పోరుకు… పొత్తుకు మధ్యలో…?
ప్రతిపక్షాలు పోరాటానికి కదులుతున్నాయి. మొన్నటివరకూ పార్లమెంటులో చాటుకున్న ఐక్యతను రాజకీయ సంఘటితత్వానికి పెట్టుబడిగా వాడుకునేందుకు సన్నద్ధం అవుతున్నాయి. అన్నిపార్టీలకు కావాల్సింది ఒకటే. మోడీ నాయకత్వంలోని బీజేపీని ఓడించాలి. [more]
ప్రతిపక్షాలు పోరాటానికి కదులుతున్నాయి. మొన్నటివరకూ పార్లమెంటులో చాటుకున్న ఐక్యతను రాజకీయ సంఘటితత్వానికి పెట్టుబడిగా వాడుకునేందుకు సన్నద్ధం అవుతున్నాయి. అన్నిపార్టీలకు కావాల్సింది ఒకటే. మోడీ నాయకత్వంలోని బీజేపీని ఓడించాలి. [more]
ప్రతిపక్షాలు పోరాటానికి కదులుతున్నాయి. మొన్నటివరకూ పార్లమెంటులో చాటుకున్న ఐక్యతను రాజకీయ సంఘటితత్వానికి పెట్టుబడిగా వాడుకునేందుకు సన్నద్ధం అవుతున్నాయి. అన్నిపార్టీలకు కావాల్సింది ఒకటే. మోడీ నాయకత్వంలోని బీజేపీని ఓడించాలి. అదొక తప్పనిసరి అవసరంగా మారిపోయింది. అందుకు అనుసరించాల్సిన వ్యూహంపై ఏకాభిప్రాయం మాత్రం లేదు. అందుకే ప్రస్తుతానికి రాజకీయ పొత్తులపై ముందుకు వెళ్లేందుకు ఇంకా తయారు కాలేదు. ఉద్యమానికి సూత్రప్రాయ ఏకాభిప్రాయం నెలకొంది. దేశంలోని 19 ప్రధాన పార్టీలు ఆందోళనల పర్వమైన అజెండాను ఖరారు చేసుకున్నాయి. పెద్దపార్టీలుగా ముద్రపడిన మరో అరడజను పార్టీలు అటు బీజేపీకి, ఇటు కాంగ్రెసు సారథ్యంలోని ఆందోళనల కూటమికి సమదూరంగా ఉండిపోయాయి. సోనియా నాయకత్వంలోని విపక్షాల ఆన్ లైన్ వర్చువల్ సమావేశం సాధించిన విజయం ఇదే. అయితే ఇంకా ఎన్నికల సమయానికి వేయాల్సిన అడుగులు చాలానే మిగిలి ఉన్నాయి. అందుకే ముందుగా పోరాటం మొదలు పెట్టాలి. ఆ తర్వాతనే ఐక్య ఎన్నికల సంఘటనకు ప్రయత్నించాలనే భావన వ్యక్తమవుతోంది. పోరాటానికి- పొత్తుకు మధ్య ఇంకా అంతరం కొనసాగుతూనే ఉంది.
ఆందోళనకే ఆమె మొగ్గు..
కూటమి కట్టాలనుకుంటున్న పార్టీల్లో కాంగ్రెసు తర్వాత పెద్ద పార్టీ తృణమూల్ కాంగ్రెసు. ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ ఇంకా స్పష్టమైన వైఖరి తీసుకోలేకపోతున్నారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో కాంగ్రెసు, వామపక్షాల కూటమి పట్ల రాజకీయంగా ఆమె నిర్ణయం అనిశ్చితంగా ఉంది. బీజేపీని జాతీయ స్థాయిలో ఎదిరించాలనే దృఢసంకల్పం కనిపిస్తోంది. కానీ సొంత రాష్ట్రంలో వామపక్షాలు, కాంగ్రెసును చేరదీసేందుకు సిద్ధపడటం లేదు. బీజేపీ పశ్చిమబెంగాల్ లో బలం పుంజుకుంటుందేమోననే భయం ఆమెను వెన్నాడుతోంది. బీజేపీని వ్యతిరేకించే ఓట్లన్నీ సంఘటితం కావడం తోనే మమతకు ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో అంతటి మెజార్జీ దక్కింది. ఆ ఓట్లను ఇతర పార్టీలతో కలిసి పంచుకోవడం ఆమెకు ఇష్టం లేదు. పశ్చిమబెంగాల్ సహా దేశవ్యాప్తంగా బీజేపీ పరువు తీసే ఉద్యమాలు చేయాలని కోరుకుంటోందామె. ఇందుకు రాజకీయ సంఘటన కావాలని ప్రయత్నిస్తోంది. పొత్తుల విషయం అప్పుడే వద్దంటూ మెలిక పెడుతోంది.
