పక్కాగా…లెక్కలతో సహా రెడీ అవుతున్నారు
కేంద్ర ప్రభుత్వం తాము రాష్ట్రానికి వేల కోట్లు నిధులు ఇచ్చామని చెబుతోంది. రాష్ట్రం మాత్రం తమకు రాలేదంటోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య గత కొంతకాలంగా సాగుతున్న [more]
కేంద్ర ప్రభుత్వం తాము రాష్ట్రానికి వేల కోట్లు నిధులు ఇచ్చామని చెబుతోంది. రాష్ట్రం మాత్రం తమకు రాలేదంటోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య గత కొంతకాలంగా సాగుతున్న [more]
కేంద్ర ప్రభుత్వం తాము రాష్ట్రానికి వేల కోట్లు నిధులు ఇచ్చామని చెబుతోంది. రాష్ట్రం మాత్రం తమకు రాలేదంటోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య గత కొంతకాలంగా సాగుతున్న మాటల యుద్ధమిది. అయితే కేంద్ర ప్రభుత్వానికి గట్టి కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు కేసీఆర్. అసెంబ్లీ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం బండారాన్ని బయటపెట్టేందుకు రెడీ అయిపోయారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో కేంద్రం ప్రభుత్వం నుంచి గత ఆరేళ్లలో తెలంగాణకు ఎంత వచ్చిందీ పక్కాగా లెక్కలతో సహా చెప్పేయనున్నారు కేసీఆర్.
ఎంతో చేశామంటూ…..
ఇటీవల కేంద్ర ప్రభుత్వం గత ఆరేళ్లలో తెలంగాణకు లక్షా యాభై వేల కోట్లు ఇచ్చామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయాన్ని ప్రకటించారు. అయతే దీనిని కేసీఆర్ సర్కార్ ఖండిస్తుంది. తెలంగాణ నుంచి రెండు లక్షల 70 వేల కోట్ల రూపాయలను పన్నుల రూపంలో వసూలు చేసిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇవ్వడంలో మాత్రం మొండిచేయి చూపుతుందంటున్నారు. కేసీఆర్ కూడా కేంద్ర ప్రభుత్వం పెద్దలు చేస్తున్న ప్రకటనలపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఏమీ చేయలేదంటూ….
తెలంగాణలో బీజేపీ బలపడేందుకే తప్పుడు లెక్కలు చెబుతోందని కేసీఆర్ అభిప్రాయ పడుతున్నారు. అందుకే బడ్జెట్ సమావేశాల్లో కేంద్రం నుంచి వచ్చిన నిధుల వరద ఏంటో తానే లెక్కలతో సహా వివరిస్తానంటున్నారు గులాబీ బాస్. ఇప్పటికే కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం నుంచి గత ఆరేళ్లలో వచ్చిన నిధుల జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించారు. మంత్రులకు కూడా ఈ విషయంపై స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. తొలి ఐదేళ్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కొంత సయోధ్య కన్పించినా రెండో సారి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో పడటం లేదు. పదే పదే కేంద్రంతో వైరాన్ని కోరుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా అదే స్థాయిలో కేసీఆర్ పాలనపై విరుచుకుపడుతోంది.
కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి…..
కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా చేయూత ఇవ్వడం లేదంటున్నారు కేసీఆర్. తాము పన్నుల రూపంలో కడుతున్న ఆరేళ్లలో రెండు లక్షల 70 వేల కోట్లు చెల్లించామంటున్నారు. అయినా కేంద్ర ప్రభుత్వం మాత్రం రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన వాటా దక్కడం లేదంటున్నారు. అందుకే రానున్న బడ్జెట్ సమావేశాల్లో కేసీఆర్ దీనిపై పూర్తి స్థాయిలో ప్రజలకు సమాచారం అందించనున్నారు. మొత్తం మీద వచ్చే తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో కేంద్రం గుట్టును బయటపెడతామంటున్నాయి గులాబీ పార్టీ శ్రేణులు. మరి లెక్కలు పక్కాగా చెబితే కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.