అడ్రస్ లేకుండానే పోయారే… కారణం ఇదేనా?
రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ఢిల్లీ ఆ పార్టీకి ప్రధాన వ్యూహకర్తగా.. చంద్రబాబు ఢిల్లీ వెళ్తే.. అన్ని ఏర్పాట్లూ చూసుకున్న నాయకుడిగా గుర్తింపు పొందిన సీనియర్ [more]
రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ఢిల్లీ ఆ పార్టీకి ప్రధాన వ్యూహకర్తగా.. చంద్రబాబు ఢిల్లీ వెళ్తే.. అన్ని ఏర్పాట్లూ చూసుకున్న నాయకుడిగా గుర్తింపు పొందిన సీనియర్ [more]
రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ఢిల్లీ ఆ పార్టీకి ప్రధాన వ్యూహకర్తగా.. చంద్రబాబు ఢిల్లీ వెళ్తే.. అన్ని ఏర్పాట్లూ చూసుకున్న నాయకుడిగా గుర్తింపు పొందిన సీనియర్ నాయకుడు కంభంపాటి రామ్మోహన్ రావు అడ్రస్ ఎక్కడ ? అని తెలుగు తమ్ముళ్లే చర్చించుకుంటున్నారు. మూడు దశాబ్దాల పాటు బాబుకు రైట్ హ్యాండ్‌గా ఉన్న ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నారు ? ఎక్కడ ఉన్నారు ? అనే విషయాలు ఆసక్తిగా మారాయి. పార్టీ కీలక నాయకుడిగా, ప్రధాన కార్యదర్శిగా.. ఢిల్లీలో ప్రభుత్వ సలహాదారుగా కూడా కంభంపాటి రామ్మోహన్ రావు వ్యవహరించారు. 2004 ఎన్నికలకు ముందు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఢిల్లీలో కీలకంగా ఉండేవారు. ఇక 2014లో పార్టీ ఏపీలో అధికారంలోకి వచ్చాక కూడా ముందు కంభంపాటిదే హవా నడిచింది. ఆ తర్వాత సుజనా చౌదరి కావాలనే కంభంపాటిని సైడ్ చేసేశారని అంటారు.
బాబుకు సన్నిహితుడిగా….
పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టీవీ చర్చల్లోనూ ఆయన పాలు పంచుకుని పార్టీ వాయిస్‌ను… ప్రభుత్వ వాయిస్‌ను కూడా కంభంపాటి రామ్మోహన్ రావు వినిపించారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్న కంభంపాటి పార్టీ అధికారంలో ఉన్న సమయంలో వైసీపీకి వ్యతిరేకంగా ఢిల్లీలో చక్రం తిప్పారు. ఈ క్రమంలోనే ఆయన తనకు రాజ్య సభ సీటు ఇవ్వాలని ఆకాంక్షించారు. ఈ విషయాన్ని చంద్రబాబుకు సైతం విన్నవించారు. అయితే.. చూద్దాం చేద్దాం.. అన్న చంద్రబాబు పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇస్తానని చెప్పినా కంభంపాటి రామ్మోహన్ రావు మాత్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నాడు కంభంపాటికి దక్కాల్సిన రాజ్యసభ సీటు అప్పటికే పార్టీకి, ప్రభుత్వానికి న్యాయ సలహాలు, ఇటు హైకోర్టు, అటు సుప్రీం కోర్టులోను పార్టీ వాయిస్ వినిపించిన కనకమేడల రవీంద్ర కుమార్‌కు బాబు కట్టబెట్టారు.
ఆయన వల్లనే…?
ఈ క్రమంలో కొన్ని కొన్ని కేసుల్లో చంద్రబాబుకు అనుకూలంగా తీర్పులు వచ్చేలా కనకమేడల బలమైన వాదన వినిపించారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ఆయన చేసిన లాబీయింగ్‌కు తలొగ్గి కంభంపాటి రామ్మోహన్ రావుని పక్కన పెట్టారు. మళ్లీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తనకు అవకాశం చిక్కుతుందని అనుకున్న కంభంపాటి రామ్మోహన్ రావుకి నిరాశే ఎదురైంది. ఇక, గత ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం తర్వాత ఆయన సైలెంట్ అయిపోయారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో….
కంభంపాటి రామ్మోహన్ రావు పార్టీ తరఫున వాయిస్ కూడా వినిపించడం లేదు. ఎక్కడా కనీసం కనిపించడమూలేదు. ఒకప్పుడు ఏ మీడియా చర్చల్లో చూసినా కంభంపాటి టీడీపీ మీద ఈగ వాలనిచ్చే వారే కాదు .. అలాంటిది ఆయనో ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు తప్పా బయటకు రావడం లేదు. టీడీపీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తుందన్న గ్యారెంటీ లేదు. గెలిచినా ఆయనకు మళ్లీ పదవులొస్తాయన్న గ్యారెంటీ కూడా లేదు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన అనవసరంగా నోరు చించుకున్నా ఉపయోగం లేదనే సైలెంట్ అయ్యారనే వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం.