ప్రియమైన శత్రువు
రాజకీయాల్లో ఎప్పుడేమి జరుగుతుందో ఎవరికీ అంతుచిక్కదు. ఏ పార్టీ వ్యూహమేమిటో కూడా తెలియదు. తెలుగు రాష్ట్రాలు ఇందుకు ప్రత్యక్ష నిదర్శనలు. 2009లో తెలంగాణలో కేవలం పది సీట్లు [more]
రాజకీయాల్లో ఎప్పుడేమి జరుగుతుందో ఎవరికీ అంతుచిక్కదు. ఏ పార్టీ వ్యూహమేమిటో కూడా తెలియదు. తెలుగు రాష్ట్రాలు ఇందుకు ప్రత్యక్ష నిదర్శనలు. 2009లో తెలంగాణలో కేవలం పది సీట్లు [more]
రాజకీయాల్లో ఎప్పుడేమి జరుగుతుందో ఎవరికీ అంతుచిక్కదు. ఏ పార్టీ వ్యూహమేమిటో కూడా తెలియదు. తెలుగు రాష్ట్రాలు ఇందుకు ప్రత్యక్ష నిదర్శనలు. 2009లో తెలంగాణలో కేవలం పది సీట్లు సాధించిన టీఆర్ఎస్ పునర్విభజన తర్వాత రాష్ట్రంలో అధికారం సాధించగలిగింది. 2012 ఉప ఎన్నికలలో ఆంధ్రప్రాంతంలో డిపాజిట్లు కోల్పోయిన తెలుగుదేశం 2014లో పగ్గాలు దక్కించుకోగలిగింది. 2018 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో డీలాపడి వంద సీట్లలో పత్తా లేకుండా పోయిన బీజేపీ 2019లో నాలుగు లోక్ సభస్థానాలు తెచ్చుకోగలిగింది. ఓడలు బళ్లు ..బళ్లు ఓడలవుతాయనే సాధారణీకరణకు ఇవన్నీ సరిపోతాయి. ఇందుకు ఆయా పార్టీల వ్యూహాలు తోడవుతుంటాయి. బీజేపీ, టీఆర్ఎస్ లు బాహాబాహీ తలపడుతున్న రాష్ట్రంగా తెలంగాణ రూపుదాల్చింది. ఇక్కడ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ ఎంతగా పోరాట పటిమ కనబరిచినా తగినంత ఆదరణ పొందలేకపోతోంది. నాయకత్వంలో అసమ్మతి లోపాలు, ఆపార్టీకి కేంద్ర నాయకత్వ దిశానిర్దేశం కొరవడటం ముఖ్య కారణాలు. ఈ నేపథ్యంలోనే బీజేపీ రాష్ఠ్రంలో ప్రధాన ప్రతిపక్షంగా పాగా వేసేందుకు, పాతుకు పోయేందుకు బలమైన ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పరోక్ష సహకారం ఉందనే భావనలు వ్యక్తమవుతున్నాయి.
పైకి కుస్తీ…
గవర్నర్ తమిళి సై నిన్నామొన్నటివరకూ భారతీయ జనతాపార్టీ క్రియాశీల కార్యకర్త. వయసు రీత్యాను, యాక్టివిటీ రీత్యానూ క్రియాశీల రాజకీయాల్లో ఇంకా చాలా కాలం ఆమె కొనసాగే అవకాశం ఉంది. అయినప్పటికీ తెలంగాణకు గవర్నర్ గా ఆమెను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ రాష్ట్రంలో పొలిటికల్ యాక్టివిటీ పెంచాల్సిన అవసరం దృష్ట్యానే ఆమెను నియమించారనేది జగమెరిగిన సత్యం. 2018 లో ముందస్తు ఎన్నికలకు అవకాశం కల్పించి కేంద్ర ప్రభుత్వం టీఆర్ఎస్ కు చక్కగా సహకరించింది. 2019 లోక్ సభ ఎన్నికల్లో తాను లాభపడింది. శాసనసభ, లోక్ సభలకు విడివిడిగా ఎన్నికలు జరగడం వల్ల మొత్తమ్మీద నష్టపోయింది కాంగ్రెసు పార్టీనే. టీఆర్ఎస్ , బీజేపీలు రాష్ట్రంలో మరింతగా బలపడ్డాయి. తాజాగా ఈ రెండు పార్టీల మధ్య వివాదం గవర్నర్ రూపంలో ముదురుపాకాన పడుతున్నట్లు బహిరంగంగా కనిపిస్తోంది. అటు టీఆర్ఎస్ కు, ఇటు బీజేపీకి ఇది లాభించే పరిణామంగానే చూడాలి. బీజేపీతో పోరు లో కేసీఆర్ కు మైనారిటీలు, ఎస్సీ,ఎస్టీ , క్రిస్టియన్ ఓటర్లు అండగా నిలబడతారు. ఆమేరకు కాంగ్రెస్ నష్టపోతుంది. అదే సమయంలో కాంగ్రెసుకు వెన్నుదన్నుగా ఉంటున్న రెడ్డి ఓటర్లు బీజేపీ వైపు తొంగి చూసే ఆస్కారం ఏర్పడుతుంది. ప్రధాన ప్రతిపక్షం స్పేస్ ను క్రమేపీ బీజేపీ ఆక్రమించేందుకు ఒక ప్రాతిపదిక ఏర్పాటవుతుంది.
