వీళ్లున్నారు చూశారూ… వాళ్లకంటే దారుణం
లాక్ డౌన్ సడెన్ గా పెట్టేసి ఎక్కడివారికి అక్కడ కట్టిపడేశారు. సరే ఇది దేశానికి సంబంధించిన సమస్య అని ఎంత అనుకున్నా ముందస్తుగా కొంత టైం అయినా [more]
లాక్ డౌన్ సడెన్ గా పెట్టేసి ఎక్కడివారికి అక్కడ కట్టిపడేశారు. సరే ఇది దేశానికి సంబంధించిన సమస్య అని ఎంత అనుకున్నా ముందస్తుగా కొంత టైం అయినా [more]
లాక్ డౌన్ సడెన్ గా పెట్టేసి ఎక్కడివారికి అక్కడ కట్టిపడేశారు. సరే ఇది దేశానికి సంబంధించిన సమస్య అని ఎంత అనుకున్నా ముందస్తుగా కొంత టైం అయినా ఇవ్వలేదని విమర్శలు ఉన్నాయి. దాంతో నలభై రోజులుగా వలస కార్మికులు నానా అవస్థలు పడ్డారు, వారిలో ఉత్తరాంధ్ర మత్సకారులు కూడా ఉన్నారు. వారు దాదాపు మూడువేల మంది దాకా ఉన్నారు. నెల రోజులుగా అనేక రకాలుగా పోరుతూంటే ఇప్పటికి వారు సొంత గూటికి చేరారు. ఇందులో పాలకులు తప్పు ఉంటే సర్దుకున్నారనుకోవాలి. అలాగే లాక్ డౌన్ కి సమర్ధించిన అన్ని రాజకీయ పక్షాలు ఇందులో ఉన్నాయి. ఇపుడు మాత్రం తామే మత్స్యకారులకు పెద్ద మద్దతుదారులం అన్నట్లుగా రాజకీయ పార్టీలు చేస్తున్న ప్రకటనలు, రాజకీయ ఆరాటాలు చూస్తూంటే కరోనా సైతం కలవరపడుతుందేమో.
బాబుతోనే ….
తమ నాయకుడు రాసిన లేఖలతోనే మొత్తం ఇదంతా కదిలింది. ఎక్కడో గుజరాత్ లో ఇరుక్కుపోయినా మత్స్యకారులను వెనక్కిరప్పించడంతో చంద్రబాబు అపార అనుభవం, ఆయన పలుకుబడి, రాసిన లేఖలు కారణమని తమ్ముళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. మా నాయకుడు ప్రధాని ఆఫీస్ తో మాట్లాడారు, కేంద్ర మంత్రులకు ఫోన్లు చేశారు, గుజరాత్ సీఎంకి లేఖలు రాశారు. ఇంత చేసిన తరువాతనే వారు విడుదల కావడం జరిగింది. ప్రభుత్వంలో లేకపోయినా,అధికారం చేతిలో లేకపోయినా మా బాబే మొనగాడు అంటు పచ్చ పార్టీ నేతలు ఒకటే డబ్బా కొట్టుకుంటున్నారు.
మించిపోయారుగా ….
చంద్రబాబు సావాసమో మరేమో కానీ జనసేనాని పవన్ కళ్యాణ్ ఆయన్నే మించిపోయారు. చంద్రబాబు లేఖలు రాస్తే పవన్ ట్విట్టర్ ద్వారానే మొత్తం అందరినీ కదిలించేశారట. ఆయన చేసిన ప్రయత్నం వల్లనే కధ ఇంతదాకా వచ్చి సుఖాంతం అయిందట. ఆయన కూడా కేంద్ర ప్రభుత్వానికీ, గుజరాత్ ముఖ్యమంత్రికి, ప్రధానికి అందరికీ ధన్యవాదాలు తెలియచేస్తున్నారు. ఇంతకీ పవన్ చేసిన ట్వీట్ తో మత్స్యకార్మికులు వెనక్కు రావడానికి ఆయనేమీ ఎమ్మెల్యే కూడా కాడు, అతి పెద్ద రాజకీయ పక్షానికి నేత కూడా కాదు.ఒక్క ట్వీట్ తోనే స్పందించేయడానికి ఆయన చేసిందేమిటి అని వైసీపీ నుంచి గట్టిగానే కామెంట్స్ పడుతున్నాయి. చంద్రబాబు కంటే పవన్ ఇలాంటి ప్రచారంలో ముదిరిపోయారని కూడా అంటున్నారు.
రాహుల్ బాబు కూడా….
కాంగ్రెస్ ఏపీలో ఎక్కడ ఉందో తెలియదు కానీ మత్స్యకారుల విడుదలతో రాహుల్ చేసిన సాయం అంతా ఇంతా కాదని ఆ పార్టీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. మా రాహుల్ బాబు ఇలా ప్రభుత్వంతో మాట్లాడారో లేదో అలా వారిని సొంతూళ్ళకు పంపించేశారు అని ఖద్దరు నేతలు గొప్పగా అంటున్నారు. ఇదే తీరులో బీజేపీ నేతలు మీసాలు మెలివేస్తున్నారు. మా ప్రభుత్వం వారి దయనీయ పరిస్థితి చూసి చాలా బాధపడిపోయి ఈ విధంగా సొంత ప్రాంతానికి వచ్చేందుకు ఏర్పాట్లు చేసిందని అంటున్నారు.
వైసీపీ ఘనత…..
ఇక వైసీపీ సర్కార్ ఈ విషయంలో మొదటి నుంచి సీరియస్ గా ఉందని, ముఖ్యమంత్రి జగన్ ఎన్నో సార్లు ఈ విషయంలో గుజరాత్ సీఎంతో మాట్లాడారని, కేంద్రంతో సంప్రదింపులు జరిపారని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఇందులో ఎవరు కాదన్న ప్రభుత్వం చొరవ ముఖ్యం. వైసీపీ సర్కార్ మూడు కోట్లు మత్స్యకారులకు ఆర్ధిక భరోసాకు కూడ విడుదల చేయడమే కాకుండా బస్సులను కూడా ఏర్పాటు చేసింది. కాస్త సీరియస్ గానే రియాక్ట్ అయింది. సరే ఇవన్నీ ఎంత చేసినా కూడా కేంద్రం నలభై రోజుల లాక్ డౌన్ పూర్తి అవుతున్న సందర్భంగానే పంపుతోంది తప్ప ముందుగా పంపలేదు అన్నది అంతా గుర్తించాలి. అంటే ఇక్కడ కేంద్రం అనుకున్నట్లుగానే ఒక్క మత్స్యకారులనే కాదు, దేశంలో వివిధ చోట్ల చిక్కుకుపోయిన అందరినీ వెనక్కిపంపాలని నిర్ణయించుకుంది, ఇది మొత్తానికి అలా సాధ్యమైంది. అంతే. ఇందులో క్రెడిట్ తీసుకోవాలంటే అన్నాళ్ళు కష్టపడి పరాయి చోట తలదాచుకున్న మత్స్యకారులే తీసుకోవాలేమో.