మళ్లీ షిఫ్టింగ్ కు రెడీ అయిపోయారటగా?
విశాఖ జిల్లా రాజకీయాల్లో గంటా శ్రీనివాసరావుది ఒక చరిత్రగానే చెప్పాలి. ఆయన 1999లో తొలిసారి అనకాపల్లి నుంచి టీడీపీ తరఫున అనూహ్యంగా ఎంపీ అభ్యర్ధి అయ్యారు. అంతే [more]
విశాఖ జిల్లా రాజకీయాల్లో గంటా శ్రీనివాసరావుది ఒక చరిత్రగానే చెప్పాలి. ఆయన 1999లో తొలిసారి అనకాపల్లి నుంచి టీడీపీ తరఫున అనూహ్యంగా ఎంపీ అభ్యర్ధి అయ్యారు. అంతే [more]
విశాఖ జిల్లా రాజకీయాల్లో గంటా శ్రీనివాసరావుది ఒక చరిత్రగానే చెప్పాలి. ఆయన 1999లో తొలిసారి అనకాపల్లి నుంచి టీడీపీ తరఫున అనూహ్యంగా ఎంపీ అభ్యర్ధి అయ్యారు. అంతే దూకుడుగా ఆయన గెలిచి తన సత్తా చాటారు. ఆ తరువాత నుంచి ఇప్పటి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా నియోజకవర్గాలను మారుస్తూనే ఉన్నారు. అలాగే గెలుస్తూనే ఉన్నారు. ఇక గంటా శ్రీనివాసరావు గత ఏడాది జరిగిన ఎన్నికల్లో చివరి నిముషంలో విశాఖ ఉత్తరం నుంచి పోటీ చేసి గెలిచారు. ఆయన మంత్రిగా భీమిలీ నుంచి ప్రాతినిధ్యం వహించిన చోట పార్టీలో పోటీ ఉండడంతో అలా షిఫ్ట్ అయ్యారని అంటారు.
ఇష్టం లేకున్నా….
నిజానికి భీమిలీని వదిలేయడం గంటా శ్రీనివాసరావుకు అసలు ఇష్టం లేదుట. ఆయన అక్కడ నుంచి పోటీకి దిగుతారని తెలిసే సైకిల్ దిగిపోయి అవంతి శ్రీనివాస్ వైసీపీలోకి దూకారు. అయితే గంటా శ్రీనివాసరావు భీమిలీని వదిలేయడానికి కారణం చంద్రబాబు తనయుడు లోకేష్ అన్నది తెలిసిందే. చివరి వరకూ భీమిలీ నుంచి పోటీ చేస్తానని చెప్పిన లోకేష్ తరువాత మంగళగిరికి వెళ్ళిపోయారు. దానికి కారణం బాలయ్య చిన్నల్లుడు శ్రీభరత్. ఇలా ఇద్దరు తోడళ్లులూ విశాఖ జిల్లాలో పోటీ పడడం రాజకీయంగానే కాదు, కుటుంబపరంగా కూడా కుదరకపోవడంతో లోకేష్ అలా తప్పుకున్నారు. అపుడు అనాధ అయిన భీమిలీ నుంచి చివరి నిముషంలో మాజీ ఎంపీ సబ్బం హరిని దింపారు. నిజానికి అది రాంగ్ డెసిషన్ అని అపుడే తమ్ముళ్ళు గోల పెట్టారు.
ఆయనేనట….
ఇక గంటా శ్రీనివాసరావు భీమిలీని వదిలేసినా క్యాడర్ మాత్రం మీరే మా నాయకుడు అంటోంది. అక్కడ నుంచి ప్రతీ రోజూ నాయకులు ఇప్పటికీ విశాఖలో ఉన్న గంటా శ్రీనివాసరావు ఇంటికి వస్తారు. ఆయన్నే కలసి తమ సమస్యలు చెప్పుకుంటారు. ఇటీవల స్థానిక ఎన్నికల సమయంలో కూడా టీడీపీ అభ్యర్ధుల ఎంపిక, ప్రచారం వంటివి గంటా దగ్గరుండి చూశారు. ఆయన్ని మళ్ళీ పోటీ చేయమని నాయకులు కోరుతున్నారు. పైగా భీమిలీకి ఇంచార్జిగా ఉన్న సబ్బం హరిని అక్కడి తమ్ముళ్ళు అసలు పట్టించుకోవడంలేదని టాక్. ఇక హరి సైతం ఓడిన తరువాత భీమిలీ వెళ్ళడం అంతగా చేయడంలేదు. దీంతో గంటావే పార్టీ వారికి దిక్కు అయిపోయారు.
ఏ పార్టీ అయినా…?
దీంతో ఇప్పటి నుంచే భీమిలీలో ఓ టాక్ పెద్ద ఎత్తున సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో గంటా శ్రీనివాసరావు భీమిలీ నుంచే పోటీ చేస్తారని ప్రచారం మొదలైపోయింది. పార్టీ ఏదైనా కూడా గంటా శ్రీనివాసరావు భీమిలీ నుంచే ఎమ్మెల్యే, ఇది రాసిపెట్టుకోవచ్చు అని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఇక వైసీపీలోకి గంటా వచ్చినా కూడా భీమిలీ టికెటే కోరుతారని అంటున్నారు. ఇప్పటికే గంటాని వైసీపీలోకి తీసుకువచ్చేందుకు గట్టిగానే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానికి విజయసాయిరెడ్డి నేరుగా మంత్రాంగం నడుపుతున్నారు. గంటా శ్రీనివాసరావు పెట్టిన షరతులను అంగీకరించైనా ఆయన్ని పార్టీలోకి తేవాలన్నది హై కమాండ్ ఆదేశంగా ఉంది. మరి అదే జరిగితే ప్రస్తుత మంత్రి అవంతి రెండు విధాలుగా ఇరకాటంలో పడతారు. భీమిలీ సీటుతో పాటు, మంత్రి హోదాకు కూడా ముప్పు వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు. చూడాలి ఈ ఇద్దరు మిత్రుల రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయో.