యథా రాజా తథా ఉద్యోగి..?
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఇప్పుడిప్పుడే తెలిసి వస్తున్నట్టుంది. కొంతలో కొంత తెలంగాణ నయం. ఆంధ్రాలో అయితే అసలు ఉద్యోగస్థులు సచివాలయానికి వస్తారో,లేదో తెలియని స్థితి. నిన్నామొన్నటివరకూ కోవిడ్ [more]
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఇప్పుడిప్పుడే తెలిసి వస్తున్నట్టుంది. కొంతలో కొంత తెలంగాణ నయం. ఆంధ్రాలో అయితే అసలు ఉద్యోగస్థులు సచివాలయానికి వస్తారో,లేదో తెలియని స్థితి. నిన్నామొన్నటివరకూ కోవిడ్ [more]
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఇప్పుడిప్పుడే తెలిసి వస్తున్నట్టుంది. కొంతలో కొంత తెలంగాణ నయం. ఆంధ్రాలో అయితే అసలు ఉద్యోగస్థులు సచివాలయానికి వస్తారో,లేదో తెలియని స్థితి. నిన్నామొన్నటివరకూ కోవిడ్ వంక, అంతకుముందు మూడు రాజధానుల గొడవ. ఇంకా వెనుకకు వెళితే హైదరాబాద్ నుంచి తరలింపు. ఇలా రకరకాల కారణాలతో ఉద్యోగులైతే కార్యాలయాలకు చాలా కాలంగా డుమ్మా కొడుతున్నారు. నవ్యాంధ్ర ప్రదేశ్ కు సంబంధించి ప్రభుత్వోద్యోగులు పాలనను గాలికి వదిలేశారన్న విషయం ముఖ్యమంత్రి ఆవేదనతోనే తేటతెల్లమైంది. వారానికి అయిదే రోజులు పని. అందులోనూ సోమవారం మధ్యాహ్నం వరకూ సెక్రటేరియట్ లో ఉద్యోగులు కనిపించరు. శుక్రవారం మధ్యాహ్నం నుంచే మూటాముల్లె సర్దుకుని వెళ్లిపోతుంటారు. ఈ మధ్య కాలంలో అది కూడా సక్రమంగా జరగడం లేదు. ఎవరు ఎప్పుడు వస్తారో చెప్పలేకపోతున్నారు. ఈ సమస్య చాలా కాలం నుంచే ఉంది. ఇటీవలి కాలంలో మంత్రులు, ఎమ్మెల్యేలకు సైతం అధికారులు, ఉద్యోగులు అందుబాటులో లేకపోవడంతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దృష్టికి వచ్చింది. దీనిపై ఆయన స్పందించారు. ప్రధాన కార్యదర్శిని కూడా స్పందింప చేశారు. కానీ దీంతోనే సమస్య తీరిపోతుందా? అంటే ఎవరూ చెప్పలేకపోతున్నారు.
ఉద్యోగస్వామ్యం…
రాష్ట్రాల విభజన తర్వాత అత్యధికంగా ప్రయోజనాలు పొందింది ఉద్యోగ వర్గాలే. పోటీలు పడి మరీ రెండు రాష్ట్రాలు ఉద్యోగులకు ఫిట్ మెంటులు అందచేశాయి. వేతనాలు బారీగా పెరిగాయి. పదవీ విరమణ వయసును 58 నుంచి 61 వరకూ పెంచారు. మరోవైపు పదోన్నతులకు అవకాశం వచ్చింది. ఇన్నిరకాలుగా ప్రయోజనం పొందినప్పటికీ అలసత్వం నెలకొంటూనే ఉంది. ఆంధ్రప్రదేశ్ తన రాజధానిని అమరావతికి మార్చుకుంది. ఇందుకు గాను ఉద్యోగ వర్గాలను బతిమలాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. హైదరాబాద్ లో సుదీర్ఘకాలంగా సెటిల్ అయిన ఉద్యోగులు అమరావతి వెళ్లడానికి ఇష్టపడలేదు. అయిదురోజుల పనిదినాలను ప్రవేశపెట్టారు. అనేక రకాల రాయితీలు, సదుపాయాలు, వసతులు కల్పించారు. తప్పని సరి పరిస్థితుల్లోనే ఉద్యోగులు కదిలారు. . అయినా కుటుంబ నివాసాలను చాలామంది హైదరాబాద్ లోనే ఉంచేసుకున్నారు. కేవలం ఉద్యోగం నిమిత్తం వెళ్లివచ్చేసేలా షటిల్ సర్వీసులను ఏర్పాటు చేసుకున్నారు . ప్రభుత్వానికి ఈ తతంగం అంతా తెలిసినప్పటికీ ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో పడిపోయింది. గడచిన అయిదు సంవత్సరాలుగా ఇదే తంతు.
