పిడుగులాంటి మాట…
రాజకీయాల్లో మంచి చేసేందుకైనా, చెడు చేసేందుకైనా దమ్ముండాలి. అందులోనూ అందివచ్చే అవకాశాన్ని వదులుకోవాలంటే ఉదారత, త్యాగబుద్ధి కూడా అవసరమే. పచ్చి అవకాశవాదం రాజ్యం చేస్తున్న రోజుల్లో నీతిమంతంగా [more]
రాజకీయాల్లో మంచి చేసేందుకైనా, చెడు చేసేందుకైనా దమ్ముండాలి. అందులోనూ అందివచ్చే అవకాశాన్ని వదులుకోవాలంటే ఉదారత, త్యాగబుద్ధి కూడా అవసరమే. పచ్చి అవకాశవాదం రాజ్యం చేస్తున్న రోజుల్లో నీతిమంతంగా [more]
రాజకీయాల్లో మంచి చేసేందుకైనా, చెడు చేసేందుకైనా దమ్ముండాలి. అందులోనూ అందివచ్చే అవకాశాన్ని వదులుకోవాలంటే ఉదారత, త్యాగబుద్ధి కూడా అవసరమే. పచ్చి అవకాశవాదం రాజ్యం చేస్తున్న రోజుల్లో నీతిమంతంగా ఉంటానని చెప్పడమంటే ఒక సాహసమే. అలా చెబుతున్నారంటే సంతృప్త స్థాయికి చేరుకుని అయినా ఉండాలి. లేకపోతే ఉన్నది చాలు. కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టుకోవడమెందుకనే ముందు జాగ్రత్త అయినా కావాలి. నిర్ణయానికి కారణమేదైనా భవిష్యత్తుకు మార్గదర్శకం అయితే కచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. టీడీపీ ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకునేది లేదంటూ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తేల్చిచెప్పడం ఒక మంచి పరిణామం. ఇది తెలుగు రాష్ట్రాల్లో విచ్చలవిడిగా, ఇష్టారాజ్యంగా మారిన దుష్ట సంస్క్రుతిపై పిడుగు లాంటి మాట. ‘అధికారం చేతిలో ఉంది కదా అని ప్రతిపక్ష సభ్యులను కలిపేసుకోం. కావాలంటే రాజీనామా చేసి రమ్మంటాం.’అంటూ జగన్ మోహన్ రెడ్డి చట్టసభ సాక్షిగా స్పష్టం చేశారు. ప్రస్తుత కాలంలో ఇదో విభిన్నమైన ఆదర్శప్రాయ శపథం. గడచిన దశాబ్ద కాలంగా ప్రజాతీర్పును భ్రష్టు పట్టిస్తూ అధికారపార్టీలు రాజకీయ క్రీడను రంజుగా సాగిస్తున్నాయి. ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీని ఊడ్చి పెట్టేసేందుకు తెగిస్తున్నాయి. ప్రతిపక్షం లేచి నిలదొక్కుకునే అవకాశం లేకుండా అవసరమున్నా, లేకపోయినా అందర్నీ తమ పార్టీలో కలిపేసుకుంటున్నాయి. పదవి లేకపోతే, పీఠం ఎక్కకపోతే ఊపిరాడని ప్రతినిధులు అధికారానికి దాసోహమంటున్నారు. అమ్ముడుపోతున్నారనే ఆరోపణలకు సైతం వెరవకుండా అటువైపు దూకేస్తున్నారు.