పాయింట్ పట్టుకున్న పవార్…
ఫెగాసిస్ రహస్య నిఘా, వ్యవసాయ చట్టాలు, ధరల పెరుగుదల పోరాటానికి ప్రధానాంశాలుగా ప్రతిపక్సాలు భావిస్తున్నాయి. వీటిపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ విభేదిస్తున్నారు. సోనియా, మమత వంటి వారి అజెండాలో పెగాసిస్, వ్యవసాయ చట్టాలు మొదటి ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. ఫెగాసిస్ ఆందోళన ప్రజలలో కదలిక తెచ్చే అవకాశం లేదనేది పవార్ అభిప్రాయం. అదే విధంగా వ్యవసాయ చట్టాలపై దేశవ్యాప్తంగా ఒకే రకమైన అభిప్రాయం లేదు. కొన్ని రాష్ట్రాల్లో రైతుసంఘాలు, కొన్ని రాజకీయ పార్టీలు ఆ చట్టాలను స్వాగతిస్తున్నాయి. ఇది ప్రతిపక్షాలకు చేదు అనుభవం మిగల్చవచ్చు. కామన్ అజెండాగా ధరల పెరుగుదలను తీసుకోవాలనేది పవార్ అభిప్రాయం. అందువల్ల ప్రతి ఒక్కరిలోనూ కదలిక వస్తుందంటున్నారు.
వామపక్షాలు..రిక్త హస్తాలు…
కేరళలో మాత్రం ఆధిపత్యం చెలాయిస్తూ దేశవ్యాప్తంగా నామ్ కే వాస్తే జాతీయ పార్టీలుగా మిగిలిన వామపక్షాలు ఆటలో అరటిపండుగా మారిపోయాయి. ఏ కూటమి వాటిని పెద్దగా పట్టించుకోవడం లేదు. అయితే కార్మికసంఘాలలో ప్రాధాన్యం, గత వైభవం కారణంగా వామపక్సాలకు మొహమాటపు ఆహ్వానాలు అందుతున్నాయి. బీజేపీపై గుడ్డి వ్యతిరేకత మినహా కమ్యూనిస్టు పార్టీలకు స్పష్టమైన అజెండా లేదు. మమతా బెనర్జీ ఇప్పటికే పశ్చిమబెంగాల్ లో చావు దెబ్బతీశారు. కేరళ మినహా మిగిలిన ఏ రాష్ట్రంలోనూ సొంతంగా సీట్లు గెలిచే సామర్థ్యం లేదు. ఈ పరిస్థితుల్లో కమ్యూనిస్టు అజెండాను కాంగ్రెసు అందిపుచ్చుకోవాలని ఆ పార్టీల నాయకులు సూచిస్తున్నారు. అధికారపు పోటీ తప్ప పాలన విధానాలలో కాంగ్రెసుకు, బీజేపీకి పెద్దగా తేడా లేదు. అయినా కమ్యూనిస్టు నేతలు దింపుడు కళ్లెం ఆశతో కాంగ్రెసును పట్టుకుని వేలాడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కమలం పార్టీ ఓడిపోతుందనే కలతోనే కాంగ్రెసుకు వత్తాసునిస్తున్నారు. విధానపరమైన పోరాట అజెండా లేదు.
ఆ ముగ్గురి ముచ్చట…
జాతీయంగా కీలక ప్రాధాన్యమున్న ముగ్గురు నాయకులు ప్రతిపక్ష కూటమికి దూరంగా ఉండటం చర్చనీయమవుతోంది. దేశవ్యాప్తంగా దళిత సామాజిక వర్గాలలో మాయావతికి ఆదరణ ఉంది. పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో కీలకపార్టీగా బహుజనసమాజ్ కొనసాగుతోంది. ఇక అదే రాష్ట్రం నుంచి సమాజ్ వాదీ పార్టీ వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ప్రధానప్రత్యర్థిగా తలపడబోతోంది. ఈ రెండు పార్టీలు విపక్ష కూటమి ని పట్టించుకోవడం లేదు. ఆమ్ ఆద్మీ పార్టీ కొత్త తరహా రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది. కాంగ్రెసు, బీజేపీ సారధ్యంలోని పార్టీలన్నీ ఒకటే అన్నది అరవింద్ కేజ్రీవాల్ నమ్మకం. ఆయన కూడా ప్రతిపక్ష రాజకీయాలను విశ్వసించడం లేదు. తమ వ్యక్తిగత, సొంత రాష్ట్రాల కారణాలతో వైసీపీ, టీఆర్ఎస్, బీజేడీ వంటి పార్టీలు కూటములను దూరం పెడుతున్నాయి. వీటిని కలుపుకునిపోకుండా ప్రతిపక్షాల పోరాటానికి సాధికారత సాధ్యం కాదు. అవి తటస్థ పాత్ర పోషిస్తే కచ్చితమైన ఫలితం రాకపోవచ్చని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
-ఎడిటోరియల్ డెస్క్