మరో వారం వెయిట్ చేయాల్సిందేనా? అప్పుడు కాని?
కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్ గానే చర్యలు తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా కరోనా లాక్ డౌన్ తర్వాత పరిణామాలపైనే ఇప్పుడు దేశమంతా చర్చ నడుస్తోంది. మొదటిసారి ఎంతో [more]
కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్ గానే చర్యలు తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా కరోనా లాక్ డౌన్ తర్వాత పరిణామాలపైనే ఇప్పుడు దేశమంతా చర్చ నడుస్తోంది. మొదటిసారి ఎంతో [more]
కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్ గానే చర్యలు తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా కరోనా లాక్ డౌన్ తర్వాత పరిణామాలపైనే ఇప్పుడు దేశమంతా చర్చ నడుస్తోంది. మొదటిసారి ఎంతో కష్టపడి 21 రోజులపాటు గండాన్ని గట్టెక్కారు. మళ్లీ 19 రోజులు అతికష్టంగా దైనందిన జీవితం గడుస్తోంది. మరో మూడు వారాలు అంటే ప్రజలు తీవ్ర నిరాశకు గురవుతారనే ఉద్దేశంతో 19 రోజులుగా ప్రభుత్వం నిర్ధారించింది. అయితే ప్రజలు ప్రస్తుతానికి రోజులు నెట్టుకుని వస్తున్నారనే చెప్పాలి. భవిష్యత్తులో దేశ జనాభాలో మూడోవంతు ప్రజలు ఎదుర్కొనే ఇక్కట్లు ఎలా ఉంటాయన్నది చెప్పలేమంటున్నారు నిపుణులు. పెద్దగా ప్రజలకు సాంత్వన కలిగించే చర్యలు ప్రభుత్వం తీసుకుంటున్నట్లు కనిపించడం లేదు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం వంక రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఆశగా ఎదురుచూస్తున్నాయి. హెలికాప్టర్ మనీ, క్వాంటిటేటివ్ ఈజింగ్ వంటి విధానాలతో డబ్బులు పంపిణీ చేస్తే బాగుంటుందని ముఖ్యమంత్రులు పేర్కొంటున్నారు. కానీ అది నెరవేరే సూచనలు నామమాత్రంగా కూడా లేవని ఆర్థికవేత్తలు తేల్చి చెప్పేస్తున్నారు. డబ్బును భారీగా డంప్ చేస్తే సరిపోదని దాంతో దుష్పరిణామాలే ఎక్కువగా చోటు చేసుకుంటాయని నిపుణులు చెబుతున్నారు. మొత్తమ్మీద ఆ అంశాన్ని కేంద్రం పక్కన పెట్టేసినట్లే. అయితే ప్రజలను బయట పడేయగలిగిన సహాయ పథకాలపై దృష్టి పెట్టడం లేదనే విమర్శలు వినవస్తున్నాయి.
అసలెంత నష్టం?
దేశానికి, రాష్ట్రాలకు , ప్రజలకు కరోనా ప్రభావంతో వాటిల్లిన నష్టమెంత? అనే గణాంకాలు తీస్తున్నారు. కేవలం తాత్కాలికంగా వాటిల్లిన ఆర్థిక నష్టం మాత్రమే పరిగణనలోకి తీసుకోలేం. జీవనభృతి, కొంతకాలం పాటు భవిష్యత్ ఉపాధి అవకాశాలు కూడా దెబ్బతింటాయి. కనీసం ఆరేడు నెలల వరకూ వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక, వృత్తి కార్మిక రంగాలు గాడిలో పడవు. అందువల్ల నష్టం అంటే కేవలం ప్రస్తుతం పనిలేని రోజులకే లెక్కించలేం. దేశంలో ఉత్పత్తి, సేవల రంగాలకు లాక్ డౌన్ లోని 40 రోజుల్లో వాటిల్లే నష్టమే ఎనిమిది లక్షల కోట్ల రూపాయల వరకూ ఉంటుందని ఒక అంచనా. మన దేశ స్థూల జాతీయోత్పత్తిని రెండువందల లక్షల కోట్లుగా పరిగణిస్తున్నారు. నలభైరోజులు పనులు, ఉత్పత్తి, వ్యాపారం నిలిచిపోతే పదోవంతు స్థూల ఉత్పత్తిని అయినా కోల్పోతారు. 20 లక్షల కోట్ల రూపాయల వరకూ విలువగా చూడవచ్చని ఆర్థిక నిపుణులే అంగీకరిస్తున్నారు. అయితే దీనిని తర్వాత వాటిల్లే ఉపాధి నష్టంతో పోలిస్తే రెట్టింపుగా ఉంటుందంటున్నారు. గణాంకాల సంగతి పక్కనపెట్టినా జరిగిన డ్యామేజీ కనీవినీ ఎరుగనిది.
