అసహనమే అలాంటి పనులు చేయిస్తుందా?
చైనా ఇప్పుడు ఆషామాషీ దేశం కాదు. అది ఓ అంతర్జాతీయ శక్తి. అమెరికాకు వ్యతిరేకంగా ఒకప్పుడు నాటి సోవియట్ యూనియన్ (ప్రస్తుతరష్యా) పోషించిన పాత్రలోకి ప్రవేశించేందుకు తహతహలాడుతోంది. [more]
చైనా ఇప్పుడు ఆషామాషీ దేశం కాదు. అది ఓ అంతర్జాతీయ శక్తి. అమెరికాకు వ్యతిరేకంగా ఒకప్పుడు నాటి సోవియట్ యూనియన్ (ప్రస్తుతరష్యా) పోషించిన పాత్రలోకి ప్రవేశించేందుకు తహతహలాడుతోంది. [more]
చైనా ఇప్పుడు ఆషామాషీ దేశం కాదు. అది ఓ అంతర్జాతీయ శక్తి. అమెరికాకు వ్యతిరేకంగా ఒకప్పుడు నాటి సోవియట్ యూనియన్ (ప్రస్తుతరష్యా) పోషించిన పాత్రలోకి ప్రవేశించేందుకు తహతహలాడుతోంది. కానీ ఆ మేరకు హుందాతనాన్ని, సంయమనాన్ని ప్రదర్శించడం లేదు. దుందుడుకుగా వ్యవహరిస్తోంది. ఇరుగు పొరుగు దేశాలతో పేచీలకు దిగడం దానికి అలవాటుగా మారింది. దాదాపు 15 దేశాలతో సరిహద్దులు పంచుకుంటున్న డ్రాగన్ ప్రతి దేశంతోనూ వివాదానికి దిగుతోంది. ఇక భారత్ కు సంబంధించి నిత్యం కయ్యమే. సరిహద్దుల్లో చొరబాట్లకు దిగడం, ఉద్రిక్తతలకు పాల్పడటం దానికి నిత్యక్రుత్యంగా మారింది. ఆ దేశ విధాన నిర్ణేతలు వివాదాస్పద ప్రకటనలు చేయడం సాధారణమైంది.
లద్దాఖ్ తమదేనంటూ…..
ఈశాన్య భారతంలోని యావత్ అరుణాచల్ ప్రదేశ్ తమదేనంటూ ప్రకటనలు చేయడం అందరికీ తెలిసిన విషయమే. తాజాగా లద్దాఖ్ కూడా తమదేనని ప్రకటించి దుందుడుకుతన్నాన్ని ప్రదర్శించింది. లద్దాఖ్ కేంద్ర పాలిత ప్రాంతాన్ని గుర్తించడం లేదని ప్రకటించడం ద్వారా సరికొత్త సమస్యలను తెరపైకి తీసుకు వచ్చింది. తమ దేశ అధికార పత్రిక ‘గ్లోబల్ టైమ్స్’ కు ఇచ్చిన ఇంటర్వ్యూలోవిదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్ బిన్ మాట్లాడుతూ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత ప్రభుత్వం గత ఏడాది జమ్ము కశ్మీర్ ను విభజించి లద్దాఖ్, కశ్మీర్ లను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించింది. కశ్మీర్ కు అసెంబ్లీ, ముఖ్యమంత్రి, లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు.
మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో…..
లద్దాఖ్ కు అసెంబ్లీ ఉండదు. కేంద్రం తరఫున లెఫ్టినెంట్ గవర్నర్ పాలన వ్యవహారాలను పర్యవేక్షిస్తారు. దేశ తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినాన్ని పురస్కరించుకుని గత ఏడాది అక్టోబరు 31 నుంచి కొత్త కేంద్రపాలిత ప్రాంతంగా తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. అప్పటి నుంచి డ్రాగన్ అగ్గిమీద గుగ్గిలం అవుతుంది. తాజాగా ఈ నెలలో జరగనున్న లద్దాఖ్ అటామనస్ హిల్ ఏరియా డెవలప్ మెంట్ కౌన్సిల్ ఎన్నికల సందర్భంగా మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తన అక్కసును వెళ్లగక్కింది. ఉభయ దేశాల సరిహద్దుల్లో లద్దాఖ్ ప్రాంతంలో మౌలిక సౌకర్యాల విస్తరణకు భారత ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. తమది కాని ప్రాంతంలో భారత్ ఎలా కార్యకలాపాలు చేపడుతుందని ఎదురు ప్రశ్నించి తన అసహానాన్ని ప్రదర్శించింది.
అరుణాచల్ ప్రదేశ్ తమదేనంటూ…..
తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో గత అయిదు నెలలుగా ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో బీజింగ్ వ్యాఖ్యలు పుండు మీద కారం రాసిన చందాన విధంగా ఉన్నాయి. ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం బీజింగ్ కు కొత్తేమీ కాదు. ఈశాన్య భారతంలో చైనా సరిహద్దుల్లో విస్తరించిన అరుణాచల్ ప్రదేశ్ తనదేనని పలుమార్లు ప్రకటించి కుటిలత్వాన్ని చాటుకుంది. అరుణాచల్ ప్రదేశ్ ను దక్షిణ టిబెట్ గా ప్రకటించే బీజింగ్ ఆ రాష్ట్రంలో భారత రాష్ర్టపతి, ప్రధానమంత్రి పర్యటనలపై అభ్యంతరాలు వ్యక్తం చేయడం తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలో హోంమంత్రి అమిత్ షా రాష్ట్ర పర్యటనపైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. 2006 నవంబరులో నాటి చైనా అధినేత హూ జింటావో భారత పర్యటన సందర్భంగా ఇలాంటి ప్రకటనే చేసింది. ఉభయ దేశాల మధ్య గల సుమారు నాలుగువేల కిలోమీటర్ల సరిహద్దులో అరుణాచల్ ప్రదేశ్ చాలా కీలకమైనది. ఇక్కడే వాస్తవాధీన రేఖ (ఎల్ ఏ సీ- లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్) ఉంది. దీనినే మెక్ మహన్ లైన్ అని కూడా పిలుస్తారు. ఎల్ఏసీని తాము గుర్తించడం లేదని చైనా చాలా కాలంగా వాదిస్తోంది. లద్దాఖ్ లో ప్రస్తుత పరిస్థితి 1962 నాటి యుద్ధ పరిస్థితిని తలపిస్తోందని విదేశాంగ మంత్రి జైశంకర్ పేర్కొన్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడున్నది అరవైల నాటి భారత్ కాదని శత్రువును దెబ్బతీయడానికి సర్వదాసన్నద్ధంగా ఉండటంతో డ్రాగన్ అసహనంతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుందన్నది రక్షణ నిపుణుల మాట వాస్తవానికి అద్దం పడుతోంది.
-ఎడిటోరియల్ డెస్క్