మారిస్తే.. మరమ్మత్తులు చేస్తే…. బాగుపడుతుందా?
మహారాష్ర్టలో పార్టీకి పూర్వ వైభవం సాధించేందుకు హస్తం పార్టీ అధిష్టానం చర్యలు చేపట్టింది. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు, మున్ముందు జరగనున్న వివిధ ఎన్నికల్లో పార్టీని విజయపథాన [more]
మహారాష్ర్టలో పార్టీకి పూర్వ వైభవం సాధించేందుకు హస్తం పార్టీ అధిష్టానం చర్యలు చేపట్టింది. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు, మున్ముందు జరగనున్న వివిధ ఎన్నికల్లో పార్టీని విజయపథాన [more]
మహారాష్ర్టలో పార్టీకి పూర్వ వైభవం సాధించేందుకు హస్తం పార్టీ అధిష్టానం చర్యలు చేపట్టింది. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు, మున్ముందు జరగనున్న వివిధ ఎన్నికల్లో పార్టీని విజయపథాన నడిపించేందుకు పార్టీ కేంద్ర నాయకత్వం ముందడుగు వేసింది. ఇందులో భాగంగా ప్రస్తుత పీసీసీ చీఫ్ బాలాసాహెబ్ థోరట్ స్థానంలో నూతన సారథిగా నానా పటోల్ ను నియమించింది. ప్రస్తుత మహారాష్ర్ట సంకీర్ణ సర్కారులో శాసనసభ స్పీకరుగా ఆయన కీలకస్థానంలో ఉన్నారు. ఇందుకోసం ఆయన సభాపతి పదవికి రాజీనామా చేసి కొత్త బాధ్యతలు చేపట్టారు. అంతర్గత కలహాలను సర్దుబాటు చేసి, పార్టీని సమన్వయంతో ఒక్కతాటిపై నడిపే కీలక బాధ్యతను తన భుజాలపై వేసుకున్నారు.
పదిహేనేళ్ల పాటు అధికారంలో ఉన్నా…..
ఒకప్పుడు ఈ పశ్చిమ రాష్ర్టంలో తిరుగులేని శక్తిగా ఉన్న హస్తం పార్టీ ప్రస్తుత పరిస్థితి దయనీయంగా ఉంది. 1999 నుంచి 2014 వరకు వరుసగా పార్టీ అధికారంలో కొనసాగింది. ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించిన హస్తం పార్టీ శరద్ పవార్ నాయకత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్ సీ పీ)మద్దతుతో పదిహేనేళ్లపాటు చక్రం తిప్పింది. విలాస్‌రావు దేశ్ ముఖ్, సుశీల్ కుమార్ షిండే, అశోక్ చవాన్, ప్రధ్వీరాజ్ చవాన్ వంటి కాంగ్రెస్ దిగ్గజాలు ముఖ్యమంత్రులుగా పనిచేశారు. 2014లో మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ దేశవ్యాప్తంగా విజయకేతనం ఎగురవేసింది. ఆ ప్రభావం మహారాష్ర్టపైనా పడింది. ఆ ఏడాది చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా-శివసేన కూటమి విజయ దుందుభి మోగించింది. 2019 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ కూటమి విజయ కేతనం ఎగురవేసింది. తరవాత భాజపా-శివసేన మధ్య విభేదాలతో శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్, కాంగ్రెస్ భాగస్వామ్యంతో సంకీర్ణ
సర్కారు ఆవిర్భవించింది.
అన్ని ఎన్నికల్లో ఇబ్బందులే……..
సంకీర్ణ సర్కారులో తనకు తగిన భాగస్వామ్యం లభించలేదన్న భావన కాంగ్రెస్ శ్రేణుల్లో ఉంది. సీఎం పదవి శివసేనకు, డిప్యూటీ సీఎం పదవులు నేషనలిస్ట్ కాంగ్రెస్ కు దక్కాయి. స్పీకర్ పదవితో కాంగ్రెస్ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పార్టీకి చెందిన మాజీ సీఎం అశోక్ చవాన్ వంటి వారు సైతం మంత్రి పదవికే పరిమితమయ్యారు. 2019 లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పరిస్థితి దయనీయంగా మారింది. ఒకప్పుడు రాష్ర్ట రాజకీయాలను శాసించిన పార్టీ నాలుగో స్థానానికి పరిమితమైంది. మొత్తం 48 పార్లమెంటు సీట్లకు ఒకే ఒక స్థానంలో నెగ్గింది. పార్టీ నుంచి విడిపోయిన పవార్ సారథ్యంలోని పార్టీ నాలుగు సీట్లు గెలుచుకోవడం గమనించదగ్గ విషయం. అసెంబ్లీ ఎన్నికల్లోనూ నాలుగో స్థానానికి పరిమితమైంది. భాజపా 105, శివసేన 56. ఎన్ సీ పీ 54 గెలుచుకోగాహస్తం పార్టీ అవమానకరరీతిలో 44 సీట్లతో సరిపెట్టుకుంది.
అనుభవమున్న నేతకు….
ఈ నేపథ్యంలో విదర్భ ప్రాంతానికి చెందిన నానా పటోలే కు పార్టీ బాధ్యతలు అప్పగించింది. ముంబయికి దూరంగా విసిరేసినట్లు విదర్భ ప్రాంతం దూరం గా ఉంటుంది. ఈ ప్రాంతంలో ప్రత్యేక రాష్ర్ట డిమాండ్ ఉంది. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, భాజపా మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ ఈ ప్రాంతం వారే. ఆర్ ఎస్ ఎస్ కేంద్ర కార్యాలయం విదర్భ కేంద్రమైన నాగ్ పూర్ లో ఉంది. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతానికి చెందిన పటోలే వైపు హస్తం పార్టీ మొగ్గు చూపింది. పటోలే 1999 నుంచి 2014 వరకు మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. 2014లో భాజపాలో చేరి తరఫున భండారా-గోండియా స్థానం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 2017లో ఎంపీ పదవికి, భాజపాకు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. 2019లో సకోలీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పీజీ చేసిన పటోలే ప్రముఖ ఓబీసీ నాయకుడు. ఆ వర్గాల్లో ఆయనకు మంచి పట్టుంది. పటోలే కు పార్టీ వ్యవహారాల్లో సాయపడేందుకు ఏడుగురు కార్యనిర్వాహక అధ్యక్షులను, 10 మంది ఉపాధ్యక్షులను, 37మందితో పార్లమెంటరీ బోర్డును పార్టీ నియమించింది. పార్టీని మొదటిస్థానంలో నిలిపేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తానని పటోలే చెబుతున్నారు. తన ప్రయత్నంలో నాయకులు అందరూ కలసి రావాలని కోరుతున్నారు. ఈ ప్రయత్నంలో పటోలే ఎంతవరకు విజయవంతం అవుతారో వేచి చూడాలి.
– ఎడిటోరియల్ డెస్క్