బెడిసి కొట్టి..బెంబేలు
మరో పదేళ్ల పాటు నేనే ముఖ్యమంత్రినంటూ కేసీఆర్ ఘంటాపథంగా ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రసమితి అధికారంలో ఉంటేనే అనే షరతు ఎలాగూ వర్తిస్తుందనుకోండి. టీఆర్ఎస్ వారసుడైన కేటీఆర్ కు [more]
మరో పదేళ్ల పాటు నేనే ముఖ్యమంత్రినంటూ కేసీఆర్ ఘంటాపథంగా ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రసమితి అధికారంలో ఉంటేనే అనే షరతు ఎలాగూ వర్తిస్తుందనుకోండి. టీఆర్ఎస్ వారసుడైన కేటీఆర్ కు [more]
మరో పదేళ్ల పాటు నేనే ముఖ్యమంత్రినంటూ కేసీఆర్ ఘంటాపథంగా ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రసమితి అధికారంలో ఉంటేనే అనే షరతు ఎలాగూ వర్తిస్తుందనుకోండి. టీఆర్ఎస్ వారసుడైన కేటీఆర్ కు సీఎం పదవి గురించి గడచిన రెండేళ్లుగా చర్చ నడుస్తోంది. ఇటీవల తారస్థాయికి చేరింది. మంత్రులూ , ఎమ్మెల్యేలూ తామెక్కడ వెనకబడి పోతామోననే భయంతో కోరస్ పెంచారు. కాబోయే ముఖ్యమంత్రిని ప్రసన్నం చేసుకోవాలని పోటీలు పడ్డారు. తండ్రి కొడుకుల తీరు పట్ల కొంతమేరకు అసంతృప్తితో ఉండే ఈటల రాజేందర్ వంటి వారు సైతం తప్పదన్నట్లు కేటీఆర్ జపం ఎత్తుకున్నారు. అంతా సజావుగా సాగిపోతుందనుకుంటున్న పరిస్థితుల్లో కేసీఆర్ రంగంలోకి దిగారు. కేటీఆర్ సీఎం ప్రచారానికి తెర వేయండంటూ ఆదేశించారు. నిజంగానే ఆయన మనసులో అటువంటి ఆలోచన లేకుంటే మొదట్లోనే ఈ భావనను తుంచేసేవారు. రెండేళ్లుగా ప్రచారాన్ని ఉపేక్షించి ఇప్పటికిప్పుడు మరో పదేళ్లు నేనే సీఎం అని చెప్పడంలోని ఆంతర్యమే చర్చనీయమవుతోంది.
ప్రతికూల పరిస్తితులు…
కేసీఆర్ ఏ పని చేపట్టినా పదేళ్ల ముందు చూపు ఉంటుంది. నిర్ణయాలను వేగంగా తీసుకుంటారు. దీర్ఘకాల ప్రభావాలను అంచనా వేస్తారు. పరిస్థితులు ప్రతికూలమని తోస్తే అంతే వేగంగా ఉపసంహరించుకుంటారు. కేంద్రంతో సంబంధాలు కావచ్చు. ప్రజలకు ఇచ్చే హామీలు కావచ్చు. టీఆర్ఎస్ లో నాయకత్వ మార్పులు కావచ్చు . ఏదైనా కేసీఆర్ అనుకున్నదే జరుగుతుంది. ఆయనకు తెలియకుండా చీమ కూడా చిటుక్కుమనదు. కేటీఆర్ ను వర్కింగ్ ప్రెసిడెంటుగా చేసినప్పుడే పార్టీ క్యాడర్ కు, లీడర్లకు స్పష్టమైన సంకేతాలిచ్చేశారు. తన తర్వాత కేటీఆర్ తిరుగులేని నాయకుడని. తన సారథ్యంలో నీడ పడుతున్నంత కాలం వారసుడు పెద్దగా ఎదగలేడని కూడా తెలుసు. అందుకే పార్టీ కార్యకలాపాలను తగ్గించేసుకున్నారు కేసీఆర్. మరోవైపు ప్రభుత్వ కార్యక్రమాల్లో సైతం మంత్రుల స్థాయి సమీక్షలను కేటీఆర్ నిర్వహించేస్తున్నారు. ప్రజల దృష్టిలో కూడా ఇక ఆయన రావడమే తరువాయి అన్న ముద్ర పడిపోయింది. జరుగుతున్న పరిణామాల్లో ప్రతి అంశమూ ప్రత్యక్షంగా, పరోక్షంగా కేసీఆర్ కు తెలిసే సాగాయి. ఆయన కనుసన్నల్లోనే జరిగాయనేది కొందరి వాదన. అయినా ఆశించిన విధంగా కేటీఆర్ ముఖ్యమంత్రిత్వం పట్ల మద్దతు లభించడం లేదని కేసీఆర్ పసిగట్టారు. ఈ ప్రచారం వల్ల రాష్ట్రంలో టీఆర్ఎస్ బలహీనపడుతుందేమోనన్న అనుమానం ఆయనలో నెలకొంది. దీంతో కారును రివర్స్ గేర్ లోకి తీసుకురావడానికి డ్రైవర్ గా తానే రంగంలోకి దిగాల్సి వచ్చింది.
