గంటా గాయబ్.. ఎందుకలా జరిగిందబ్బా ?
ఓ వైపు అధినాయకుడు చంద్రబాబుని విశాఖకు రానీయకుండా అడ్డుకుంటూంటే అదే విశాఖ నుంచి గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలలో సీనియర్ మోస్ట్ లీడర్, మాజీ మంత్రి కూడా అయిన [more]
ఓ వైపు అధినాయకుడు చంద్రబాబుని విశాఖకు రానీయకుండా అడ్డుకుంటూంటే అదే విశాఖ నుంచి గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలలో సీనియర్ మోస్ట్ లీడర్, మాజీ మంత్రి కూడా అయిన [more]
ఓ వైపు అధినాయకుడు చంద్రబాబుని విశాఖకు రానీయకుండా అడ్డుకుంటూంటే అదే విశాఖ నుంచి గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలలో సీనియర్ మోస్ట్ లీడర్, మాజీ మంత్రి కూడా అయిన గంటా శ్రీనివాసరావు ఎక్కడ అన్న ప్రశ్న అందరిలోనూ వెంటనే వస్తుంది. నిజమే అక్కడ మిగిలిన వారి హడావుడి కనిపించింది. పొరుగు జిల్లాకు చెందిన అచ్చెన్నాయుడు ఉన్నారు. విశాఖ ఎమ్మెల్యే వెలగపూడి రామక్రిష్ణ బాబు ఉన్నారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన నిమ్మకాయల చినరాజప్ప ఉన్నారు. కానీ గంటా శ్రీనివాసరావు అయిపూ అజా మాత్రం లేకుండా పోయిందన్న చర్చ జరిగింది.
ఎందుకిలా…..?
బాబు విశాఖలో రెండు రోజుల టూర్ ప్రొగ్రాం తెలిసిన మిగిలిన వారు తమ నియోజకవర్గాల్లో చాన్నాళ్ళ క్రితమే ప్రజా చైతన్య యాత్రలు చేపట్టారు. జగన్ సర్కార్ కి వ్యతిరేకంగా భారీ స్టేట్మెంట్లు ఇచ్చారు. గంటా శ్రీనివాసరావు మాత్రం నాడు కూడా ఉలుకూ పలుకూ లేదు. నిజానికి ఆయన విశాఖ రాజధానిని గట్టిగా కోరుకున్నారు. అందువల్ల ఆయన దాని మీద వ్యతిరేకంగా ఏ మాటా ప్రకటించకపోవచ్చు. కానీ అధినేత తమ జిల్లాకు వస్తున్నపుడైనా ఎదురేగాలిగా. పక్కన నిలబడాలిగా. మరి గంటా శ్రీనివాసరావు గాయబ్ ఎందుకిలా అన్నదే తమ్ముళ్ళకు అర్ధం కావడం లేదుట.
ఉండీ లేనట్లుగా…..
నిజానికి గంటా శ్రీనివాసరావు పార్టీలోనే ఉన్నారు. మీడియా ఎదురుపడితే ఆ ప్రశ్న అడిగితే చిర్రుబుర్రులాడతారు. మీరు రాసేవి ఉత్త పుకార్లు అంటారు. తాను టీడీపీని వీడిపోనని గట్టిగా చెబుతారు. కానీ పార్టీ మీటింగులకు రారు. బాబు గతసారి విశాఖ వచ్చి రివ్యూలు చేసినా కూడా ముళ్ళ మీద కూర్చున్నట్లుగా కొంతసేపు మాత్రమే ఉండి వెళ్ళిపోయారు. ఇక ఆ తరువాత కూడా ఆయన ఎక్కువగా బయటకు కనిపించడం మానుకున్నారు. తిరిగితే ఒకసారి తన ఉత్తర నియోజకవర్గంలో తిరుగుతారు. అక్కడి పార్టీ నాయకులతో కనిపిస్తారు. అంతే జిల్లా పార్టీ ఆఫీసుకు గంటా శ్రీనివాసరావు రావడం మానుకుని చాలా కాలమైందని తమ్ముళ్ళంటారు.
వేచి చూడడమేనా?
గంటా శ్రీనివాసరావు తెలివైన రాజకీయ నాయకుడు అంటారు. ఆయన వర్తమానంలో ఉంటూనే భవిష్యత్తుని బహు బాగా చూస్తారు. ఏపీలోని రాజకీయాలను, మరో నాలుగేళ్ళలో జరిగే ఎన్నికలూ, వాటి సమీకరణలు కూడా గంటా శ్రీనివాసరావు ఇప్పటినుంచే సరిగ్గా అంచనా వేయగలరు. మరి ఆయనకు టీడీపీ మీద ఇంకా నమ్మకం కుదిరినట్లుగా లేదని ఆయన గురించి తెలిసిన వారు అంటారు. అలాగని ఇతర పార్టీలలోకి ఇపుడే వెళ్ళే తొందరపాటు ఆలోచనలూ లేవు అని కూడా చెబుతారు. అందుకే ఆయన వేచి చూస్తున్నారుట. ఇపుడు ఆయన టెక్నికల్ గా టీడీపీ ఎమ్మెల్యే. విపక్షంలో గట్టిగా మాట్లాడాలి. కానీ ఆయన మాట్లాడరు, అది ఆయన ఇష్టం అని కూడా సన్నిహితులు అంటారు. ఆయన ఎందుకు మాట్లాడరు, ఎందుకు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనరు అని అడిగే ధైర్యం ఇపుడు హైకమాండ్ లో లేదు. ఆ బలహీనతే గంటా శ్రీనివాసరావు రాజకీయ బలం అంటారు. అందుకే ఆయన పార్టీ సమావేశాలకు వచ్చినా విశేషమే. రాకపోయినా విశేషమే. ఇలా గంటా రాజకీయ ఎత్తులు పై ఎత్తులూ ఎపుడూ సశేషమే.