ఫైసల్….ఫైనల్ డెసిషన్ అందుకే…??
షాఫైసల్… నిత్యం పుస్తకాలతో కుస్తీ పడుతూ పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు సుపరిచితమైన పేరు. దాదాపు గత పదేళ్లుగా దేశ వ్యాప్తంగా ఆయన పేరు వార్తల్లోకెక్కింది. ముఖ్యంగా [more]
షాఫైసల్… నిత్యం పుస్తకాలతో కుస్తీ పడుతూ పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు సుపరిచితమైన పేరు. దాదాపు గత పదేళ్లుగా దేశ వ్యాప్తంగా ఆయన పేరు వార్తల్లోకెక్కింది. ముఖ్యంగా [more]
షాఫైసల్… నిత్యం పుస్తకాలతో కుస్తీ పడుతూ పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు సుపరిచితమైన పేరు. దాదాపు గత పదేళ్లుగా దేశ వ్యాప్తంగా ఆయన పేరు వార్తల్లోకెక్కింది. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ లో ఆయన ఒక హీరోగా మారిపోయారు. కాశ్మీరీ యువతకు ఆదర్శప్రాయుడయ్యారు. 2009 బ్యాచ్ సివిల్స్ టాపర్ గా చరిత్ర సృష్టించారు. తద్వారా యావత్ దేశంతో పాటు కాశ్మీరీ యువతకు క్రేజీగా మారిపోయారు. సివిల్స్ టాపర్ మాత్రమే కాదు… సంక్షుభిత రాష్ట్రం నుంచి సివిల్స్ కు ఎంపికైన ఏకైక యువకుడు ఫైసల్ మాత్రమే కావడంతో ఆయన ఎందరో కాశ్మీరీ యువకులకు ఆదర్శప్రాయుడయ్యారు. తాను సివిల్స్ సర్వీస్ ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు ఇటీవల ఆయన చేసిన ప్రకటన సంచలనం సృష్టించింది. కాశ్మీర్ లో పెరుగుతున్న అణిచివేత, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా రాజీనామా చేస్తున్నట్లు చేసిన ప్రకటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఫైసల్ రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నట్లు ప్రకటించారు. ఆయన నేషనల్ కాన్ఫరెన్స్ తరుపున లోక్ సభకు పోటీ చేయనున్నట్లు సమాచారం. తన రాజీనామా ద్వారా కాశ్మీర్ సమస్య తీవ్రతను ఫైసల్ జాతీయ, అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకువచ్చారు. తద్వారా కశ్మీర్ పై చర్చకు మరోసారి అవకాశం ఇచ్చినట్లు అయింది. కొద్దిసేపు కాశ్మీర్ ను పక్కన పెట్టినట్లయితే ఫైసల్ ప్రస్థానం యువతకు ఆదర్శనీయం.
కష్టపడి సాధించిన….
ఫైసల్ 1983 లో కాశ్మీర్ లోని లోలబ్ వ్యాలీలో జన్మించారు. ఉత్తర కాశ్మీర్ లోని కుస్వారా జిల్లాలో గల ఈ గ్రామం మారుమూల ప్రాంతంలో ఉంది. తండ్రి గులాం రసూల్ షా ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు. తల్లి ముబీన్ షా కూడా ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలే కావడం గమనార్హం. తండ్రి చిన్నప్పుడే తీవ్ర వాదుల తుపాకీ గుండ్లకు బలయ్యారు. దీంతో బాగా చదువుకుని పైకి రావాలన్న తపన ఫైసల్ లో బలపడింది. అదే సయమంలో తన తండ్రిని బలిగొన్న తీవ్రవాద సమస్య మూలాలను తెలుసుకోవాలని, సమస్యను పరిష్కరించాలని భావించాడు. తాను బాగా చదువుకుని ఐఏఎస్ అధికారి కావడమే మార్గమని గుర్తించాడు. దీంతో లక్ష్య సాధన దిశగా దృష్టి కేంద్రీకరించారు. శ్రీనగర్ లోని షేర్-ఇ-కశ్మీర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో వైద్యశాస్త్రాన్ని అభ్యసించారు. అనంతరం సివిల్స్ లక్ష్యం దిశగా ప్రయాణం సాగించారు. ఈ ప్రస్థానంలో నిరంతరం శ్రమించాడు. రాత్రింబవళ్లూ చదివాడు. అనేక జాతీయ, అంతర్జాతీయ సమస్యలు, ముఖ్యంగా కశ్మీర్ సమస్యను లోతుగా అధ్యయనం చేశాడు. అత్యున్నతమైన ఐఏఎస్ అధికారిగా