శ్రీరామ నవమి పండుగ కాదు…?
భారతదేశానికే కాదు, ప్రపంచానికే సనాతమైన పరిపాలనకు మార్గదర్శిగా శ్రీరాముడిని చెప్పుకోవాలి. ఆధునిక జీవన సూత్రాలు, రాజధర్మమూ ముడిపడి ఉండటం ఆయన పాలనలోని విశేషం. నేటి రాజకీయ నాయకులు [more]
భారతదేశానికే కాదు, ప్రపంచానికే సనాతమైన పరిపాలనకు మార్గదర్శిగా శ్రీరాముడిని చెప్పుకోవాలి. ఆధునిక జీవన సూత్రాలు, రాజధర్మమూ ముడిపడి ఉండటం ఆయన పాలనలోని విశేషం. నేటి రాజకీయ నాయకులు [more]
భారతదేశానికే కాదు, ప్రపంచానికే సనాతమైన పరిపాలనకు మార్గదర్శిగా శ్రీరాముడిని చెప్పుకోవాలి. ఆధునిక జీవన సూత్రాలు, రాజధర్మమూ ముడిపడి ఉండటం ఆయన పాలనలోని విశేషం. నేటి రాజకీయ నాయకులు తాము ఆయన మార్గాన్ని ఆచరిస్తామని, అనుసరిస్తామని నమ్మబలుకుతూ ప్రజల ముందుకు వస్తుంటారు. కొన్ని వేల సంవత్సరాల క్రితం పురాణేతి హాసాల్లో నిక్షిప్తమైన రామచరిత్ర నేటికీ ఆదర్శంగా నిలుస్తోందంటే అందులోని గొప్పతనం అర్థమవుతుంది. ఎన్నిరకాల అక్రమ మార్గాల ద్వారా అయినా పదవులను పట్టుకుని వేలాడటం, దానికోసం ఎంతకైనా తెగించడం నేటి నాయకుల లక్షణంగా మారింది. తండ్రి చెప్పాడని తృణప్రాయంగా అడవుల బాట పట్టిన రాముడెక్కడ? తండ్రి సీటులో ఉండగానే ఆ పదవి కోసం పాకులాడుతున్న నాయకులెక్కడ? మంత్రివర్గంలో చోటు దక్కించుకుని నాన్న సీటు ఎప్పుడు ఖాళీ చేస్తాడా? ఎప్పుడు అందులో కూర్చోవాలా? అని ఆలోచించే వారసులెక్కడ? అందుకే మాటలెన్ని చెప్పినా , ఆయన చూపిన బాటను అనుసరించడం మాత్రం నేటి పాలకులకు సాధ్యం కాదనే చెప్పాలి. రాముడు పరిపాలన, నైతిక విలువలు, క్రమశిక్షణ, ఆశ్రిత వాత్సల్యం వంటి విషయాల్లో ఒక ప్రమాణం. పాలకులు, పాలితులు అనుసరిస్తున్న విధి విధానాల నిగ్గు తేల్చే గీటు రాయి. అందుకే రాముడు నేటికీ ఆదర్శప్రాయమవుతున్నాడు.
రాజధర్మం…
రాజ్యంలో ఉండే ప్రజలందరూ పాలకుని దృష్టిలో సమానులే. అర్హతను బట్టి అవకాశాలు కల్పించడమనేది పాలకుల ధర్మం. చెడ్డవాడు ఎంతటి బలవంతుడైనా అతనిని పదవి నుంచి తొలగించి మంచివాడికి మార్గం కల్పించాలి. వాలి మహాబలవంతుడు. అయినా చెడుమార్గం పట్టాడు. అతనిని తొలగించి సుగ్రీవునికి పట్టం గట్టాడు రాముడు. నేటి ప్రభుత్వ పాలనలో ప్రజలను పీడించే అధికారయంత్రాంగం, ఉన్నతాధికారులు మేడలు కడుతున్నారు. తాము ప్రజల పన్నుల ద్వారా జీతం తీసుకుంటున్నామనే కనీస జ్ణానం లోపించింది. ప్రజల పాలిట కంటకులుగా మారిన అధికారుల్లో ఎంతమందికి శిక్ష విధిస్తున్నారు? ఎంతమందిపై వేటు పడుతోంది? అంటే సమాధానమే రాదు. అవినీతి నిరోధక శాఖ , కేంద్ర దర్యాప్తు సంస్థలు కేసులు నమోదు చేశాయనే లెక్కలే తప్ప. శిక్ష పడిన ఉదంతాలు కనిపించవు. శిక్షా స్మృతి ఉన్నప్పటికీ సక్రమ ఆచరణకు నోచుకోని రాజ్యంగా బారత్ నిలిచిపోతోంది. అవినీతి కేసులు, అక్రమాల్లో కేసులు ఎదుర్కొన్న వారిలో నూటికి తొంభైతొమ్మిది శాతం మంది తప్పించుకుంటున్నారు. పరిపాలనలో లోపమా? వ్యవస్థలో లోపమా? పాలకులు ఆలోచించుకోవాలి. రాజధర్మం అంటే సంక్షేమ పథకాలు అమలు చేయడమూ, చట్టాలు చేయడమే కాదు. ప్రజలను పీడిస్తున్న వ్యవస్థను ప్రక్షాళన చేయడము కూడా. ఆ దిశలో ఇంతవరకూ ఏ ప్రభుత్వ హయాంలోనూ సక్రమమైన చర్యలు లేవు.
