలకు మళ్లించారు. నవంబర్ 21, 2024న ఢిల్లీలో గాలి నాణ్యత స్వల్పంగా మెరుగుపడింది. కొన్ని ప్రాంతాల్లో AQI తీవ్రంగా ఉండగా, కొన్ని ప్రాంతాల్లో AQI స్వల్పంగా మెరుగుపడింది.
ఢిల్లీలో సగటు AQI 450 మార్కును దాటినప్పుడు, కమీషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ (CAQM) గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP)-4 ను తీసుకుని వచ్చింది. నిర్మాణాలు, కూల్చివేతలపై నిషేధం విధించారు. నగరంలోకి నిత్యావసర సరుకుల వాహనాలు తప్ప మిగిలిన ట్రక్కుల ప్రవేశంపై నిషేధం విధించారు. నిబంధనలను ఉల్లంఘించే పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఆన్లైన్లో తరగతులు నిర్వహించాలని పాఠశాలలకు ఆదేశాలు జారీ చేశారు. అవసరం ఉంటే తప్ప బయటకు రాకూడదని, ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సూచించారు.
పరిస్థితిని పర్యవేక్షిస్తున్న సుప్రీంకోర్టు:
రాజధానిలో కాలుష్యాన్ని అరికట్టేందుకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారిస్తున్న సుప్రీంకోర్టు, ఏడీఐ 450 కంటే తక్కువకు వెళ్లినా స్టేజ్-4 కింద నివారణ చర్యలను తగ్గించడాన్ని అనుమతించబోమని తెలిపింది.
క్లౌడ్ సీడింగ్ కోసం:
ఈ సమస్యను ఎదుర్కోవడానికి ఢిల్లీ ప్రభుత్వం క్లౌడ్ సీడింగ్‌ను కూడా ఒక చర్యగా పరిగణించింది.ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ కృత్రిమ వర్షంతో సమస్యను పరిష్కరించవచ్చని తెలిపారు. పొగమంచును తొలగించడానికి కృత్రిమ వర్షాన్ని తీసుకుని రావడానికి నగర ప్రభుత్వం అత్యవసర ప్రణాళికతో ముందుకు సాగడానికి సిద్ధంగా ఉందని, అయితే అనుమతులను ఆలస్యం అవుతున్నాయని, అందుకు కేంద్ర ప్రభుత్వాన్ని నిందించారు.
వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి కృత్రిమ వర్షాన్ని కురిపించడానికి ఉపయోగించే క్లౌడ్ సీడింగ్‌ను అనుమతించాలని ఢిల్లీ ప్రభుత్వం కేంద్రాన్ని అభ్యర్థించింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, కృత్రిమ వర్షం వాతావరణం నుండి కాలుష్య కారకాలను తగ్గిస్తుంది, గాలి నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
ఐఐటీ కాన్పూర్ ఈ క్లౌడ్ సీడింగ్ ప్రాజెక్టును ఢిల్లీ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. అయితే ఢిల్లీలో క్లౌడ్ సీడింగ్ అమలు అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. కానీ ఢిల్లీలో ప్రస్తుత వాతావరణ పరిస్థితులు క్లౌడ్ సీడింగ్ కార్యకలాపాలకు అనుకూలంగా ఉండకపోవచ్చు. ఐఐటీ కాన్పూర్ క్లౌడ్ సీడింగ్ అనుమతులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపింది.
AQI అంటే ఏమిటో తెలుసుకుందాం:
ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఐదు సాధారణ వాయు కాలుష్య కారకాలతో ముడిపడి ఉంటుంది. గ్రౌండ్ లెవెల్ ఓజోన్, పార్టికల్ పొల్యూషన్, కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ ల పరిమితులను బట్టి ఎయిర్ క్వాలిటీ అన్నది తెలుస్తుంది.
AQI అనేది 0 నుండి 500 మధ్య ఉంటే ఇది గాలి ఎంత శుభ్రంగా లేదా ఎంత కలుషితమైందో తెలియజేస్తుంది, అధిక AQI విలువ అంటే ఎక్కువ వాయు కాలుష్యం ఉంటుంది. 0 నుండి 50 మధ్య ఉన్న AQI 'మంచిది', 51 నుండి 100 'సంతృప్తికరమైనది', 101 నుండి 200 'మధ్యస్థం', 201 నుండి 300 ఉంటే పూర్ కేటగిరీ, 301 నుండి 400 మధ్య ఉంటే వెరీ పూర్, 401 నుండి 450 మధ్య ఉంటే గాలి పీల్చడం 'తీవ్రమైనది'గా.. 450 కంటే ఎక్కువ ఉంటే అత్యంత తీవ్రమైన పరిస్థితిగా భావించవచ్చు. గాలిలో ఉండే పార్టికల్ మేటర్ స్థాయిల కారణంగా ఆరోగ్యానికి పెను ప్రమాదం పొంచి ఉంది. ఈ చిన్న చిన్న కణాలు ఊపిరితిత్తులలోకి ప్రవేశించి అనేక వ్యాధులకు కారణమవుతాయి.
ఆరోగ్యానికి పెను ప్రమాదం.. ఎన్నో సమస్యలు:
లోకల్ సర్కిల్స్ విడుదల చేసిన సర్వే ప్రకారం, ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లోని 75% కుటుంబాలలో ఒక సభ్యుడు గొంతు నొప్పి లేదా నిరంతర దగ్గుతో బాధపడుతున్నారు. 50% కంటే ఎక్కువ మంది తలనొప్పి ఉందంటూ నివేదించారు. కొంతమంది శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు లేదా ఆస్తమాతో పోరాడుతున్నారు.
లోకల్ సర్కిల్స్ ఆన్లైన్ కమ్యూనిటీ ప్లాట్‌ఫారమ్ ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడా, ఫరీదాబాద్, ఘజియాబాద్‌లోని 21,000 మంది నుండి ప్రతిస్పందనలను తీసుకుంది. ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 63% పురుషులు, 37 శాతం మహిళలు ఉన్నారు. 27% కుటుంబాలు రక్షణ చర్యగా ఎయిర్ ప్యూరిఫైయర్లను కొనుగోలు చేశాయని సర్వే పేర్కొంది.
ఢిల్లీ లో ఇప్పుడు వాకింగ్ న్యుమోనియా అనే వ్యాధి వ్యాపిస్తున్నట్టు తెలుస్తోంది. ఇది ఫ్లూ లక్షణాలతో ప్రారంభమై, ఊపిరితిత్తుల్లో శ్లేష్మం, జ్వరం రావడం, గొంతు నొప్పి, బలహీనత, అలసట, దద్దుర్లు, చాతీ లో భారం గా ఉండడం, ఇవన్నీ ఈ వ్యాధి లక్షణాలు.
ఢిల్లీలో వాయు కాలుష్యానికి కారణాలు ఏమిటి?