హరీష్‌కు కేసీఆర్ మార్క్ చెక్.. మళ్లీ బలిపశువేనా ?
తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యూహాలు పన్నడంలో ఎంత దిట్టో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రత్యర్థి పార్టీ నేతలకు చెక్ పెట్టడంతో పాటు సొంత పార్టీలో తలెగరేసే నేతలతో పాటు [more]
తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యూహాలు పన్నడంలో ఎంత దిట్టో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రత్యర్థి పార్టీ నేతలకు చెక్ పెట్టడంతో పాటు సొంత పార్టీలో తలెగరేసే నేతలతో పాటు [more]
తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యూహాలు పన్నడంలో ఎంత దిట్టో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రత్యర్థి పార్టీ నేతలకు చెక్ పెట్టడంతో పాటు సొంత పార్టీలో తలెగరేసే నేతలతో పాటు పార్టీలో ఉన్న వారసత్వ పోరుకు కూడా ఎలా తెరదించాలో బాగా తెలిసిన వ్యక్తి. కేసీఆర్ ఇతర పార్టీల నేతలతో పాటు సొంత పార్టీ నేతలకు చాలా సులువుగానే చెక్ పెట్టేస్తూ ఉంటారు. అయితే వారసత్వ పోరు విషయంలో ఇటు కొడుకు కేటీఆర్.. అటు పార్టీ ఆవిర్భావం నుంచి తన వెంటే ఉన్న మేనళ్లుడు హరీష్‌రావు. వీరిద్దరి పంచాయితీని ఓ పట్టాన సులువుగా తేల్చలేరు. 2018లో ముందస్తు ఎన్నికల్లో పార్టీ గెలిచాక కేటీఆర్‌కు అనూహ్యంగా ప్రాధాన్యం పెరిగింది. ప్రారంభంలో హరీష్ ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది.
ఇద్దరి మధ్య…?
ఇక 2014 లోక్‌సభ ఎన్నికల్లో వీరిద్దరి మధ్య మెదక్, కరీంనగర్ ఎంపీ సీట్ల విషయంలో సవాల్ జరిగింది. ఇంకా చెప్పాలంటే కేటీఆరే మెదక్ కంటే కరీంనగర్ ఎంపీ సీటును తాను ఎక్కువ మెజార్టీతో గెలిపిస్తానని సవాల్ చేశారు. మెదక్ ఎంపీ సీటు భారీ మెజార్టీతో టీఆర్ఎస్ గెలిస్తే… కరీంనగర్ ఎంపీ సీటులో టీఆర్ఎస్ ఓడిపోయింది. ఆ తర్వాత హుజూర్నగర్ లాంటి ఉప ఎన్నికల బాధ్యతను కేసీఆర్ వ్యూహాత్మకంగా కేటీఆర్‌కే అప్పగించారు. అయితే దుబ్బాకలో పూర్తి బాధ్యత తీసుకున్న మంత్రి హరీష్‌రావుకు చెక్ పడింది. సాధారణంగా ఏ ఉప ఎన్నిక జరిగినా ముందే టీఆర్ఎస్ రాష్ట్ర టీం అంతా వాలిపోతుంది.
దుబ్బాక ఉప ఎన్నికలో….
దుబ్బాకలో మాత్రం కేసీఆర్ తో పాటు ఇతర నేతలు ఎవ్వరూ కన్నెత్తి చూడలేదు. ఏదేమైనా దుబ్బాక ఓటమి హరీష్‌రావు పూర్తిగా తన నెత్తిమీదే పెట్టుకున్నారు. ఇక సాగర్ ఉప ఎన్నిక కోసం కేసీఆర్‌తో పాటు టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మొత్తం వాలి గెలిపించుకున్నారు. ఇక తెలంగాణలో హుజూరాబాద్‌లో మరో ఉప ఎన్నిక రావడం ఖాయం. నిన్నటి వరకు కేసీఆర్ కేబినెట్లో మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం ఖాయమైన నేపథ్యంలో త్వరలోనే అక్కడ ఉప ఎన్నిక రానుంది.
మిగిలిన పార్టీలన్నీ….?
మిగిలిన ఉప ఎన్నికలకు హుజూరాబాద్ ఉప ఎన్నికకు చాలా తేడా ఉంది. ఇది ఈటల రాజేందర్ కంచుకోట. ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చినంత మాత్రానా ఆయన పట్టు సడలిపోతుందనుకోవడం అత్యాశే. పార్టీలతో సంబంధం లేని ఇమేజ్ ఈటల సొంతం. గత లోక్‌సభ ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీ సీటు టీఆర్ఎస్ ఓడినా.. ఈ సెగ్మెంట్ వరకు ఆ పార్టీకి ఏకంగా 54 వేల ఓట్ల భారీ మెజార్టీ వచ్చింది. ఇక్కడ పార్టీ గొప్పతనం కంటే ఈటల గొప్పతనమే ఎక్కువ. రేపటి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ లాంటి పార్టీలు కూడా ఈటలకు సపోర్ట్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
మరింత రసవత్తరంగా…?
ఇలాంటి చోట మళ్లీ హరీష్ ట్రబుల్ షూటర్ అంటూ ఆయన్ను కేసీఆర్ రంగంలోకి దించుతున్నారు. హుజూరాబాద్ పక్కనే ఉన్న మంత్రి కేటీఆర్‌కు కాకుండా ఇక్కడ హరీష్‌కు మళ్లీ బాధ్యతలు అప్పగించాలన్న ఆలోచన ఏంటో లోతుగా ఆలోచిస్తే ఇట్టే అర్థమవుతుంది. ఈ దెబ్బతోనే టీఆర్ఎస్లో అత్యంత సన్నిహితులుగా మెలిగిన ఈటల, హరీష్ రావులను ఇప్పుడు బద్ధశత్రువులుగా మార్చబోతున్నారు. ఇక తెలంగాణలో హరీష్, రేవంత్, ఈటల కలిస్తే బాగుంటుందన్న చర్చలు స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ హరీష్‌కు బాధ్యతలు ఇస్తే హరీష్‌కు చెక్ పెట్టేసి.. ఓటమి నెపం నెట్టేసే ప్లాన్ వేశారా ? అన్న సందేహం కూడా కలుగుతోంది. హుజూరాబాద్ ఉప ఎన్నికతో తెలంగాణ రాజకీయం మరింత రసవత్తరంగా మారబోతోందనడంలో సందేహం లేదు.