నడి బజారులో…
సొంతపార్టీకి వెన్నుపోటు పొడిచి అధికారపార్టీతో అంటకాగుతున్న ఎమ్మెల్యేల కారణంగా ప్రజాస్వామ్యం నడిబజారులో అంగడి సరుకై పోతోంది. ఫిరాయింపుల నిరోధక చట్టం ఫక్కున నవ్వుతుంటే రాజ్యాంగం సాక్షిగా అదే రాజ్యాంగ నైతికతకు తూట్లు పొడుస్తూ మంత్రులై పోతున్నారు. ఈ స్థితిలో ఒక తూటా లాంటి నిర్ణయం కేవలం తెలుగు రాష్ట్రాలకే కాదు, దేశంలోనే అన్ని రాష్ట్రాల చట్టసభలు లోక్ సభ సహా పాటించాల్సిన ఒక ఆదర్శాన్ని తాను ఆచరించి చూపుతానంటూ ముందుకొచ్చారు వై.ఎస్.జగన్. ప్రతిపక్షం రూపురేఖలు లేకుండా నామమాత్రం చేయాలనేది అధికారపక్షాల బాటగా, మాటగా ఇటీవలి కాలంలో సాగిపోతోంది. ఉదాసీనంగా వ్యవహరిస్తూ తమ వంతు సహకారాన్ని పరోక్షంగా అందిస్తున్నారు సభాపతులు. న్యాయస్థానాలు పూర్తిగా జోక్యం చేసుకోలేక, ఊరకుండలేక తటపటాయింపుతో కాలయాపన చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో తన్నుతాను సంస్కరించుకోవడమే రాజకీయానికి ప్రత్యామ్నాయం. అవకాశవాద రాజకీయాలే రాజ్యం చేస్తున్న రోజుల్లో అటువంటి చిత్తశుద్ధిని, అంకితభావాన్ని పార్టీల అధినేతల నుంచి ఆశించడం అత్యాశే. రాజకీయమంటే కొనుగోళ్లు, బేరసారాలు కాదు ప్రజాభీష్టం అన్న వాదాన్ని కొత్తగా ముందుకు తెచ్చారు జగన్. వేరే పార్టీ నుంచి గెలిచిన వారు తన పార్టీలోకి రావాలంటే కచ్చితంగా రాజీనామా చేయాల్సిందేనని అసెంబ్లీలోనే తేల్చి చెప్పేశారు.
తెలంగాణతో పోలిస్తే…
పొరుగు రాష్ట్రం తెలంగాణ దేశంలోనే ఎక్కడా లేని కొత్త సంప్రదాయానికి తెర తీసింది. ప్రతిపక్షం ఎమ్మెల్యేలను చేర్చుకునే స్థాయిని దాటిపోయింది. ఏకంగా ప్రతిపక్ష లెజిస్లేచర్ పార్టీనే తనలో విలీనం చేసేసుకుంటోంది. అంతగా మారిపోయింది రాజకీయం. ఈ స్థితిలో ఎక్కడా లేనంత భారీ విజయంతో ఆంధ్రాలో అధికారంలోకి వచ్చింది వైసీపీ. ప్రజామద్దతు బలంగా ఉండటంతో ఇప్పట్లో ఆ పార్టీ ఏం చేసినా ప్రశ్నించేవారు లేరు. పైపెచ్చు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అడ్డగోలుగా వైసీపీ ఎమ్మెల్యేలను 23 మందిని కలిపేసుకుని , నలుగురికి మంత్రి పదవులు కూడా ఇచ్చింది. టీడీపీని నిర్వీర్యం చేసి, టీడీపీ అధినేతకు ప్రతిపక్ష హోదాలో క్యాబినెట్ ర్యాంకు దక్కకుండా చేసేందుకు జగన్ కు అవకాశం ఉంది. అయినప్పటికీ తాను ఆ రూటులో వెళ్లనని చెప్పడం నైతిక విలువలకు దర్పణం పట్టేదే. పదుల కోట్లను ఎన్నికల్లో ఖర్చు పెట్టి నెగ్గిన ఎమ్మెల్యేలు పవర్ పార్టీలో చేరాలని తహతహలాడటం సహజం. తనతో కొందరు