Tue Dec 24 2024 18:14:15 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : పెద్దాయన పంథాలోనే ఈయన కూడా...అసలు కారణమదేనట
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలని జగన్ కూడా యోచిస్తున్నట్లు సమచారం
సహజంగా ఒక రాజకీయ నేత చేసిన పని నిజమనిపిస్తే మరొక నేత కూడా దానినే ఫాలో అవుతారు. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా అదే జరుగుతుంది. ఒకరిని చూసి మరొకరు అదే పంథాలో వెళుతుంటారు. ఒకచోట సక్సెస్ అయితే అదే ఫార్ములాను తాము అందిపుచ్చుకుని వెళతారు. రాజకీయాల్లో ఇది మామూలు విషయమే అయినా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇది ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గానే ఉంటుంది. కేసీఆర్ బాటలోనే జగన్ కూడా పయనిస్తున్నారన్న ప్రచారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జోరుగా నడుస్తుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలని జగన్ కూడా యోచిస్తున్నట్లు సమచారం ఉందంటున్నారు.
సమయం సమీపిస్తున్న...
తెలంగాణ ఎన్నికలు ముగిసిన వెంటనే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నగారా మోగనుంది. బహుశ ఏప్రిల్, మే నెలల్లో ఏపీ ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. ఒకేసారి లోక్‌సభ, ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధినేత అనుసరించిన వ్యూహాన్నే జగన్ కూడా అమలు పర్చననున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. అయితే రెండు రాష్ట్రాల ఎన్నికల పరిస్థితికి, అక్కడ అధినేత నిర్ణయానికి, ఇక్కడ జగన్ డెసిషన్ కు పోల్చి చూసినప్పడు.. తెలంగాణలో ఒక కారణం కోసం కేసీఆర్ ఆ నిర్ణయం తీసుకుంటే... జగన్ మాత్రం ఏపీలో మరొక రీజన్ కోసం ఆ నిర్ణయాన్ని తీసుకోవాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఆయన కారణాలు...
బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఈసారి తెలంగాణ ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేస్తున్నారు. ఆయన కామారెడ్డి, గజ్వేల్‌లలో బరిలో ఉన్నారు. రెండు చోట్ల నామినేషన్ వేశారు. గజ్వేల్ లో రెండుసార్లు గెలిచిన కేసీఆర్ ఈసారి కామారెడ్డిని ఎంచుకోవడం చర్చనీయాంశమైనప్పటికీ అనేక రాజకీయ కారణాలతో ఆయన రెండు చోట్ల నామినేషన్లు వేశారు. మరి ఎన్నింటిలో గెలుస్తారు? అన్నది పక్కన పెడితే ఆయన చూపిన బాటలోనే జగన్ కూడా పయనించాలని నిర్ణయించుకున్నారని తెలిసింది. అయితే కేసీఆర్ కారణాలు ఆయనకు వేరే ఉన్నా జగన్ మాత్రం తనకు ఈ ఎన్నికల్లో ప్రత్యేక కారణాలున్నాయని సన్నిహితుల వద్ద అన్నట్లు సమాచారం.
రెండు చోట్ల...
జగన్ కూడా ఈసారి ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేయాలని నిర్ణయించారని చెబుతున్నారు. జగన్ కు పులివెందుల సొంత గడ్డ. ఆయనకు అక్కడ ఎటువంటి ఇబ్బందులుండవు. ఆయన గెలుపు నల్లేరు మీద నడకే. అయితే ఈసారి జగన్ కు కొత్త సమస్య వచ్చింది. మూడు రాజధానులను ప్రకటించిన తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. రాయలసీమలో ఎటూ తాను పోటీలో ఉంటాను కాబట్టి, ఉత్తరాంధ్రలో పోటీ చేయాలన్న నిర్ణయానికి ఆయన వచ్చినట్లు తెలిసింది. మూడు రాజధానులు అనేక కారణాల వల్ల అమలు కాకపోయినా తాను ఈసారి ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేసి పార్టీకి మరింత హైప్ తేవాలని అనుకుంటున్నారు.
నియోజకవర్గం కోసం...
తాను పోటీ చేస్తే ఆ జిల్లాయే కాకుండా ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో వైసీపీ గెలుపుపై ఢోకా లేకుండా పోతుందని అంచనా వేసుకుంటున్నారు. తనకు అనుకూలమైన, అనువైన నియోజకవర్గం కోసం జగన్ టీం ఇప్పటికే సర్వేలు చేయిస్తున్నట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం నుంచి పోటీ చేయడం వల్ల విజయనగరం, విశాఖ పట్నం జిల్లాల్లోనూ ఆ ప్రభావం ఉంటుందని పీకే టీం సర్వే నివేదికలు కూడా ఇచ్చినట్లు వినికిడి. అయితే ఎక్కడ నుంచి పోటీ చేస్తారన్న దానిపై మాత్రం ఇంకా క్లారిటీ రాకపోయినా రాయలసీమతో పాటు ఉత్తరాంధ్రలో కూడా పోటీ చేయడానికి రెడీ అవుతున్నారన్న సమాచారం ఫ్యాన్ పార్టీలో ఉంది.
Next Story