సహనం.. సంయమనం..
దేశంలో అసహనం పెరిగిపోతోంది. ఇందుకు పాలకులూ కారకులవుతున్నారు. కులాలు, మతాల పేరిట సమాజం విచ్ఛిన్నమవుతోంది. బలవంతపు చర్యలతో ఆధిపత్య ధోరణులు నెలకొంటున్నాయి. తన జాతి కాకపోయినప్పటికీ పశుపక్ష్యాదులతోనూ చెలిమి చేసిన ఘనత రామునికి దక్కుతుంది. ఆటవికులను అక్కున చేర్చుకున్నాడు. వానరులతో చేయి కలిపాడు. పక్షి చనిపోతేనే ప్రాణప్రదంగా బావించి వలవల ఏడ్చాడు. మతమూ, కులమూ కాదు, మానవత ముఖ్యమనేది శ్రీరామ సందేశం. అందుకే ప్రకృతిలోని సమస్త జీవులకు సమ స్థానం కల్పించాడు రాముడు. అప్పుడే సర్వశక్తులు సహకరిస్తాయి. రామరాజ్యంలో అంతర్గత సంక్షోభం ఎప్పుడూ లేదు. కుటుంబ పరమైన స్వార్థం, కలహాలు అర్హులను సైతం అవస్థల పాలు చేస్తాయి. దశరథుని వంటి వాడు సైతం కైకేయితో కష్టాలు పడ్డాడు. ఆనాటి ధర్మం ప్రకారం పట్టాభిషేకం చేయాల్సిన పెద్ద కొడుకుని దూరం పెట్టాడు. ఇప్పుడు కుటుంబ సభ్యులు రాజ్యంలో ఎంతగా వీరవిహారం చేస్తున్నారో చూస్తున్నాం. బార్యలు, బావమరుదులు, పిల్లలు రాజ్యమంటే కుటుంబమన్నట్లుగా మారిపోతోంది. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు నడుపుతున్న వారసత్వ రాజకీయాలు వక్రమార్గం పడుతున్నాయి. నిజానికి శ్రీరాముడు తన శక్తిసామర్ధ్యాలను నిరూపించకుని, కష్టనష్టాలను చవిచూసిన తర్వాతనే పట్టాభిషిక్తుడయ్యాడు. గోల్డెన్ స్పూన్ తో తమ వారసులకు రాజకీయాధికారం కట్టబెడుతున్నారు నేటి నాయకులు.
క్రమశిక్షణ…
విద్యార్థి లోకానికి కూడా రాముడు స్పూర్దిదాయకుడు. తాను రాజకుమారుడు. అయినా శిష్యుల్లో ఒకడే. వశిష్టుడు, విశ్వామిత్రుడి పట్ల శ్రీరాముడు కనబరిచిన గురుభావం నేటి తరంలో మచ్చుకైనా కనిపించడం లేదు. ఉపాధ్యాయులను, అధ్యాపకులను గేలి చేయడం నేటి ఫ్యాషన్ గా మారింది. సీతాదేవి శ్రీరాముడిని తొలి చూపులోనే ఇష్టపడినా తన అర్హత ద్వారానే స్వయంవరంలో పరిణయం చేసుకున్నాడు రాముడు. అది జీవనాదర్శం. జీవితంలో వృత్తి, ఉద్యోగాల్లో స్థిరపడకుండా అమ్మాయిల వెంటపడి వేధిస్తున్న యువతరం ఆధునిక పోకడగా అరాచకం సృష్టిస్తోంది. ఉపాధ్యాయులు, అధ్యాపకుల మాట వినరు. తల్లిదండ్రులు అదుపు చేయరు. పాలకులు చట్టపరంగా నియంత్రించరు. సర్వ వసతులతో కూడిన లంక వంటి మహానగరం తన అధీనంలోకి వచ్చినా రాముడు అక్కడ రాజు కాలేదు. జననీ జన్మభూమిశ్ఛ అంటూ అయోధ్యాపురి వైపే అడుగులు వేశాడు. అదీ మాతృభూమిపై ప్రేమ. ఇక్కడి ప్రజల పన్నులతో, ప్రభుత్వ సాయంతో చదువుకుని విదేశాల్లో విలాసవంతమైన జీవితం అనుభవించడానికి ఎగబడుతోంది నేటి యువత. విదేశాలకు వెళ్లడం తప్పు కాదు, అక్కడ కూడా జ్ణానాన్ని ఆర్జించి దేశ సౌభాగ్యం కోసం జన్మభూమికి వినియోగించినప్పుడే వారి జీవితం సార్థకం. రాముడు అన్నిటా ఆదర్శమే. అన్నివర్గాలకూ పూజనీయుడే. శ్రీరామ నవమిని ఒక పండుగలా కాకుండా, ఆయన ఆశయాలు, ఆదర్శాలనూ స్మరించుకోవడమూ అవసరమే.
-ఎడిటోరియల్ డెస్క్