గులాబీ గొంతెత్తింది…మరి జగన్.?
రెండు తెలుగు రాష్ట్రాల ప్రాంతీయ రాజకీయాల మీద కాషాయ పడగ నీడ ఎత్తేందుకు సిధ్ధంగానే ఉంది. దానికి సంబంధించి సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. ఎక్కడా రాజీ లేకుండా [more]
రెండు తెలుగు రాష్ట్రాల ప్రాంతీయ రాజకీయాల మీద కాషాయ పడగ నీడ ఎత్తేందుకు సిధ్ధంగానే ఉంది. దానికి సంబంధించి సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. ఎక్కడా రాజీ లేకుండా [more]
రెండు తెలుగు రాష్ట్రాల ప్రాంతీయ రాజకీయాల మీద కాషాయ పడగ నీడ ఎత్తేందుకు సిధ్ధంగానే ఉంది. దానికి సంబంధించి సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. ఎక్కడా రాజీ లేకుండా అన్ని అవకాశాలను బీజేపీ చూసుకుంటోంది. ఆరేళ్ల కేసీఆర్ పాలనను, ఆరు నెలల జగన్ పాలనను ఒక్కటిగానే చూస్తూ బాణాలు ఎక్కుపెడుతోంది. అయితే ఎవరు దొరుకుతారు, ఎక్కడ చిక్కుతారు అన్నదే ఇక్కడ పెద్ద ప్రశ్న. ఇవన్నీ ఇలా ఉంటే కేసీఆర్ మాత్రం రెండు అడుగులు ముందుకు ఒక అడుగు వెనక్కు వేస్తూ బీజేపీతో వ్యూహాత్మక రాజకీయ వైఖరిని అవలంబిస్తున్నారు. ఆయన రాజకీయ అనుభవం అపారం. కాబట్టి ఆయన లెక్కలు కూడా వేరేగా ఉంటున్నాయి.
దగ్గరగా… దూరంగా….
నిజానికి కేసీఆర్, బీజేపీ రాజకీయం చూసుకుంటే దగ్గరగా దూరంగా అన్నట్లుగా కనిపిస్తోంది. కేంద్ర నాయకత్వంతో కేసీఆర్ చెలిమి చేస్తున్నట్లుగా కనిపిస్తూనే మరో వైపు తగినంత దూరాన్ని కూడా పాటిస్తున్నారు. అది అప్పటి అవసరాలకు తగినట్లుగానే సాగుతున్న రాజకీయ కధగా ఉంది. ఈ మధ్యనే ఢిల్లీ వెళ్ళి అమిత్ షాని కలసి వచ్చిన కేసీఆర్ కేంద్రంతో మంచి సంబంధాలకు ప్రయత్నం చేస్తున్నారని అనుకుంటూండగానే మరో వైపు నుంచి కత్తులు దూస్తున్నారు. కేంద్రంతో వియ్యానికి రెడీ అంటూనే మరో నోటితో కయ్యానికి సిధ్ధమని చెబుతున్నారు. ఈ దాగుడుమూతల రాజకీయం మోడీ షాలకే బహుశా అర్ధమవుతుందేమో.
గట్టిగానే కేటీఆర్….
ఉత్తరాది, దక్షిణాది వివక్ష అంటూ కేసీఆర్ రాజకీయ వారసుడు, మంత్రి కేటీఆర్ ఈ మధ్యన ఓ మీటింగులో గట్టిగానే తగులుకున్నారు. అన్ని ప్రాజెక్టులు, అభివ్రుద్ధి పధకాలు ఉత్తరాదికేనా అంటూ ఆయన బాగానే గర్జించారు. కారిడార్లు హైద్రాబాద్, బెంగుళూరు, చెన్నైల మధ్యన నడపరాదా? అని ఆయన నిలదీస్తున్నారు. ఇది ఒక విధంగా వివక్షే అన్నట్లుగా కూడా అర్ధం వచ్చేలా ఆయన మాట్లాడారు. అంటే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన ఆరేళ్ళ కాలంలో ఎపుడూ లేని విధంగా టీఆర్ఎస్ తొలిసారి కేంద్రం మీద ధాటిగానే గొంతొత్తిందనుకోవాలి. ఒక పధకం ప్రకారమే కేటీఆర్ ఇలా నోరు చేసుకున్నారని విశ్లేషణలు ఉన్నాయి.
ఏపీ సంగతేంటి…?
ఇక ఏపీ విషయానికి వస్తే బీజేపీ చుట్టూనే రాజకీయం మొత్తం తిరుగుతోంది. తెలంగాణాతో పోలిస్తే ఒక్క ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ ప్రజల నుంచి గెలిచిన వారు లేరు కానీ తెలుగుదేశం, జనసేన పార్టీలు పొత్తుల కోసం కాషాయ జపం చేస్తున్నాయి. ఇక వైసీపీ ఇంతవరకూ బీజేపీని పల్లెత్తు మాట అనలేదు. జగన్ కూడా వేచి చూసే ధోరణిలో ఉన్నారు. కేంద్రం వద్ద నుంచి ఒక్క రూపాయి సాయమైనా పొందాలన్నది ఆయన ప్రస్తుత ఆలోచన. అయితే ఎల్లకాలం పరిస్థితులు ఒక్కలా ఉండవు, పైగా బీజేపీ వైపు నుంచి కత్తులే దూస్తున్నారు కాబట్టి జగన్ విషయంలో ఇవాళ కాకపోయినా రేపు అయినా బలమైన గళం ఏపీకి జరుగుతున్న అన్యాయంపైన వినిపించే అవకాశమైతే ఉంటుందనుకోవడానికి అవకాశమైతే ఉంది. అది ఎప్పుడన్నదే చూడాలి.