పోటీ పడి పార్టీ పరువు తీసుకుంటున్న తమ్ముళ్లు.! కోడెల కోటలో కుమ్ములాటలు
నిన్నటి వరకూ పసుపు జెండా రెపరెపలు.. కుయ్ కుయ్ మంటూ కాన్వాయ్ సౌండ్లు.. ఆయన వస్తున్నారంటే అందరూ ఒక్కసారిగా అలర్ట్. ఏపీ అసెంబ్లీ తొలి స్పీకర్ కోడెల శివప్రసాద రావు ఉండగా ఆయన నియోజవకర్గం సత్తెనపల్లిలో కనిపించిన సీన్. ఇప్పుడదంతా గతం. 2019 ఎన్నికలతో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయింది. గద్దెనెక్కిన వైసీపీ వేధింపులో.. ప్రతిష్ట మంటగలిసిపోయిందన్న బాధో ఆయన్ను తిరిగిరానిలోకాలకు తీసుకెళ్లిపోయింది. కోడెల మరణంతో సత్తెనపల్లి టీడీపీకి గ్రహణం పట్టింది.
అప్పటి వరకూ అవకాశం కోసం ఎదురుచూస్తున్న అసమ్మతి నేతలంతా ఒక్కసారిగా జూలు విదిల్చారు. తామే నియోజకవర్గ ఇన్‌చార్జులమంటూ తెరపైకి వచ్చారు. కోడెల తనయుడు శివరాం వ్యవహారశైలితోనే టీడీపీ ఓటమి పాలైందని.. ఆయనను కాదని తమనే ఇన్చార్జిగా ప్రకటించాలంటూ టీడీపీ కేంద్ర కార్యాలయానికి క్యూలు కట్టారు. ఎలాగైనా కోడెల తనయుడికి చెక్ పెట్టాలని పార్టీ కార్యక్రమాలను భుజానికెత్తుకున్నారు. సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజనేయులు కూడా చాలా ఏళ్ల తర్వాత మళ్లీ నియోజకవర్గంలోకి ఎంట్రీ ఇచ్చారు. పార్టీ కార్యక్రమాలను ముందుండి నడిపించేందుకు సిద్ధమయ్యారు. ఎప్పటి నుంచో సత్తెనపల్లి ఎమ్మెల్యే టిక్కెట్ తనదే అని చెప్పుకుంటున్న మరో నేత అబ్బూరి మల్లి తన వర్గంతో యాక్టివ్ అయ్యారు.
తనను పక్కకు నెట్టి ముందుకెళ్లాలని చూస్తుండడంతో కోడెల కొడుకు కూడా సీరియస్‌గా తీసుకున్నారు. దీంతో మూడు ముక్కలాటగా తయారైంది పార్టీ పరిస్థితి. ఎవరి వర్గం వారిదే. ఎవరి అజెండా వారిదే. పార్టీ అజెండా సెట్ చేసినా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా సాగుతోంది వ్యవహారం. టీడీపీ అధినేత పిలుపునిచ్చిన కార్యక్రమాలను మూడు వర్గాలు పోటాపోటీగా నిర్వహిస్తున్నాయి. సత్తెనపల్లి ఇన్చార్జి పదవి తనకంటే తనకే దక్కుతుందని చెబుతూ కయ్యానికి కాలు దువ్వుతున్నాయి. ఆఖరికి పార్టీ ఆఫీస్‌కి బ్యానర్లు కట్టే విషయంలోనూ గొడవలకు దిగుతూ పార్టీ ప్రతిష్టను బజారుకీడుస్తున్నాయి.
తాజాగా అన్న క్యాంటీన్ల వ్యవహారంలోనూ మరోమారు విభేదాలు బయటపడ్డాయి. పోటీ పడి మరీ అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు నేతలు సిద్ధమయ్యారు. మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజనేయులు పార్టీ కార్యాలయం వద్ద అన్న క్యాంటీన్ ఏర్పాటు చేయగా.. దాని పక్కనే కోడెల తనయుడి వర్గం మరో క్యాంటీన్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. దీంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. మరో నేత మల్లి బస్టాండ్ వద్ద తన అనుచరులతో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేయించారు. అన్న క్యాంటీన్ల ఏర్పాటులో కూడా ఈ గొడవ ఏంటని జనం ముక్కుమీద వేలేసుకునేలా తయారైంది పరిస్థితి. వచ్చే ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్ తనదంటే తనదేనని ప్రచారం చేసుకుంటున్నారు ముగ్గురు నేతలు.
టిక్కెట్ ఎవరిని వరిస్తుందో తెలియదు కానీ అప్పటి వరకూ పరిస్థితి ఇలాగే కొనసాగితే మాత్రం టీడీపీ జెండా అదేదో చింపిన విస్తరి కావడం మాత్రం ఖాయం. క్యాడర్ బలంగా ఉన్నా అందరినీ ఏకతాటిపైకి తెచ్చే నాయకుడు కరువవడం పార్టీకి శాపంగా మారింది. అదే అధికార పార్టీకి వరంగా మారుతోంది. ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి అంబటికి నాన్‌లోకల్ అనే ముద్ర ఉంది. పాలనాపరంగానూ అంబటికి అత్తెసరు మార్కులే పడుతున్నాయి. జగన్ సర్కార్ వచ్చిన తర్వాత అంతగా అభివృద్ధి జరిగిందేమీ లేదన్న ముద్ర పడిపోయింది.
పట్టణంలో తారకరామ సాగర్ ప్రాజెక్ట్, చుట్టుపక్కల గ్రామాల్లో స్వర్గపురి వంటి కార్యక్రమాలతో ఎంతోకొంత డెవలప్మెంట్ చేశారని డాక్టర్ కోడెలకు పేరుంది. టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని చెప్పుకునైనా కొంత మైలేజ్ తెచ్చుకోవాల్సిన తెలుగు తమ్ముళ్లు మాత్రం గ్రూపు తగాదాలతో రోజురోజుకీ దిగజారిపోతున్నారు. పార్టీ పరువును బజారుకీడుస్తున్నారు. అందరి ముందే కయ్యానికి దిగుతూ నానాటికీ తీసికట్టుగా తయారవుతున్నారు. ఇప్పటికైనా అధినేత స్పందించి పరిస్థితులు చక్కదిద్దితే బాగుంటుందని.. లేకుంటే చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.