పట్టు జారిపోతుంది…
నిజానికి కేటీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా విస్త్రుతంగా తిరుగుతున్నారు. పార్టీ వ్యవహారాలు, ప్రభుత్వ వ్యవహారాలు చక్కదిద్దుతున్నారు. కేసీఆర్ గైడెన్స్ ఉన్నప్పటికీ ప్రజలకు భావి ముఖ్యమంత్రిగా కేటీఆర్ ప్రజెన్స్ ప్రబలంగా కనిపిస్తోంది. అయితే కేసీఆర్ కు ఉన్న ఇమేజ్ మాత్రం ఆయన వారసుడికి దక్కడం లేదు. మరోవైపు కుటుంబం అంతా తెలంగాణపై పట్టుసాధిస్తోందనే భావన వ్యాపించింది. ఉద్యమకారునిగా కేసీఆర్ ను ఆయన జీవించి ఉన్నంతకాలం ముఖ్యమంత్రిగా చూడటానికి ఇష్టపడే ప్రజలు రాష్ట్రంలోచాలామంది ఉన్నారు. కానీ కేటీఆర్ విషయానికొచ్చేటప్పటికి సాధారణ రాజకీయ వేత్తగానే పరిగణిస్తున్నారు. తెలంగాణలో ఉన్న సామాజిక సమీకరణల్లో ముఖ్యమంత్రి సామాజిక వర్గ ప్రాతినిధ్యం ఓట్ల పరంగా అత్యల్పం. కాంగ్రెసు బలమైన రెడ్డి సామాజిక వర్గం అండతో ఎప్పుడైనా అధికారానికి సవాల్ విసురుతోంది. అత్యధిక సంఖ్యలో వెనకబడిన తరగతుల ప్రజలు ఉన్న నేపథ్యంలో బీసీ కార్డుతో ముందుకు రావాలని బీజేపీ వ్యూహాత్మకంగా కదులుతోంది. తాను పీఠం దిగి వారసుడికి బాధ్యతలు ఇచ్చేస్తే మిగిలిన పార్టీలతో పాటు అధికారం కోసం టీఆర్ఎస్ కూడా పెద్ద ఎత్తున పోటీ పడాలి. నల్లేరుపై బండి నడకలా సాఫీగా అధికారం వచ్చి కూర్చొనే ప్రసక్తే లేదు. సామాజికంగా అడ్వాంటేజ్ ఉన్న మిగిలిన రెండు పార్టీల పట్టు పెరుగుతుంది. ఇటీవల కేసీఆర్ తన సన్నిహిత వర్గాల నుంచి సేకరించిన సమాచారం ఇదే విషయాన్ని ధ్రువీకరించాయి. దాంతో కేటీఆర్ పట్టాభిషేక నిర్ణయాన్ని నిరవధిక వాయిదావేసినట్లు తెలుస్తోంది.
ప్రచార చిత్రానికి తెర…
జాతీయ రాజకీయ ముఖచిత్రం ప్రస్తుతానికి అనిశ్చితంగా ఉంది. కేంద్రంలో పదేళ్ల పాలన తర్వాత బీజేపీ హవా కొనసాగుతుందా? అంటే ఎవరూ చెప్పలేకపోతున్నారు. అనేక ప్రజా వ్యతిరేక నిర్ణయాలు బాధిస్తున్నాయి. సామాన్యుని జీవితం దుర్భరంగా మారింది. కరోనా ఎపెక్ట్ తో సగటు మనిషి జీవన స్థితిగతులు తలకిందులైపోయాయి. తమకు ఏరకమైన ఇబ్బంది ఎదురైనా ప్రభుత్వాన్నే దోషిగా చూస్తారు ప్రజలు. ఖజానాను నింపుకోవడానికి కేంద్ర సర్కారు ప్రజలపైనే పన్నుల భారం మోపుతోంది. మొత్తమ్మీద పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా లేరు. కానీ నరేంద్రమోడీ దేశం కోసం పని చేసే నిజాయతీ పరుడనే భావనే కేంద్రాన్ని కాపాడుతోంది. అందుకే కష్టనష్టాలను కూడా ప్రజలు భరిస్తూ మద్దతిస్తున్నారు. అయితే ఇది ఒక స్థాయి వరకే సాధ్యం. గతంలో మత భావనలు, పాక్ పై దాడులు వంటి భావోద్వేగ అంశాలతో ప్రజాభిప్రాయాన్ని అనుకూలంగా బీజేపీ మలచుకోగలిగింది. రామాలయ నిర్మాణం వంటి అంశాలు వచ్చే ఎన్నికల నాటికి పాతవై పోతాయి. అందువల్ల భావోద్వేగ అంశాలు వర్సస్ ప్రజల నిత్య జీవన పరిస్థితులు పరస్పరం ఢీకొనే అవకాశం ఉంది. ఈ స్థితిలో కాంగ్రెసు, బీజేపీల చాన్సులు ఏమిటనేది పసిగట్టలేకపోతున్నారు నాయకులు. ఢిల్లీలో చక్రం తిప్పాలనుకున్న కేసీఆర్ కూడా సందిగ్ధంలో పడ్డారు. అందుకే మరో సార్వత్రిక ఎన్నికల వరకూ రాష్ట్రం పైనే ఫోకస్ పెట్టి కేంద్రం జోలికి వెళ్లకూడదని నిశ్చయించుకున్నట్లు సమాచారం. ఫలితంగానే కేటీర్ పట్టాభిషేకం అనే ప్రచార చిత్రానికి తెర దించేశారు.
-ఎడిటోరియల్ డెస్క్