దావూద్ దర్జాగా ఉన్నాడు.. మరి బుకాయింపులెందుకో?
భారత్ లో ఉగ్రవాద ఘటనలకు పాల్పడే సంస్థలకు ఊతమివ్వడం, వాటి అధినేతలు, కార్యకర్తలకు ఆశ్రయమివ్వడం పాకిస్థాన్ ప్రభుత్వం అప్రకటిత విధానం. పాక్ లో ఏ ప్రభుత్వం అధికారంలో [more]
భారత్ లో ఉగ్రవాద ఘటనలకు పాల్పడే సంస్థలకు ఊతమివ్వడం, వాటి అధినేతలు, కార్యకర్తలకు ఆశ్రయమివ్వడం పాకిస్థాన్ ప్రభుత్వం అప్రకటిత విధానం. పాక్ లో ఏ ప్రభుత్వం అధికారంలో [more]
భారత్ లో ఉగ్రవాద ఘటనలకు పాల్పడే సంస్థలకు ఊతమివ్వడం, వాటి అధినేతలు, కార్యకర్తలకు ఆశ్రయమివ్వడం పాకిస్థాన్ ప్రభుత్వం అప్రకటిత విధానం. పాక్ లో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఈ విధానం మారదు. ఉగ్రవాదులకు అన్ని వేళలా అండదండగా ఉండటం, వారిని కంటికిరెప్పలా కాపాడకోవడం తమ బాధ్యతగా భావిస్తాయి అక్కడి ప్రభుత్వాలు. సైన్యం, నిఘా సంస్థ ఐఎస్ఐ (ఇంటర్ సర్వీస్ ఇంటలిజెన్స్) వారికి కావలసిన సకల సౌకర్యాలు కల్పిస్తాయి. పైకి మాత్రం తమ దేశంలో అసలు ఉగ్రవాదులే లేరని, తమది స్వయంగా ఉగ్రవాద బాధిత దేశమని అధినేతలు చెబుతుంటారు. నేతి బీరకాయలో నిజమెంతో వారి మాటల్లోని నిజమూ కూడా అంతేనన్నది చేదు నిజం. అంతర్జాతీయ సమాజానికి కూడా ఈ విషయం ఎరుకే. అయితే ఒక్కోసారి అబద్ధమాడబోయి నిజం చెప్పి నాలిక కరుచకుంటుంది దాయాది దేశం. ఇప్పుడు జరిగింది ఇదే. ఉగ్రవాది, చీకటి సామ్రాజ్యపు అధినేత, మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం తమ దేశంలో ఉన్నాడని చెప్పి నాలిక కరచుకుంది. అంతలోనే అది అవాస్తవమని పేర్కొని మాట మార్చింది.
నేరగాడిని ఇంట్లోనే పెట్టుకుని…..
దావూద్ ఇబ్రహీం… ఈ పేరు అంతర్జాతీయ సమాజానికి అత్యంత సుపరిచితం. ఉగ్రవాద కార్యకలాపాలకు దావూద్ ఇబ్రహీం కేంద్ర బిందువు. ముంబయి అల్లర్ల ప్రధాన సూత్రధారి. భారత్ లోని వివిధ ప్రాంతాల్లో జరిగిన ఉగ్రవాద ఘటనల వెనక దావూద్ ఇబ్రహీం పాత్రను, ప్రమేయాన్ని తోసిపుచ్చడం కష్టమే. దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్ లోనే ఉన్నారని పేర్కొంటూ, ఆయనను తమకు అప్పగించాలని భారత్ ఎప్పటి నుంచో కోరుతోంది. అనేకమార్లు ఈ మేరకు దౌత్యపరంగా కోరింది. పాక్ ఎప్పటికప్పుడు ప్రతిసారీ ఈ వాదనను తిప్పికొట్టేది. దావూద్ ఇబ్రహీం తమ దేశంలో లేడని, భారత్ సమర్పించిన ఆధారాలు తప్పుడువని ప్రచారం చేసేది. దావూద్ ఇబ్రహీం తో పాటు జమాత్ ఉద్ దవా నాయకుడు హఫీజ్ సయీద్, జైషే ఏ మహమ్మద్ అధినేత అజహర్ మసూద్ కూడా పాక్ లోనే తలదాచుకున్నరని భారత్ లిఖితపూర్వక ఆధారాలతో సమర్పించినా ఇలాంటి ప్రతి స్పందనా వచ్చేది.
ఎఫ్ఏటీఎఫ్ ఆదేశాలతో…..