టచ్ లో ఉన్నప్పటికీ ఇది సరైన విధానం కాదని తోసిపుచ్చానని చెప్పడం ద్వారా టీడీపీ ప్రభుత్వ గత తప్పిదాలను ఎత్తి చూపారు ముఖ్యమంత్రి జగన్. హార్స్ ట్రేడింగ్ గా ముద్దు పేరు పెట్టి వచ్చిన వారిని వచ్చినట్లు పార్టీలో చేర్చేసుకుని ప్రజలిచ్చిన తీర్పునే పక్కదారి పట్టిస్తున్నాయి సర్కారులు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇది సాధారణ తంతుగా , పెద్దగా పట్టించుకోనవసరం లేని వ్యవహారంగా తీర్చిదిద్దాయి ప్రభుత్వాలు. ఒక్క ఓటు తేడా వచ్చిందని ప్రధానమంత్రి పదవినే వదిలేసుకున్న వాజపేయి కాలం నాటి విలువలు వెలవెల బోతున్నాయి. జంపింగ్ జపాంగ్ లే కింగ్ లు గా అమాత్యులైపోతున్నారు. ఒకసారి ఓటు వేసిన తర్వాత ప్రజల చేతిలోనూ ఉండటం లేదు నాయకులు. ప్రజాతీర్పుతో, ప్రజాస్వామ్యంతో సంబంధమే లేదన్నట్లుగా నచ్చిన పార్టీలో చేరిపోతున్నారు. మొత్తం వ్యవస్థనే తప్పుదారిపట్టిస్తున్నారు. ఫిరాయింపుల నిరోధక చట్టానికి సైతం వక్ర భాష్యాలు చెబుతున్నారు. అధికారపు ఎంగిలికోసం అంగలార్చుతున్నారు. శాసనసభ స్వతంత్రప్రతిపత్తి, సభాపతికి ఉన్న విచక్షణాధికారాలు వారికి రక్షణ కవచంగా నిలుస్తున్నాయి.
సుప్రీం తీర్పునకే చెల్లు చీటీ…
ఫిరాయింపుల నిరోధక చట్టంలో సందిగ్ధత ఉండటంతో అనేకమంది న్యాయస్థానాలను ఆశ్రయించిన ఉదంతాలున్నాయి. మాటలు, చేతలు, ప్రవర్తన ద్వారా పార్టీకి విధేయత చూపకుంటే, పార్టీ ప్రయోజనాలకు భంగకరంగా ప్రవర్తిస్తే స్వచ్ఛందంగా పదవిని వదులుకున్నట్లేనంటూ గతంలో సర్వోన్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది. అయితే సభాపతులు దీనిని పెద్దగా పట్టించుకోవడం లేదు. తీర్పు నిజమైన స్ఫూర్తితో అమలు కావడం లేదు. చట్టానికే చెల్లుచీటి పాడేస్తున్నారు మన నేతలు. అటువంటి వారికే అండగా నిలుస్తున్నారు అధినేతలు. కుమ్మక్కు రాజకీయాలు, కుటిల నీతి, కుహనా అవకాశవాదాలదే అన్నిటా అగ్రతాంబూలం. పాలనలో ప్రభుత్వం, ప్రతిపక్షం రెండూ ముఖ్యమే అన్న సంప్రదాయం పాతబడిపోయింది. అసలు ప్రతిపక్షమే లేకుండా ..అంతా మనవాళ్లే అయిపోతే అడిగేవాడే ఉండడు కదా? అన్నట్లు గా మారిపోయింది డెమోక్రసీ. ప్రజాస్వామ్యం అంగడి సరుకుగా మారిపోయినప్పుడు… చట్టం చేతులు కట్టుకుని చూస్తున్నప్పుడు ఆదర్శాలను ఆశించలేం. అంతా ఆ తానుముక్కలే అనుకుంటాం. కానీ ఫిరాయింపులను ప్రోత్సహించేది లేదంటూ గట్టి నిర్ణయం తీసుకున్నందుకు జగన్ ను అభినందించాలి. ఇతర రాజకీయ పార్టీలకూ, ప్రభుత్వాలకూ ఇది మార్గదర్శకమే.