కేసీయార్టీసీ…. పొలిటికల్ రూటేనా?
మొత్తానికి తెలంగాణాలో ఆర్టీసీ రధ చక్రాలు కదిలాయి. జగన్నాధ రధ చక్రాలను సైతం భూమికి తెప్పించే సత్తా ఉన్న గులాబీ బాస్ ఎర్ర బస్సుకు మాత్రం రెడ్ [more]
మొత్తానికి తెలంగాణాలో ఆర్టీసీ రధ చక్రాలు కదిలాయి. జగన్నాధ రధ చక్రాలను సైతం భూమికి తెప్పించే సత్తా ఉన్న గులాబీ బాస్ ఎర్ర బస్సుకు మాత్రం రెడ్ [more]
మొత్తానికి తెలంగాణాలో ఆర్టీసీ రధ చక్రాలు కదిలాయి. జగన్నాధ రధ చక్రాలను సైతం భూమికి తెప్పించే సత్తా ఉన్న గులాబీ బాస్ ఎర్ర బస్సుకు మాత్రం రెడ్ సిగ్నల్ చూపించారు. అలా ఇలా కాదు ఏకంగా రెండు నెలల పాటు సమ్మె చేసినా కిమ్మనలేదు. నాకేం సంబంధం అన్నట్లుగా మొండికేశారు. మధ్యలో పండగలు ఎన్ని వెళ్ళినా మీ పస్తులు మీవే అంటూ పట్టించుకోలేదు. మరో వైపు ఆర్టీసీని ప్రైవేటు చేస్తానని హూంకరించారు. సమ్మె చేస్తారా ఇక మీకు ఉద్యోగాలు ఊడిపోయాయంతే అంటూ గర్జించారు. ఇవన్నీ విన్న వారు నిజమేనని అనుకున్నారు. ఎందుకంటే కేసీఆర్ ఎంత చెబితే అంత కాబట్టి. అటువంటి కేసీఆర్ సమ్మె విరమించాం, బేషరతుగా చేరిపోతాం మొర్రో అన్నా కూడా రావద్దంటూ గేట్లు మూసేశారు. ఇక యాభైవేల మంది కార్మికులు, వారి మీద అధారపడిన వారితో సహా రెండున్నర లక్షల మంది రోడ్డున పడినట్లేనని అనుకున్నారు. సరిగ్గా అక్కడే కధని కేసీఆర్ రివర్స్ లో అ తిప్పేశారు.
ఆర్టీసీ డ్రైవరుగా…..
కేసీఆర్ పూర్వాశ్రమంలో రవాణా శాఖా మంత్రిగా పనిచేశారు. ఆయనకు ఆ శాఖలో మంచి అనుభవం ఉంది. దాంతో ఆయన ఆర్టీసీని తన కళ్ళతో చూడడంతోనే సమ్మె హుష్ కాకీ అంటూ ఎగిరిపోయింది కాదు అలా ఎగరగొట్టారు. ఆర్టీసీ బస్సుకు తాను సారధిగా ఉండగా ఎవరో డ్రైవర్ ఎందుకన్నది కేసీఆర్ ఆలోచన అన్నమాట. ఆర్టీసీ యూనియన్లు కట్టి తనకే సవాల్ చేస్తే ఢిల్లీనే గడగడలాడించినా కేసీఆర్ ఊరుకుంటారా. మీకు జీతాలు, జీవితాలు నేను అయితే ఎవరినో ముందు పెట్టుకుని సమ్మెలేంటి అన్నారు కార్మికుల ఆత్మీయ సమావేశంలో కేసీఆర్. ఆర్టీసీ చక్రాన్ని కదిపేది, కదిలించేది నేనే అంటూ కేసీఆర్ గీతాబోధన చేశాక ఖాకీ కార్మికులకు అసలు విషయం అర్ధమైంది. కేసీఆర్ కోపం అత్త మీదనేనని, యూనియన్లు, వారిని ఆడించే ప్రతిపక్ష రాజకీయ నాయకుల మీదనేనని బాగా గ్రహించారు. అంతే వెన్నముద్దల్లా పెద్దాయన ముందు కరిగిపోయారు. దెబ్బకు యూనియన్లు, వాటి కధలు చిత్తు అయిపోయాయి.
గులాబీ బస్సులేనట….
సాధారణంగా తెలుగు రాష్ట్రాల్లోని ఆర్టీసీని ఎర్ర బస్సులు అంటారు. ఎపుడైతే కేసీఆర్ చేతులు కలిపి ఆర్టీసీ కార్మికూలను గుండెలకు హత్తుకున్నారో ఎర్ర రంగు కాస్తా కరిగిపోయి గులాబీ మెరుపులు మెరుస్తోందంటునారు. కేసీఆర్ ని చెడ్డ అంటూ చెడుగుడు ఆడిన కార్మికులు ఆయనే మా బాస్ అంటున్నారు. పెద్దాయన ఎంత చెబితే అంత అంటున్నారు. ఈ దెబ్బకు యూనియన్ల కుర్చీలు గల్లంతైపోయాయి. కేసీఆర్ విషయంలో ఇదే రాజనీతి అని అందరూ అంటున్నారు. ఆర్టీసీలో ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షల్లో ఉన్న కార్మికులను కేసీఆర్ ఒక్క ఆత్మీయ మీటింగుతో తనవారు అనిపించేసుకున్నారు. మీ సమస్యలకు నాది పూచీకత్తు అంటూ భరోసా ఇచ్చారు. తనతోనే సవాల్ చేసిన యూనియన్లకు కిరీటాలే లేకుండా చేసి పారేశారు. తెలంగాణా ఆర్టీసీని కాస్తా కేసీయార్టీసీగా మార్చేసుకున్నారు. అడిగినవి అడగనివి వరాలెన్నోకూడా ప్రకటించి శభాష్ సీఎం అని పొగిడించుకున్నారు. మొత్తం ఎపిసోడ్ లో చెడిపోయింది ఎవరంటే యూనియన్ నాయకులే. అంతే కదా మరి కేసీఆర్ మజాకానా.