దేశానికి, పేద ప్రజలకు సేవలు అంద చేయాలన్నదే ఆయన లక్ష్యం. వైద్య శాస్త్రాన్ని చదివినప్పటికీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జాగ్రఫీ ఆప్షనల్స్ గా సివిల్స్ కు తయారయ్యాడు. తర్వాత పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తో పాటు తన మాతృభాష అయిన ఉర్దూను ఆప్షనల్ గా ఎంచుకున్నారు. చాలా తక్కువ మంది ఉర్దూను ఎంచుకుంటారు. ఆప్షనల్ ఎంపిక ముఖ్యం కాదని, ఏది ఎంచుకున్నా బాగా కష్టపడితే విజయం సాధించవచ్చన్నది ఫైసల్ భావన. అనుకున్నట్లే 27 సంవత్సరాల వయసులో 2009 సివిల్స్ బ్యాచ్ లో టాపర్ గా నిలిచి సంచలనం సృష్టించారు. దీంతో యావత్ దేశం ఆయనపై దృష్టి సారించింది. సంక్షుభిత రాష్ట్రం నుంచి ఓ ముస్లిం యువకుడు ఐఏఎస్ కు ఎంపిక కావడం, అందులో టాపర్ గా నిలవడం అదే ప్రధమం. ఐఏఎస్ అధికారిగా వివిధ హోదాల్లో సమర్థంగా పనిచేసి ప్రజల మన్ననలను పొందారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు అందేలా చూడటంలో కీలక పాత్ర పోషించారు. ఇటీవల విదేశాల్లో శిక్షణ పూర్తి చేసుకుని వచ్చిన ఫైసల్ పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ లోపు హటాత్తుగా రాజకీయ ప్రకటన చేశారు.
వెయిటింగ్ లిస్ట్ లో ఉంచి…..
ఫైసల్ గత కొంతకాలంగా కశ్మీర్ సమస్యపై గళం విప్పుతున్నారు. కశ్మీర్ లో ప్రభుత్వ అణచివేత నానాటికీ తీవ్రమవుతుందని, ప్రజల హక్కులను ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని ద్వజమెత్తారు. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవడం లేదని ఆరోపించారు. భారతీయ ముస్లింలు హిందువుల చేతిలో వివక్షకు గురవుతున్నారని, వారిని ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తున్నారని విమర్శలు సంధించారు. జమ్ముకాశ్మీర్ ప్రత్యేక అస్తిత్వంపై పరోక్ష దాడి జరుగుతోందని, ఇందుకు ప్రభుత్వ మద్దతు ఉందని ధ్వజమెత్తారు. ఒక అధికారిగా ఈ సమస్యలపై తాను పోరాడతానని, అందువల్లే రాజీనామా చేస్తున్నట్లు ఫైసల్ ప్రకటించారు. అయితే ఫైసల్ వ్యవహార శైలి, వ్యాఖ్యలపై గత కొంతకాలంగా ప్రభుత్వం అసంతృప్తితో ఉంది. ఆయన చేసిన వ్యాఖ్యలపై గత ఏడాది విచారణకు ఆదేశించింది. ఆయనను పక్కనపెట్టాలన్న ఉద్దేశ్యంతోనే ముందుకుసాగుతోంది. ఇందులో భాగంగానే విదేశాల్లో శిక్షణ పూర్తి చేసుకుని వచ్చినప్పటి నుంచి పోస్టింగ్ ఇవ్వకుండా జాప్యం చేసింది. ఆయనను నిరీక్షణ జాబితా (వెయిటింగ్ లిస్ట్) లో ఉంచింది. దీంతో చివరకు ఫైసల్ రాజీనామా చేశారు. ఆయన ఫరూక్ అబ్దుల్లా సారథ్యంలోని నేషనల్ కాన్ఫరెన్స్ లో చేరతారని సమాచారం. కశ్మీర్ లోయలోని బారాముల్లా నియోజకవర్గం నుంచి లోక్ సభకు పోటీ చేస్తారని చెబుతున్నారు. 1998 నుంచి 2009 వరకూ ఇక్కడ నేషనల్ కాన్ఫరెన్స్ గెలిచింది. 2014లో ఈ స్థానాన్ని పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ చేజిక్కించుకుంది. 30 వేల ఓట్ల తేడాతో నేషనల్ కాన్ఫరెన్స్ రెండో స్థానంలో నిలిచింది. ఈసారి ఇక్కడి నుంచి విజయం సాధించి కాశ్మీర్ వాణిని చట్టసభలతో పాటు వివిధ వేదికలపై బలంగా విన్పించాలన్నది ఫైసల్ ప్రయత్నం. ఫైసల్ నిర్నయాన్ని నేషనల్ కాన్ఫరెన్స్ సారథి ఫరూక్ తో పాటు హురియత్ కాన్ఫరెన్స్ అధినేత ఉమర్ ఫరూక్ స్వాగతించారు. అంటే ఫైసల్ కు రాజకీయ అండదండలు పుష్కలంగా ఉన్నట్లే….!!
-ఎడిలోరియల్ డెస్క్