కాకాణిని వారంతా వెలేశారా?
కాకాణి గోవర్ధన్ రెడ్డి. నెల్లూరు జిల్లాలో వైసీపీ సీనియర్ నేత. పార్టీ జిల్లా అధ్యక్షుడు కూడా. ఎన్నికల ముందు వరకూ నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయం కళకళ [more]
కాకాణి గోవర్ధన్ రెడ్డి. నెల్లూరు జిల్లాలో వైసీపీ సీనియర్ నేత. పార్టీ జిల్లా అధ్యక్షుడు కూడా. ఎన్నికల ముందు వరకూ నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయం కళకళ [more]
కాకాణి గోవర్ధన్ రెడ్డి. నెల్లూరు జిల్లాలో వైసీపీ సీనియర్ నేత. పార్టీ జిల్లా అధ్యక్షుడు కూడా. ఎన్నికల ముందు వరకూ నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయం కళకళ లాడేది. నేతలు, అనుచరులతో కిటకిటలాడుతుండేది. అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత సందడి పెరగాలి. కానీ నెల్లూరు జిల్లా వైసీపీ కార్యాలయం మాత్రం వెలవెల బోతోంది. దీనికి కారణం జిల్లా పార్టీ అధ్యక్షుడు కాకాణి గోవర్థన్ రెడ్డి అంటున్నారు. కాకాణి గోవర్థన్ రెడ్డి అంటే జిల్లాలో ఏ వైసీపీ నేతకు పడటం లేదట. ఇటీవల సీఎం జగన్ నెల్లూరు జిల్లాలో రైతు భరోసా కార్యక్రమంలో పాల్గొన్న సమయంలోనూ ఇదే రకమైన తీరు బయటపడింది.
ఇద్దరి మధ్య…..
కాకాణి గోవర్థన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కి మధ్య ఉన్న విభేదాలు బయటపడిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై ఎంపీడీవో తనపై దాడి చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కోటంరెడ్డిని పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. అయితే ఎంపీడీవో వెనుక కాకాణి గోవర్థన్ రెడ్డి హస్తం ఉందని కోటంరెడ్డి బహిరంగంగానే ఆరోపించారు. అయితే ఇద్దరి మధ్య వివాదాన్ని తాత్కాలికంగా వైసీపీ సీనియర్ నేతలు సర్దుబాటు చేయగలిగారు. సీఎం జగన్ పాల్గొన్నా కార్యక్రమంలోనూ ఇద్దరు నేతలు ఎడమొహం, పెడమొహంగానే వ్యవహరించారట.
కాకాణి అంటేనే….
అయితే ఇది ఒక్క కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమస్యే కాదంటున్నారు. కాకాణి గోవర్థన్ రెడ్డి ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తుండటంతో మిగిలిన ఎమ్మెల్యేలు సయితం ఆయనకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో అన్ని స్థానాలను వైసీపీ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే మంత్రి వర్గ విస్తరణలో సీనియర్ ఎమ్మెల్యేలందరూ తమకు చోటు దక్కుతుందని ఆశించారు. అయితే తమకన్నా జూనియర్లు అయిన అనిల్ కుమార్ యాదవ్, మేకపాటి గౌతంరెడ్డిలకు మంత్రి పదవి దక్కడంతో కాకాణి గోవర్థన్ రెడ్డితో పాటు ఆనం రామనారాయణరెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వంటి నేతలు కూడా నిరాశ చెందారు.
ఎవరికి వారే….
మంత్రివర్గ విస్తరణ ప్రభావం జిల్లాలో బాగా కన్పిస్తుంది. జిల్లా పార్టీ కార్యాలయానికి ఏ ఒక్క ఎమ్మెల్యే రావడం లేదట. సాధారణంగా ఏదైనా కార్యక్రమం పెట్టాలన్నా, మీడియా సమావేశం నిర్వహించాలన్నా, కార్యకర్తలతో మాట్లాడాలన్నా జిల్లా పార్టీ కార్యాలయాన్ని ఉపయోగించుకుంటారు. కానీ నెల్లూరులో మాత్రం ఎమ్మెల్యేలు తమ సొంత కార్యాలయాలను ఏర్పాటు చేసుకోవడం విశేషం. ఆనం, ప్రసన్నకుమార్ రెడ్డి, గౌతం రెడ్డి తదితరులు తమ సొంత కార్యాలయాలకే పరిమితమయ్యారు. కాకాణి జిల్లా అధ్యక్షుడిగా ఉండటం వల్లనే ఎమ్మెల్యేలు పార్టీ కార్యాలయానికి రావడం లేదన్న టాక్ విన్పిస్తుంది. ఎన్నికలకు ముందు నేతల్లో ఐక్యత కన్పించగా, ఇప్పుడు పూర్తిగా రివర్స్ గా నెల్లూరు జిల్లా వైసీపీలో కన్పిస్తుండటం విశేషం.