చేతులు కాలాక…
ముఖ్యమంత్రి జగన్ ఉద్యోగులు, అదికారుల తీరుపై వస్తున్న ఫిర్యాదులను పరిశీలించి ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ ఉద్యోగులు ఇప్పటికే సర్వం సహా ఇష్టారాజ్యమైన వ్యవస్థను నెలకొల్పుకున్నారు. చంద్రబాబు నాయుడి హయాంలోనే మూడేళ్లు ఇలా గడిచిపోయింది. అమరావతిలో అరకొర వసతుల కారణాన్ని సాకుగా చెబుతూ వచ్చారు ఉద్యోగులు . వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు రాజధానుల పల్లవి అందుకోవడంతో వారికి మరింతగా కలిసి వచ్చింది. అనిశ్చిత పరిస్థితిలో వారిని పట్టించుకునే నాథుడు కరవు అయ్యాడు. విభాగాధిపతులు, కార్యదర్శులు చూసీచూడనట్లు వ్యవహరించసాగారు. అందులోనూ గడచిన ఏడాదిన్నర కాలంగా కరోనా పేరుతో ఎవరూ సరిగా కార్యాలయాలకు రావడం లేదు. హైదరాబాదులో కుటుంబాలు ఉన్నవారు సాకులు చెబుతూ అక్కడే గడుపుతున్నారు. బయోమెట్రిక్ విధానంలో అటెండెన్స్ కూడా నిలిపివేయడంతో వచ్చినా రాకపోయినా అడిగేవారు ఉండటం లేదు. పైపెచ్చు అంతా కలిసి సెలవులను పంచుకునే కొత్త పద్దతిని పెట్టుకున్నారు. దీనివల్ల నామమాత్రంగానే విధులకు వస్తున్నప్పటికీ, అందరూ డ్యూటీలో ఉన్నట్లుగానే చూపించుకుంటున్నారు. పై అధికారులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికే క్రమశిక్షణ రాహిత్యం నెలకొంది.
మీరు నేర్పిన విద్యయే…
ఉద్యోగులకు ముఖ్యమంత్రులు ఆదర్శంగా ఉండాలి. తెలంగాణ ముఖ్యమంత్రి సచివాలయానికి ఏనాడూ రాలేదు. ఇప్పుడైతే కొత్త సచివాలయం నిర్మాణం చేపట్టారు. మరో ఏడాది వరకూ అది సాగుతూనే ఉంటుంది. ఏపీలో కొత్తలో హడావిడి చేసిన ముఖ్యమంత్రి జగన్ కొంతకాలంగా సచివాలయానికి రావడం లేదు. క్యాంపు ఆపీసు నుంచే పనులు చక్కబెడుతున్నారు. ఇవన్నీ ఉద్యోగుల్లో అలసత్వానికి కారణమవుతున్నాయి. ప్రత్యేకించి ఆంద్రప్రదేశ్ లో ఆరేడు నెలలుగా జీతాలు ఆలస్యం అవుతున్నాయి. దాంతో ప్రభుత్వం ఒత్తిడికి గురవుతోంది. దీనిని ఆసరా చేసుకుంటూ ఉద్యోగులు నిర్లక్ష్యంగా ఉంటున్నట్లు ముఖ్యమంత్రికి ఫిర్యాదులు అందాయి. నిజానికి రెండు రాష్ట్రాల్లోనూ వేతనాల భారం భారీగా పెరిగిపోయింది. సగటున ప్రభుత్వానికి వస్తున్న ఆదాయంలో అరవై శాతం ఉద్యోగుల జీతభత్యాలు, పింఛన్లకే ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ఇక మిగిలిన నిధులు సంక్షేమం పద్దులో పడుతున్నాయి. అభివృద్ధి చేయాలంటే అప్పులు తేవాల్సిందే. ఉద్యోగ సంఘాలు, అధికారులు అంతా ఒకే మాట, ఒకే బాటగా ప్రభుత్వం కళ్లు గప్పుతున్నారనే వాదన వినవస్తోంది. ఐఎఎస్ స్థాయి అధికారులు కూడా విధులను నిర్లక్ష్యం చేయడం ఇటీవలి కాలంలో సర్వసాధారణమై పోయిందని విమర్శలు వస్తున్నాయి. ఏదేమైనా ఇప్పటికైనా ముఖ్యమంత్రుల స్తాయిలో శ్రద్ధ పెట్టి శాఖలవారీ తనిఖీలు నిర్వహించడం అవసరం. అంతేకాకుండా సీఎంలు సెక్రటేరియట్ లకు హాజరవుతుంటే ఉద్యోగులు తప్పనిసరిగా వస్తారు. ముందుగా తాము ఆచరించి చూపించడమే సమస్యకు పరిష్కారం.
-ఎడిటోరియల్ డెస్క్