కాంగ్రెసుకు ఇరకాటం…
బీజేపీ, టీఆర్ఎస్ వివాదంలో కాంగ్రెసు ఎటూ తేల్చుకోలేని ఇరకాటాన్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. టీఆర్ఎస్ తో కాంగ్రెస్ రాజకీయ పోరు చేస్తోంది. అదే సమయంలో జాతీయ స్థాయిలో బీజేపీ ప్రధాన ప్రత్యర్థి. గవర్నర్ తమిళి సై నేరుగా కీలకమైన అంశాలపై సమీక్షలు చేయడం బీజేపీకి ప్రజల్లో పలుకుబడి పెంచుతుంది. టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పోరాడుతున్న కాంగ్రెసు దీనిని తప్పుపట్టలేదు. అదే సమయంలో తన తర్వాత స్థానంలో ఉన్న బీజేపీ రాజకీయంగా పైకి ఎగబాకటాన్ని ఆకళింపు చేసుకోలేదు. తమిళి సై దూకుడు నిజంగానే టీఆర్ఎస్ ను కలవరపరుస్తోంది. అయితే అదీ మన మంచికే అనుకుంటున్న టీఆర్ఎస్ వాదులు కూడా ఉన్నారు. ఇప్పుడిప్పుడే రాష్ట్రంలో పలుకుబడి పెంచుకుంటున్న బీజేపీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ ఓటింగ్ సంఘటితం కావడానికి ఈ పరిణామం దోహదం చేస్తుందనే వాదన సైతం వినవస్తోంది.
బీజేపీ వికాసం…
తెలంగాణ అధినేత కేసీఆర్ ఆలోచనే భిన్నమైనది. అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ లో ఆయనను మించిన వారు లేరు. రాష్ట్రాన్ని ప్రసాదించిన కాంగ్రెసు బలపడితే టీఆర్ఎస్ ప్రయోజనాలకు భంగకరం. తెలంగాణ సెంటిమెంటును క్లెయిం చేసే పార్టీగా కాంగ్రెసు ప్రజాదరణ పొందడం కేసీఆర్ కు ఏనాడూ నచ్చదు. పైపెచ్చు ముస్లిం, క్రిస్టియన్ ఓట్లు విషయంలో కాంగ్రెసుతోనే టీఆర్ఎస్ కు పోటీ ఉంటుంది. జాతీయంగా కాంగ్రెసు బలపడితే ఓవైసీ వంటి నేతలు మళ్లీ కాంగ్రెస్ పంచన చేరడం కష్టమేమీ కాదు. ఈ స్థితిలో రాష్ట్రంలో టీఆర్ఎస్ వర్సస్ బీజేపీ అన్న వాతావరణం నెలకొంటే బలమైన ఓటు బ్యాంకు తనకు అండగా ఉంటుందనే భావన కేసీఆర్ ది. తెలంగాణలో ఉమ్మడి రాష్ట్ర ఆనవాళ్లు క్రమేపీ తొలగిపోవాలి. అదే సమయంలో రాష్ట్ర సెంటిమెంటును వేరే పార్టీ క్లెయిం చేసే వాతావరణం ఉండకూడదనేది కేసీఆర్ ఆలోచన. అవసరాన్ని మించి హంగులతో నూతన సచివాలయ నిర్మాణం ఇందులో ఒక భాగం. ఈ నేపథ్యంలో కాంగ్రెసు మూడో స్థానానికి వెళ్లిపోతే బీజేపీతో బాహాబాహీకి తలపడటమే టీఆర్ఎస్ కు మంచిది. దిశలోనే కమలనాథులు, కారు యోధులు పరస్పరం కవ్వించి కలహం పెట్టుకుంటున్నారనేది విశ్లేషకుల అంచనా.
-ఎడిటోరియల్ డెస్క్