న్యాయానికి నిలువెత్తు రూపం...!
సాధారణంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ పెద్దగా ఆసక్తి కలిగించవు. సంచలనాలు అసలే కలగించవు. ఇందుకు కారణాలు లేకపోలేదు. వారి వృత్తి వ్యాపకాలు ప్రజా జీవితంలో ముడిపడి ఉండవు. జన జీవితంలో ఉండరు. కాని పదునైన తీర్పులు ఇవ్వడం ద్వారా ప్రజల మన్ననలను పొందుతారు. వారి ఆదరాభిమానాలకు పాత్రులు అవుతారు. పౌరహక్కులకు పట్టం కట్టే, ప్రభుత్వ దమననీతిని ఖండించే, అధికార యంత్రాంగం అలక్ష్యం, అవినీతిని శిక్షించే విధంగా తీర్పులివ్వడం ద్వారా ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచి పోతారు. అటువంటి వారు బహుకొద్ది మంది ఉంటారు. వారిలో ఒకరు జస్టిస్ జాస్తి చలమేశ్వర్, సుప్రీంకోర్టు అత్యంత సీనియర్ న్యాయమూర్తిగా ఆయన అందరికీ సుపరిచితుడు. న్యాయానికి నిలువెత్తు నిదర్శనం. సాంకేతికంగా ఆయన పదవీ కాలం వచ్చే నెల వరకూ ఉన్నప్పటికీ సుప్రీంకోర్టు వేసవి సెలవల కారణంగా జస్టిస్ జాస్తి చలమేశ్వర్ పదవీకాలం ముగిసిపోయింది.
ఆంధ్రప్రదేశ్ లో పుట్టి.....
కృష్ణా జిల్లా మొవ్వ మండలం పెద్ద ముత్తేవి గ్రామంలో 1953 జూన్ 23న చలమేశ్వర్ జన్మించారు. ఆయన తండ్రి లక్ష్మీనారాయణ ప్రముఖ న్యాయవాది. తండ్రి స్ఫూర్తితో న్యాయవిద్యను అభ్యసించారు చలమేశ్వర్. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రాక్టీసు ప్రారంభించిన ఆయన అనతి కాలంలోనే మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రముఖ న్యాయవాదిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశారు. పలు కీలక కేసులు వాదించారు. 90వ దశకంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అనంతరం అదే హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తి అయ్యారు. తర్వాత పదోన్నతిపై గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. 2011 అక్టోబరులో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఆ ఏడాది అక్టోబర్ 11న ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ చలమేశ్వర్ లు ఒకే రోజు ప్రమాణస్వీకారం చేయడం విశేషం.
సంచలన తీర్పులు....
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ చలమేశ్వర్ సంచలనాలకు కేంద్ర బిందువు అయ్యారు. పలు కీలక కేసుల్లో ప్రజాప్రయోజనాలకు పట్టం కడుతూ, ప్రభుత్వ అనుచిత వైఖరిని ఎండగడుతూ, అధికారుల అనాలోచిత చర్యలను సూటిగా నిలదీస్తూ తీర్పులను వెలువరించారు. ధర్మాసనంపై కూర్చున్నప్పుడు ఆయన దృష్టి అంతా కక్షిదారుల ప్రయోజనాలు కాపాడటం పైనే ఉండేది. చట్టం,ధర్మం, న్యాయంపైనే మనసు లగ్నం చేసేవారు. చట్టాల ముందు వ్యక్తులు చాలా చిన్నవారని ఆయన భావించేవారు. ఆయన తీర్పులు కూడా ఆ దిశగానే ఉండేవి. న్యాయాన్ని నిక్కచ్చిగా చెప్పడంలో నీళ్లు నమిలేవారు కాదు. సూటిగా, సరళంగా, స్పష్టంగా తాను చెప్పదలచుకున్న విషయాన్ని చెప్పేవారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులే