Mon Dec 23 2024 06:34:28 GMT+0000 (Coordinated Universal Time)
ఇంకా ఎన్ని వినాలో? భవిష్యత్ అంతా ఇంతేనా
ఉచితం..ఉచితం.. ఎన్నికలు వస్తే రాజకీయనేతలకు ఇది ఊత పదం. ఉచితాలకు జనాలు కూడా బాగా అలవాటు పడిపోయారు
ఉచితం..ఉచితం.. ఎన్నికలు వస్తే రాజకీయనేతలకు ఇది ఊత పదం. ఉచితాలకు జనాలు బాగా అలవాటు పడిపోయారు. పెరిగిన ధరలు, ఉపాధి అవకాశాలు మెరుగుపడినప్పటికీ వెంటాడుతున్న నిరుద్యోగ సమస్య, పెరుగుతున్న అవసరాలు, సౌకర్యాల కోసం ప్రజలు ఉచితాల వైపు ఎదురు చూస్తుంటారు. గెలిచి తమకు చేసేది ఏమీ లేదని భావించి ఉచితాలను ఆహ్వానించడం పరిపాటిగా మారింది. అది జనం తప్పు కాదు. ఎన్నికల్లో గెలవాలంటే ఉచితంతో కూడిన హామీలు ఇస్తేనే గెలుస్తామన్న నమ్మకం పార్టీ అధినేతల్లో పాతుకుపోయింది. అందుకే అడ్డుగోలు ఉచితాలకు రాజకీయపార్టీ అధినేతలు తెరతీసే అవకాశాలున్నాయి. నువ్వొక రూపాయి ఇస్తే నేను రెండు రూపాయలిస్తా నంటూ జనాన్ని తమ వైపునకు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తుంటారు.
ప్రారంభమైన…
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో ఉచిత హామీలు ప్రారంభమయ్యాయి. అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అనేక స్కీమ్ లతో జనంలోకి వెళ్లింది. నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోకి నగదును జమ చేస్తూ జగన్ ప్రత్యేకంగా ఓటు బ్యాంకును సంపాదించుకున్నారు. ఈ నాలుగున్నరేళ్లలోనే దాదాపు రెండున్నర లక్షల కోట్ల రూపాయలను జనం ఖాతాల్లో జమ చేశారు. వివిధ పథకాలకు క్యాలండర్ ను రూపొందించుకుని మరీ బటన్ నొక్కుతున్నారు. నేరుగా తమ ఖాతాల్లోకి నగదు వచ్చి పడుతుండటంతో ఫ్యాన్ పార్టీ అనేక కుటుంబాల్లోకి చొచ్చుకుపోయింది. ఇప్పుడు జగన్ ను తలదన్నేలా పథకాలను జనం ముందుకు పెట్టడమే టీడీపీ అధినేత చంద్రబాబు పని.
తొలి మ్యానిఫేస్టోలోనే…
ఇందుకోసం మొదటి విడత మ్యానిఫేస్టోలోనే ఆయన తన ఆలోచనను ఆవిష్కరించారు. సంఖ్యతో సంబంధం లేకుండా ప్రతి ఇంటికి తల్లికి వందనం, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, నాలుగు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పడం వంటివి ఆ కోవలోనివే. మహిళ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నంలో చంద్రబాబు ఉచిత గ్యాస్ సిలిండర్ స్కీమ్ ను తీసుకొచ్చారు. దీనివల్ల ఏడాదికి దాదాపు మూడు వేల ఆదా అవుతుందని లెక్కలు చెబుతున్నారు కూడా. ఇక దసరా నాటికి మరో మ్యానిఫేస్టో విడుదల అవ్వాల్సి ఉండగా చంద్రబాబు జైలు కెళ్లడంతో కొంత ఆలస్యమవుతుంది. ఇందులో కూడా మిగిలిన సామాజికవర్గాలకు కూడా పెద్దయెత్తున వరాలు ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మలి విడత మ్యానిఫేస్టోలోనూ ఉచిత హామీలే ఎక్కువగా ఉండనున్నాయి. ఇందుకోసం టీం పెద్దయెత్తున కసరత్తు చేస్తుంది.
జగన్ కూడా
కానీ ఎన్నికల సమయంలో వైసీపీ అధినేత జగన్ కూడా జోరుగానే ఈసారి హామీల వర్షం కురిపించే అవకాశాలున్నాయి. ఇందులో రైతు రుణ మాఫీ ప్రధానమైనదని అంటున్నారు. రైతాంగం మొత్తాన్ని తన వైపునకు తిప్పుకునేందుకు జగన్ ఈసారి రైతు రుణమాఫీని ప్రకటిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రెండోసారి అధికారంలోకి రావాలంటే కొన్ని వర్గాల ఓట్లను గంపగుత్తగా తెచ్చుకోవాలని భావిస్తున్న వైసీపీ అధినేత 2014 ఎన్నికల మాదిరిగా రైతు రుణమాఫీకి ప్రకటన చేయకుండా ఓటమిని కొనితెచ్చుకోలేరు. దీంతో పాటు మరికొన్ని పథకాలకు కూడా రూపకల్పన జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఏపీలో ఇక అంతా ఉచిత హామీలే వినపడనున్నాయి. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని పక్కన పెట్టి గెలుపే థ్యేయంగా అధికార, విపక్ష పార్టీల అగ్రనేతలు ఫ్రీ ప్రామిస్ లవైపు పరుగులు తీయనున్నారు. అయితే ఇందులో ఎవరి హామీలు ఆకట్టుకుంటాయి? ఎవరిని జనం నమ్ముతారన్నది ఎన్నికల తర్వాతే తెలియనుంది.
తెలంగాణలోనూ...
తెలంగాణలోనూ కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను హామీ ఇచ్చింది. దానికి ధీటుగా కేసీఆర్ కూడా రెండు రోజుల క్రితం మ్యానిఫేస్టోను ప్రకటించారు. అందులోనూ ఉచితాల సంఖ్య ఎక్కువగానే కనపడుతుంది. అయితే ఇవి ఉచితాలు కావని, సంక్షేమంగా మాత్రమే చూడాలని పార్టీలు చెబుతున్నప్పటికీ, ప్రజల పన్ను రూపంలో కట్టే సొమ్మును పంచి పెడుతున్నారన్న విమర్శలయితే బాగానే వినిపిస్తున్నాయి. మరి రానున్న రోజుల్లో మరిన్ని ఉచితాల మాట వినాలా? అన్నది ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది.
Next Story