ఉండలేక…వెళ్లలేక…?
కామినేని శ్రీనివాసరావు. గత ఐదేళ్ల చంద్రబాబు పాలనలో తొలి నాలుగున్నరేళ్లు.. కూడా ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి చక్రం తిప్పారు. కృష్ణాజిల్లా కైకలూరు నియోజకవర్గం నుంచి బీజేపీ [more]
కామినేని శ్రీనివాసరావు. గత ఐదేళ్ల చంద్రబాబు పాలనలో తొలి నాలుగున్నరేళ్లు.. కూడా ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి చక్రం తిప్పారు. కృష్ణాజిల్లా కైకలూరు నియోజకవర్గం నుంచి బీజేపీ [more]
కామినేని శ్రీనివాసరావు. గత ఐదేళ్ల చంద్రబాబు పాలనలో తొలి నాలుగున్నరేళ్లు.. కూడా ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి చక్రం తిప్పారు. కృష్ణాజిల్లా కైకలూరు నియోజకవర్గం నుంచి బీజేపీ టికెట్‌పై 2014లో విజయం సాధించిన కామినేని.. బీజేపీ-టీడీపీ మిత్ర పక్ష ప్రభుత్వం ఏర్పాటు కావడంతో ఆయన చంద్రబాబు ఆశీస్సులతో మంత్రి పదవిని దక్కించుకున్నారు. అయితే, ఆయన బీజేపీలో ఉన్న మనసంతా టీడీపీలోనే ఉందనే వ్యాఖ్యలు తరచుగా వినిపించేవి. ఎందుకంటే ఆయన టీడీపీ వ్యవస్థాపక సభ్యుడాయే. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఉన్న ఏడుగురు వ్యవస్థాపక సభ్యుల్లో కామినేని ఒకరు. ఆ తర్వాత అన్నగారి ఆశీస్సులతో ఎమ్మెల్సీ కూడా అయ్యాడు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు బీజేపీ నేతలను టార్గెట్ చేసినప్పుడు, కేంద్రంలోని బీజేపీ పెద్దలను తిట్టినప్పుడు కూడా కామినేని బీజేపీ నేత అయినప్పటికీ.. మౌనంగానే ఉండిపోయారు.
బీజేపీలో చేరి…..
దీంతో కామినేని శ్రీనివాస్ పై సోషల్ మీడియాలో కూడా అనేక సెటైర్లు వెల్లువలా వచ్చాయి. ఇక, ఆయన రాజకీయ ప్రస్థానాన్ని ఒకసారి చూస్తే.. ఆయన వాస్తవానికి టీడీపీకి చెందిన నాయకుడు. ఆ తర్వాత పార్టీలు మారినా ఆయనలో టీడీపీ రక్తం మారలేదు. చాలా కాలం రాజకీయాలకు దూరంగా ఉండి… ఆతర్వాత ప్రజారాజ్యం రావడంతో ఆయన దానిలోకి జంప్ చేశారు. ప్రజారాజ్యాన్ని అనతికాలంలోనే కాంగ్రెస్‌లో విలీనం చేయడంతో ఈయన బయటకు వచ్చి బీజేపీలో చేరారు. 2014లో బీజేపీ టికెట్‌పై పోటీ చేసి విజయం సాదించి.. టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు.
పోటీ చేయనని చెప్పి….
2014 ఎన్నికలకు ముందు కామినేని శ్రీనివాస్ ని బీజేపీలోకి పంపి… అక్కడ తమ సిట్టింగ్ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణను కాదని మరీ వెంకయ్య ఆశీస్సులతో కైకలూరు సీటు ఇప్పించి గెలిపించే బాధ్యత బాబే తీసుకున్నారన్న టాక్ కూడా ఉంది. ఆ తర్వాత బీజేపీలో కోటాలో మంత్రి పదవి కూడా వచ్చేసింది. అయితే, ఆయన కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కావడంతో ఆయనకు టీడీపీపై మమకారం ఎక్కువనే వ్యాఖ్యలు తరచుగా వినిపిస్తూ ఉండేవి. ఇక, ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి? అనేది చర్చకు వస్తున్న అంశం. ఎన్నికలకు ముందు ఆయన తాను రాజకీయాల్లో పోటీ చేసే ప్రశ్న లేదని కుండబద్దలు కొట్టారు. అయితే, రాజకీయాల్లో ఉంటానని చెప్పారు.
బయటకు వెళ్లలేక…
కానీ, తానుప్రాతినిధ్యం వహి స్తున్న బీజేపీ తరఫున ఇప్పటి వరకు బలమైన గళం వినిపించింది లేదు. బీజేపీని ప్రత్యేక హోదా విషయంలోను, రాష్ట్ర విభజన హామీలను నెరవేర్చని విషయంలోను కూడా అన్ని పార్టీలు ఇరుకున పెట్టి వ్యాఖ్యలు సంధించినప్పుడు కూడా కామినేని శ్రీనివాస్ పన్నెత్తు మాట అనలేదు. దీంతో బీజేపీ నేతలు కామినేనిని పట్టించుకునే పరిస్థితి ఎక్కడా కనిపించలేదు. పోనీ, తనకు నచ్చిన పార్టీ టీడీపీలోకి వెళ్లే ఆలోచన కూడా కామినేని చేయడం లేదు. ఒక వేళ వెళ్తామని చెప్పినా.. అక్కడ ఉన్న వారే బయటకు వస్తుంటే.. ఈయన వెళ్లడం ఎందుకు? అనే ప్రశ్న తెరమీదికి వస్తుంది. మొత్తానికి కామినేని పొలిటికల్ ఫ్యూచరేంటో చూడాలి.