కధ ముగిసింది.. కమలం కసి తీర్చుకుంది
కమల్ నాధ్ పదిహేను నెలల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. పదిహేను నెలల కాలంలో ఆయన ప్రత్యర్థి పార్టీ బీజేపీ కంటే ఎక్కువగా తన సొంత పార్టీలోని శత్రువుపైనే [more]
కమల్ నాధ్ పదిహేను నెలల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. పదిహేను నెలల కాలంలో ఆయన ప్రత్యర్థి పార్టీ బీజేపీ కంటే ఎక్కువగా తన సొంత పార్టీలోని శత్రువుపైనే [more]
కమల్ నాధ్ పదిహేను నెలల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. పదిహేను నెలల కాలంలో ఆయన ప్రత్యర్థి పార్టీ బీజేపీ కంటే ఎక్కువగా తన సొంత పార్టీలోని శత్రువుపైనే దృష్టి పెట్టారు. అదే ఆయన ప్రభుత్వ పతనానికి కారణమయింది. కేవలం పదిహేను నెలల ముఖ్యమంత్రిగా మిగిలిపోవాల్సి వచ్చింది. మెజారిటీ లేదని స్పష్టంగా తెలిసిపోతుండటంతో ఆయనంత ఆయనే రాజీనామా చేసి కుర్చీ దిగిపోవాల్సి వచ్చింది.
బలంగా ఉందని తెలిసినా….
ప్రత్యర్థి పార్టీ బీజేపీ పదిహేనేళ్లు మధ్యప్రదేశ్ ను పాలించింది. అంత సుదీర్ఘకాలం పాలించినా ఆ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో చావుదెబ్బ తగలలేదు. అలాగని కాంగ్రెస్ కు అఖండ విజయమేమీ దక్కలేదు. ఒకవైపు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. మధ్యప్రదేశ్ బీజేపీలో శివరాజ్ సింగ్ చౌహాన్ వంటి సీనియర్ నేతలున్నారు. అసలు ఆ విషయాలనే కమల్ నాధ్ మర్చిపోయారు. కేవలం తన పార్టీలోని జ్యోతిరాదిత్య సింధియా మీదే పడ్డారు. సింధియాను టార్గెట్ చేయడంతోనే అసలు సమస్య బయలుదేరింది.
ఎమ్మెల్యేలను కాపాడుకోలేక…
బీజేపీ మీద కమల్ నాధ్ విరుచుకుడపటం హాస్యాస్పదంగా ఉంది. శత్రువు ఎప్పుడూ కాచుక్కూర్చుని ఉంటాడు. సొంత పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోవడం చేతకాక కమల్ నాధ్ రాజీనామా చేస్తూ బీజేపీ పై చేసిన విమర్శలు పెద్దగా పసలేనివిగా చెబుతున్నారు. కమల్ నాధ్ సరైన నేత అయితే తన ఎమ్మెల్యేలను కాపాడుకోగలగి ఉంటే ఈ పరిస్థిితి వచ్చేది కాదన్నది కూడా వాస్తవం. అయితే పదిహేను నెలల్లో అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలను కమల్ నాధ్ గుర్తించ లేకపోయారు.
సోనియా అండ ఉందన్న అహంతో…
కమల్ నాధ్ కు అంత తీరిక కూడా లేదంటున్నారు. ఎమ్మెల్యేలకు కమల్ నాధ్ అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడం, తనకు సోనియా గాంధీ అండ ఉందన్న అహం ఆయనను దెబ్బతీసిందన్నారు. దీనికి తోడు దిగ్విజయ్ సింగ్ కూడా అగ్నికి ఆజ్యం పోసినట్లు తోడయ్యారంటున్నారు. మొత్తం మీద సుదీర్ఘకాలం తర్వాత అధికారంలోకి వచ్చామన్న ఆనందం కాంగ్రెస్ కు ఎంతోసేపు మిగలలేదు. మరోసారి స్వయంకృతంతో కమలానికి రాష్ట్రాన్ని అప్పగించింది.