అనంత రాజకీయాల్లో కాల్వ శకం.. కలిసి వచ్చేనా…?
అనంతపురం జిల్లా రాజకీయాల్లో టీడీపీ ప్రస్థానం చాలా ప్రత్యేకం. కంచుకోటలుగా ఉన్న అనేక నియోజకవర్గాలు ఇక్కడ ఉన్నాయి. గత ఏడాది ఎన్నికల్లో జగన్ సునామీ భారీగా ఉన్నప్పటికీ.. [more]
అనంతపురం జిల్లా రాజకీయాల్లో టీడీపీ ప్రస్థానం చాలా ప్రత్యేకం. కంచుకోటలుగా ఉన్న అనేక నియోజకవర్గాలు ఇక్కడ ఉన్నాయి. గత ఏడాది ఎన్నికల్లో జగన్ సునామీ భారీగా ఉన్నప్పటికీ.. [more]
అనంతపురం జిల్లా రాజకీయాల్లో టీడీపీ ప్రస్థానం చాలా ప్రత్యేకం. కంచుకోటలుగా ఉన్న అనేక నియోజకవర్గాలు ఇక్కడ ఉన్నాయి. గత ఏడాది ఎన్నికల్లో జగన్ సునామీ భారీగా ఉన్నప్పటికీ.. హిందూపురం, ఉరవకొండ నియోజకవర్గాల్లో సైకిల్ పరుగులు తీసింది. ఇలాంటి జిల్లాలో ఇప్పుడు పార్టీని మరింతగా ముందుకు నడిపించేందుకు.. ప్రస్తుతం ఓ విధమైన నైరాశ్యంలో ఉన్న నాయకులను లీడ్ చేసేందుకు చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన పార్లమెంటరీ జిల్లా కమీటీలను ఏర్పాటు చేశారు. ఎవరూ ఊహించని విధంగా అనంతపురం మాజీ ఎంపీ, రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులుకు అనంతపురం పార్లమెంటరీ కమిటీ పగ్గాలు అప్పగించారు.
పార్టీకి విధేయతతో…
వివాదాలకు దూరంగా ఉండే నాయకుడు, పైగా విద్యావంతుడు, మాజీ జర్నలిస్టు కూడా అయిన కాల్వ శ్రీనివాసులు గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా పార్టీకి విధేయతతో పనిచేస్తున్నారు. మధ్యలో ఆయనకు వైసీపీ నుంచి ఆఫర్లు వచ్చాయని.. పార్టీ మారిపోవడం ఖాయమని ప్రచారం జరిగినప్పటికీ.. ఆయన మాత్రం పార్టీనే అంటిపెట్టుకుని ఉన్నారు. పైగా పార్టీ అధినేత చంద్రబాబు ఇచ్చిన పిలుపు మేరకు ఆయన ప్రతి కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. దీంతో ఆయన అనంతపురం పగ్గాలను అప్పగించారు చంద్రబాబు. ఇంత వరకు బాగానే ఉంది కానీ, జేసీ వర్గం దూకుడు ఎక్కువగా ఉన్న అనంతపురం పార్లమెంటు పరిధిలో కాల్వ శ్రీనివాసులు సమన్వయం ఎలా ? చేయగలరు.. జేసీ రాజకీయాలను ఎలా తట్టుకుంటారు? అనేది ప్రధాన ప్రశ్న.
జేసీ వర్గం హవా….
అనంతపురం అర్బన్ సహా.. తాడిపత్రి, కల్యాణదుర్గం, శింగనమల, గుంతకల్ నియోజకవర్గాల్లో జేసీ వర్గం హవా నేటికీ కొనసాగుతోంది. నిజానికి ఆయా నియోజకవర్గాల్లో కీలక నాయకులు ఉన్నప్పటికీ.. జేసీ కనుసన్నల్లోనే మొన్నటి ఎన్నికల వరకు కూడా కార్యక్రమాలు జరిగాయి. తాను ఎంపీగా ఉండడంతో ఆయా నియోజకవర్గాలపై ఆధిపత్యం చలాయించారు. అయితే, ఇప్పుడు కూడా అదే ధోరణితో.. అర్బన్ సహా శింగనమల, తాడిపత్రి నియోజకవర్గాలపై జేసీ కుమారుడు జేసీ పవన్ పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ పార్లమెంటు పరిధిలో జేసీ వర్గంతో పాటు మిగిలిన నేతల మధ్య సఖ్యత కుదర్చడం కాల్వ శ్రీనివాసులుకు మామూలుగా అయ్యే పనికాదు.
గ్రూపుల గోలతో……
అనంతపురం అర్బన్‌లో పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి జేసీ ఫ్యామిలీకి పడదు. తాడిపత్రిలో పాత టీడీపీ నేతలకు, జేసీ ఫ్యామిలీకి పొసగట్లేదు. శింగనమలలో గ్రూపుల గోల మామూలుగా లేదు. ఇవన్నీ తరచుగా పార్టీలో విభేదాలకు కారణమవుతున్నాయి. అయినప్పటికీ.. చంద్రబాబు ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. ఇక, ఇప్పుడు కాల్వ ఈ ఆధిపత్య ధోరణికి అడ్డుకట్ట వేసి.. నాయకులను లైన్లో పెట్టే బాధ్యతను ఏ మేరకు సమర్థవంతంగా పోషిస్తారో ? చూడాలి.