కాకుండా వారి జీవిత భాగస్వామ్యులు, వారిపై ఆధారపడిన వారి ఆస్తులు, ఆదాయాల వివరాలను కూడా సమర్పించాలంటూ జస్టిస్ చలమేశ్వర్ తీర్పివ్వడం విశేషం. ఎవరికైనా చికాకు ఇబ్బంది కలిగించే ఈ మెయిల్ సందేశాలు ఇచ్చే వారిని అదుపు చేసేందుకు పోలీసులకు అధికారం ఇచ్చే ఐటీ చట్టంలోని 66 ఎ సెక్షన్ చెల్లదంటూ జస్టిస్ నారిమన్ తో కలసి తీర్పునిచ్చారు. ఆధార్ కార్డు లేదనే పేరుతో ఏ పౌరుడికి అయినా మౌలిక సేవలు, ప్రభుత్వ సబ్సిడీలు నిరాకరించరాదంటూ జస్టిస్ బాబ్డే, జస్టిస్ నాగప్పన్ లతో కలసి నిక్కచ్చి తీర్పునిచ్చారు. వ్యక్తిగత గోప్యత ప్రాధమిక హక్కంటూ జస్టిస్ పుట్టస్వామి కేసులో తీర్పు ఇచ్చిన రాజ్యాంగ ధర్మాసనం కేసులో చలమేశ్వర్ కూడా ఉన్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకాలను చేపట్టే సుప్రీంకోర్టు కొలీజియం పనితీరు పారదర్శకంగా లేదని చెప్పడం ద్వారా వ్యవస్థలోని డొల్లతనాన్ని ధైర్యంగా ఎండగట్టారు. దేశ అత్యున్నత న్యాయస్థానంలో పరిస్థితులు సవ్యంగా లేవంటూ ఈ ఏడాది జనవరి 12నన సహచర న్యాయమూర్తులు జస్టిస్ రంజన్ గొగొయ్, జస్టిస్ ఎంబీ లోకూర్, జస్టిస్ జోసెఫ్ లతో కలిసి విలేకర్ల సమావేశంలో ప్రకటించడం సాహసోపేతమైన చర్య అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
జస్టిస్ ఖన్నాతో పోల్చి.......
జస్టిస్ చలమేశ్వర్ ప్రతిభాపాటవాలను పలువురు సీనియర్ న్యాయవాదులు ప్రస్తుతించడం విశేషం. 1977లో జనతా ప్రభుత్వ హయాంలో న్యాయశాఖ మంత్రిగా పనిచేసిన శాంతిభూషణ్ జస్టిస్ చలమేశ్వర్ ను జస్టిస్ హెచ్.ఆర్ ఖన్నా తో పోల్చడం ఆయన గౌరవానికి నిదర్శనం. జస్టిస్ ఖన్నా అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) సమయంలో ప్రభుత్వాన్ని బేఖాతరు చేస్తూ ప్రాధమిక హక్కులకు పట్టం కట్టారు. పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలను వాదిస్తూ తరచూ ప్రభుత్వపై ధ్వజం ఎత్తే సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తండ్రే శాంతిభూషణ్. చలమేశ్వర్ వంటి గొప్ప న్యాయమూర్తుల ముందు వాదనలను విన్పించడం బార్ సభ్యులకు వరమని సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే కొనియాడారు. జూనియర్ న్యాయవాదులకు ఇచ్చిన ప్రోత్సాహాన్ని మరువలేమని మరో న్యాయవాది గోపాల్ శంకర్ నారాయణ కృతజ్ఞతలు తెలిపారు. న్యాయమూర్తి పదవీ విరమణ రోజులు ప్రధానన్యాయమూర్తితో కలిసి కేసులు విచారించడం ఆనవాయితీగా వస్తోంది. కానీ ప్రస్తుత ప్రధానన్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాతో విభేదాల నేపథ్యంలో జస్టిస్ చలమేశ్వర్ ఈ సంప్రదాయాన్ని పాటిస్తారా? లేదా? అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ వ్యక్తులు కన్నా వ్యవస్థలు, సంప్రదాయాలు మిన్న అని భావించే జస్టిస్ చలమేశ్వర్ ఆయన అనుమానాలను పటాపంచలు చేస్తూ చివరి రోజున దీపక్ మిశ్రాతో కలసి కేసలు విచారించడం ద్వారా తన నిబద్ధతను చాటుకున్నారు.
-ఎడిటోరియల్ డెస్క్