ఉపాధి లేక ఉసూరు…
కరోనా తర్వాత దేశంలో దాదాపు 40 కోట్ల మంది రోడ్డున పడతారని అంతర్జాతీయ కార్మిక సంఘం వంటివి ప్రస్తుత పరిస్థితిని తేల్చి చెబుతున్నాయి. మరణాల సంఖ్య, ఆర్థిక వనరుల విషయంలో ఇది తక్కువే కావచ్చు. కానీ మానవ వనరుల పరంగా ఎక్కువగా నష్టపోతోంది భారతదేశమే. కోవిడ్ తో మొదట దెబ్బతిన్న చైనా వంటి దేశాలు క్రమేపీ కోలుకున్నాయి. అమెరికాలో మరణాల సంఖ్య పెరుగుతోంది. కేసుల సంఖ్య ఇబ్బడిముబ్బడి అవుతోంది. అక్కడ సాగుతున్న టెస్టులు లక్షల్లో ఉండటంతోనే ఇది సాధ్యమవుతోంది. క్రమేపీ అవి స్థిరపడతాయి. కానీ భారత్ లో పరిస్థితులు భిన్నం. ఇక్కడ ఇంకా వాస్తవ పరిస్థితి బయటికి రాలేదు. వచ్చేవారం చివరికి ఒక అంచనా దొరికే అవకాశం ఉంది. అప్పటివరకూ వేచి చూడాల్సిందే. వలస జీవులు, ఉపాధి లేని అసంఘటిత కార్మికులకు ప్రభుత్వం ప్రస్తుతం ప్రకటించిన సాయం ఏమూలకూ రాదు. అందుకే ప్రత్యేక ఊతం కోరుకుంటున్నారు. ఆ విషయంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రూపకల్పన చేస్తున్న పథకాలు, బ్యాంకు రుణాలు, నెలవారీ చెల్లింపుల మారటోరియాల వంటివి మెజారిటీ ప్రజలను అడ్రస్ చేసేవి కాదు. అందువల్లనే పెద్దగా సంతృప్తి వ్యక్తం కావడం లేదు.
డబ్బులు సేద తీర్చేనా..?
నగదు చెలామణి పెంచడానికి, ప్రజలకు సొమ్ములు అందుబాటులో ఉంచడానికి చర్యలు తీసుకుంటోంది కేంద్రం. అయితే ప్రజలకు ఆదాయ వనరులు, కొనుగోలు శక్తి లేనప్పుడు బ్యాంకు రుణాల ద్వారా తమ అవసరాలు తీర్చుకోవాలని పెద్దగా భావించరు. ఇప్పుడు ప్రజల దైనందిన జీవిత అవసరాలు నెరవేర్చుకోవడమే తక్షణ కర్తవ్యం. ఇందుకు అవసరమైన సొమ్ములు రిజర్వ్ బ్యాంకులో ముద్రించడం పెద్ద ప్రయోజనం సమకూర్చదు. కేంద్రం వద్ద ఆహారధాన్యాలు, ఇతర రూపాల్లో నిల్వలను ప్రజలకు పూర్తి స్థాయిలో పంపిణీ చేయాలి. తద్వారా ప్రజల్లో నిధుల మిగులును ప్రోత్సహించాలనే భావనను కొందరు సామాజిక వేత్తలు వ్యక్తం చేస్తున్నారు. దేశంలో దాదాపు ఏడు కోట్ల టన్నుల ఆహారధాన్యాల నిల్వలున్నాయి. వాటి విలువ ఇంచుమించు రెండు లక్షల కోట్ల వరకూ ఉంటుంది. అందులో అయిదు కోట్ల టన్నుల నిల్వలను ప్రజలకు వివిధ రూపాల్లో పంపిణీ చేయగలిగితే పేదలకు సంబంధించి దైనందిన అవసరాలకు రానున్న నాలుగు నెలలకు భరోసా లభిస్తుంది. ప్రభుత్వం తన నిధులతో ఆహార ధాన్యాలను, వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసి ఖాళీ అయిన గోదాములను నింపగలిగితే ఆహారభద్రతకూ ఢోకా ఉండదు. ఈ మార్గాలను సైతం అన్వేషించాలని సామాజిక అధ్యయనవేత్తలు పేర్కొంటున్నారు.
-ఎడిటోరియల్ డెస్క్