కాంగ్రెస్… క్షమించే తప్పు చేసిందా… ?
క్షమించడం అన్నది భారతీయ ధర్మంలో ఉంది. ఆ విషయంలో మన వారు చాలా ఉదారంగా ఉంటారు. ఎంత పెద్ద తప్పులు చేసినా కూడా జనాలు వారిని ఆదరించి [more]
క్షమించడం అన్నది భారతీయ ధర్మంలో ఉంది. ఆ విషయంలో మన వారు చాలా ఉదారంగా ఉంటారు. ఎంత పెద్ద తప్పులు చేసినా కూడా జనాలు వారిని ఆదరించి [more]
క్షమించడం అన్నది భారతీయ ధర్మంలో ఉంది. ఆ విషయంలో మన వారు చాలా ఉదారంగా ఉంటారు. ఎంత పెద్ద తప్పులు చేసినా కూడా జనాలు వారిని ఆదరించి మళ్లీ అందలం ఎక్కించడం పరిపాటి. లేకపోతే ఈ దేశంలో సుదీర్ఘ కాలం పాటు చాలా పార్టీలు ఏలడం సాధ్యం కాదు. దీనికి రాజకీయ నాయకులు తేలికగా తీసుకుంటారు. జనాలకు జ్ఞాపకశక్తి తక్కువ అని కూడా భావిస్తారు. కానీ అన్నీ తెలిసే కేవలం క్షమాగుణంతోనే ఓటర్లు అనబడే ప్రజలు నేతాశ్రీలను గద్దెనెక్కిస్తారు. అయితే కొన్ని విషయాలు క్షమించలేనివి కూడా ఉంటాయి. వాటి విషయంలో మాత్రం ప్రజలు కచ్చితమైన అభిప్రాయంతోనే ఉంటారు.
అక్కడ అందుకే అలా …
దేశంలోని కొన్ని కీలక రాష్ట్రాలలో కాంగ్రెస్ దశాబ్దాల కాలంగా అధికారంలోకి రావడంలేదు. అక్కడ ఆ పార్టీ చేసిన తప్పులు అలాంటివి మరి. పైగా కాంగ్రెస్ ని మైమరపించే పార్టీలు కూడా అందుబాటులో ఉండడం మరో కారణం. మొత్తానికి తమిళనాడు, పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్ వంటి చోట్ల కాంగ్రెస్ ఎప్పటికీ అధికారంలోకి రాదు అని చెప్పేస్తూ ఉంటారు. ఇపుడు ఆ ప్రారబ్దం ఏపీలో కూడా కాంగ్రెస్ పట్టించుకుంది. తెలంగాణను ఇచ్చి అక్కడ బొక్క బోర్లా కొట్టినా రేపు అనే ఆశ ఎంతో కొంత ఉంది. కానీ ఏపీలో మాత్రం జనాలకు కాంగ్రెస్ అంటేనే చచ్చేంత కోపం అన్నంతగా సీన్ ఉంది. అటు వంటి ఏపీలో మళ్ళీ పాదం మోపుతానని కాంగ్రెస్ అంటోంది. దానికి తనదైన పాత వ్యూహాలను నమ్ముకుంటోంది.
దండంతో సరా …?
దాసుని తప్పులు దండంతో సరి అని సామెత ఉంది. కానీ కాంగ్రెస్ ఏపీలో చేసిన తప్పులు దండం పెడితే పోయేవా అన్నదే ఇక్కడ డౌట్. కాంగ్రెస్ ఏపీని నాడు అవమానించింది. చేతిలో అధికారం ఉంది కదా అని అహంకారంతో వ్యవహరించింది. మేము చెప్పినట్లే జరుగుతుంది అంటూ శాసించింది. కనీసం ప్రజల మనోభావాలను గుర్తించినట్లుగా వారి గోడు విన్నట్లుగా అయినా నటించలేదు. అదే ఇపుడు ఆ పార్టీ కొంప ముంచుతోంది. కానీ కాంగ్రెస్ వ్యూహకర్తలు మాత్రం తప్పులు చేశాం, మళ్ళీ అలాంటి పొరపాట్లు చేయం, మన్నించండి అంటూ జనాలలోకి రావాలని నేతలకు సూచిస్తున్నారుట. మరి అదే జరిగితే ప్రజలు కాంగ్రెస్ ని నెత్తిన పెట్టుకుంటారా. ఓట్లు గుద్దేసి రాజ్యం అప్పగిస్తారా..?
ఆ జాబితాలోకే ..?
దేశమంతా ఓడించినా కూడా ఉమ్మడి ఏపీ నాడు ఇందిరాగాంధీని గెలిపించింది. అంతే కాదు ఎన్నో సార్లు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కారణం అయింది కూడా ఏపీనే. అలాంటి ఏపీ విషయంలో కాంగ్రెస్ ఏ మాత్రం పట్టనట్లుగా వ్యవహరించింది. దానికి తగిన మూల్యం చెల్లించింది. అయితే రెండు ఎన్నికలలో తమను ఓడించారు, ఇక ఈ కక్ష, శిక్ష చాలు అని కాంగ్రెస్ పెద్దలు అంటున్నారు. కానీ జనాలు మాత్రం అలా అనుకోవడంలేదు. జీవిత కాలం శిక్షనే వేశామని అంటున్నారు. దేశంలో చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ గత యాభై ఏళ్ళుగా అధికారంలోలేదు. ఆ జాబితాలో ఏపీ కూడా ఏనాడో చేరిపోయింది అన్నదే ఇక్కడ కరెక్ట్ విశ్లేషణ. ఈ సంగతి ఏపీ కాంగ్రెస్ నాయకులకు తెలుసు కాబట్టే రాహుల్ గాంధీ వంటి వారు జనాల వద్దకు వెళ్ళి లెంపలేసుకుని తప్పులు ఒప్పుకోమని చెప్పినా జంకుతున్నారుట. మొత్తానికి కాంగ్రెస్ ది ఏపీలో గత వైభవమే అన్నది లోకల్ లీడర్స్ కి తెలుసు. ఢిల్లీ పెద్దలకు అర్ధం కావాలీ అంటే మరిన్ని ఎన్నికలు జరగాల్సిందే.