తాజాగా ఎఫ్ఏటీఎఫ్ (ఫైనాన్షియల్ యాక్షన్ టేకెన్ ఫోర్స్ ) ఆదేశాల మేరకు తమ దేశంలోని ఉగ్రవాద సంస్థల జాబితా, వాటి అధినేతలు, వారిపై తీసుకుంటున్న చర్యలను వివరించింది. ఇందులో భాగంగా అజహర్ మసూద్, హఫీజ్ సయీద్ పేర్లతోపాటు దావూద్ ఇబ్రహీం పేరునూ ప్రకటించి ఇరుక్కు పోయింది. అతను సింధ్ ప్రావిన్స్ రాజధాని కరాచీలోని సౌదీ మసీదు సమీపంలో నివాసం ఉంటున్నట్లు వెల్లడించింది. విలాసవంతమైన బంగళాలో ఈ మఫియా సామ్రాజ్యా అధిపతి అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం నివసిస్తున్నారు. పొరపాటున వాస్తవాన్ని వెల్లడించిన పాక్ వెనువెంటనే మాట మార్చింది. మన ముంబయి మాదిరిగా కరాచీ నగరం పాక్ ఆర్థిక రాజధాని, దేశంలోని అతి పెద్ద నగరం. పాక్ స్టాక్ ఎక్స్ఛేంజి ఇక్కడే ఉంది. అరేబియా
సమద్ర తీరంలో విస్తరించి ఉంటుంది. ఎఫ్ఏటీఎఫ్ ఆదేశాల మేరకు 88 మంది ఉగ్రవాదులు, సంస్థల పేర్లను ప్రకటించామని, అంతే తప్ప దావూద్ ఇబ్రహీం తమ దేశంలో ఉన్నట్లు ఎక్కడా చెప్పలేదని పాక్ బుకాయించింది. అంతర్జాతీయ నిబంధనల మేరకు విదేశాంగ శాఖ నిర్ణీత వ్యవధిలో ిలాంటి ఉత్తర్వులు ఇస్తుందని వివరణ ఇచ్చింది.
బ్లాక్ లిస్ట్ లో చేరుస్తామని హెచ్చరించడంతో….
ఎఫ్ఏటీఎఫ్… పారిస్ కేంద్రంగా పనిచేసే అంతర్జాతీయ సంస్థ. ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చే, వారికి సహకరించే దేశాలపై ఇది ఎప్పడూ ఒక కన్నేసి ఉంటుంది. 2018 జూన్ లో పాక్ ను గ్రే లిస్టులో ఉంచుతూ ఉత్తర్వులు జారీచేసింది. 2019లో గా పద్ధతి మార్చుకోకపోతే బ్లాక్ లిస్టులో చేర్చుతామని అప్పట్లో పాకిస్థాన్ ను హెచ్చరించింది. 2019 డిసెంబరుతో గడువు ముగిసినప్పటికీ కరోనా కారణంగా మరో ఆరు నెలలు గడువు పొడిగించింది. ఆ గడువు ముగియడంతో పాక్ అనివార్యంగా వివరాలు ప్రకటించాల్సి వచ్చింది. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తే ప్రపంచబ్యాంకు సహా అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి రుణ సహాయాన్ని నిలిపివేస్తామని ఎఫ్ఏటీఎఫ్ హెచ్చరించడంతో దిగివచ్చిన ఇస్లామాబాద్ ఈ వివరాలను ప్రకటించింది. దావూద్ ఇబ్రహీం నేరచరిత్ర చూస్తే కళ్లు తిరగక మానవు. 1993 ముంబయి పేలుళ్ల ప్రధాన సూత్రధారి ఇతనే. నాటి మారణకాండలో దాదాపు 257 మంది అమాయక పౌరులు హతులయ్యారు. సుమారు 700 మంది క్షతగాత్రులయ్యారు. 2003లో దావూద్ ఇబ్రహీం ను ఐక్యరాజ్య సమితి అంతర్జతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. అప్పటి నుంచి అతను పాకిస్థాన్ లోనే తలదాచకుంటున్నాడు. అతని నివాస వివరాలను సమర్పించినప్పటికీ తమ దేశంలో లేడని బుకాయిస్తూ వచ్చింది. ఇప్పుడు అలవాటులో పొరపాటుగా అసలు విషయాన్ని చెప్పి ఇరుక్కపోయింది. ఇప్పటికైనా దావూద్ ఇబ్రహీం ను అప్పగిస్తుందా అన్నది ప్రశ్నే. అంతర్జాతీయ సమావేశం, అంతర్జాతీయ సంస్థలు ఈ మేరకు ఇస్లామాబాద్ పై ఒత్తిడి తీసుకురావాలసిన అవసరం ఉంది.
-ఎడిటోరియల్ డెస్క్