ఆలస్యం.. అయినా అవశ్యం
ఎట్టకేలకు కేసీఆర్ స్పందించారు. కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల నుంచీ అమలు చేస్తున్న ఆర్థికంగా బలహీనవర్గాలకు పదిశాతం రిజర్వేషన్ల అమలుకు పచ్చజెండా ఊపారు. గతంలో సాంఘికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా [more]
ఎట్టకేలకు కేసీఆర్ స్పందించారు. కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల నుంచీ అమలు చేస్తున్న ఆర్థికంగా బలహీనవర్గాలకు పదిశాతం రిజర్వేషన్ల అమలుకు పచ్చజెండా ఊపారు. గతంలో సాంఘికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా [more]
ఎట్టకేలకు కేసీఆర్ స్పందించారు. కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల నుంచీ అమలు చేస్తున్న ఆర్థికంగా బలహీనవర్గాలకు పదిశాతం రిజర్వేషన్ల అమలుకు పచ్చజెండా ఊపారు. గతంలో సాంఘికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా వెనకబడిన వర్గాలనే ఉద్దేశంతో ఎస్సీ,ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు కల్పించారు. తొలిదశలో ఎస్సీ,ఎస్టీలకే పరిమితమైన రిజర్వేషన్లు తర్వాత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ముప్ఫై ఏళ్ల నుంచి ఓబీసీలకు సైతం దక్కడం మొదలైంది. తర్వాత దశలో అనేక రాజకీయాలు చోటు చేసుకుని ముస్లింలకూ రిజర్వేషన్లు ఇవ్వాలనే డిమాండ్లు మొదలయ్యాయి. ఏదేమైనప్పటికీ ఏ సామాజిక వర్గంలో ఉన్నా పేదవాడిని పేదవాడిగా గుర్తించి పైకి తేవాలనే ఇంగితజ్ణానం పార్టీలకు, ప్రభుత్వాలకు ఇంతకాలం కొరవడింది. దాంతో ఆర్థిక ప్రాతిపదికను తీసుకోవడానికి సర్కారులు సొంతంగా సాహసం చేయలేదు. కొత్త రిజర్వేషన్లతో ఇప్పటికే వాటి ప్రయోజనం పొందుతున్న వర్గాలు దూరమైపోతాయేమోననే అనుమానంతో వెనకడుగు వేశాయి. పైపెచ్చు ఓటు బ్యాంకు పాలిటిక్స్. ఆర్థికంగా వెనకబడిన తనం అంటే ఏ ఒక్క కులమో రాదు. అందువల్ల వారు పక్కా ఓటు బ్యాంకుగా మారతారనే నమ్మకమూ పార్టీలకు లేదు. అందుకే ఉదాసీనంగా, పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించాయి రాజకీయ పార్టీలు.
కమలం పంట పండింది…
2019 ఫిబ్రవరి నుంచే పదిశాతం రిజర్వేషన్లను ఆర్థిక వెనకబాటు తనం ప్రాతిపదికగా కేంద్రం అమలు చేస్తోంది. ఇదేదో నిస్వార్థంగా తీసుకున్న చర్య కాదు. ఎన్నికలకు ముందు ఉన్నత సామాజిక వర్గాలను ఆకట్టుకోవడానికి అనుసరించిన రాజకీయ వ్యూహం. ఏదేమైనప్పటికీ రాజకీయ పార్టీలు ఓట్ల కోణంలోనే చూస్తాయి. అయినా సమాజంలో అన్యాయానికి గురవుతున్న వారికి న్యాయం జరిగితే అంతే చాలు. అదే బీజేపీకి ఓట్ల పంట పండించింది. ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీలను పక్కనపెడితే ఏ రిజర్వేషన్ కోటాలోకి రాని ఓసీలు దేశవ్యాప్తంగా 28శాతం వరకూ ఉన్నారు. ఇందులో పదకొండు శాతం మాత్రమే ఆర్థిక స్థితిగతుల రీత్యా బాగున్నారు. మిగిలిన 17శాతం ఆర్థికంగా తీవ్ర దుర్భర స్థితినే చవిచూస్తున్నారనేది అంచనా. ఈ లోపాన్ని పూరించేందుకు పూనుకోవడంతో బీజేపీకి బాగా కలిసి వచ్చింది. కేంద్రంలో డెబ్బైఏళ్లుగా అధికారంలో ఉన్న ఏపార్టీలు చేయని సాహసం నరేంద్రమోడీ నేతృత్వంలోని ప్రభుత్వం చేయగలిగింది. వాజపేయి నాయకత్వంలోని ఎన్డీఏ సైతం ఈవిషయంలో సాహసించలేకపోయింది.
మారని పరిస్థితులు…
స్వాతంత్ర్యం వచ్చినప్పట్నుంచి ఎస్సీ,ఎస్టీలకు రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి. కొన్ని శతాబ్దాలపాటు ఆ వర్గాలు వేధింపులకు గురి కావడంతో సంఘంలోని మిగిలినవారితో సమానంగా ఉన్నతదశకు చేరాలనే లక్ష్యంతో రిజర్వేషన్ సదుపాయం కల్పించారు. తొలుత పదేళ్లు అనుకున్నది కాస్త శాశ్వతంగా మారిపోయింది. ఆయావర్గాల్లోని ప్రజలందరికీ రిజర్వేషన్ ఫలాలు అంది ఉంటే ఇప్పటికే సమాజంలో పెనుమార్పు వచ్చి ఉండాలి. కానీ రిజర్వేషన్ ఫలాలు అందుకుని పైకి ఎదిగిన వారు , వారి వారసులు తరతరాలుగా వాటిని అనుభవిస్తూ తమ సామాజిక వర్గంలోని ఇతరులకు చేరనివ్వడం లేదు. ఫలితంగా ఇప్పటికీ ఆయావర్గాల్లోని 70శాతం ప్రజలు దారిద్ర్యంలోనే మగ్గుతున్నారు. ఈలోపాన్ని సవరించే సాహసం ప్రభుత్వాలు చేయడం లేదు. ప్రభుత్వ రిజర్వేషన్ పొంది ఉన్నతస్థాయికి ఎదిగిన వ్యక్తి కుటుంబ సభ్యులు తిరిగి మళ్లీ రిజర్వేషన్ సదుపాయం పొందకుండా నిరోధించాలి. అప్పుడే అదే సామాజిక వర్గంలోని ఇతరులకు ప్రయోజనం సమకూరుతుంది.
బీజేపీ ఒత్తిడి…
తెలంగాణలో ముస్లింలకు 12 శాతం , ఎస్టీలకు పదిశాతం రిజర్వేషన్ పెంచుతూ కేసీఆర్ 2017 ఏప్రిల్ లోనే నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు శాసనసభ తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపించింది. రాజ్యాంగ విరుద్ధమంటూ కేంద్రం తిరస్కరించడంతో కేంద్రం చేసిన చట్టాన్ని కూడా కేసీఆర్ పక్కనపెట్టేశారు. ఈ చట్టం విషయంలో స్థానికంగా నిర్ణయించుకుని అమలు చేసే స్వేచ్ఛ ఉండటంతో కేసీఆర్ తన రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరించారు. తాజాగా బీజేపీ నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ఇకపై ప్రతి ఎన్నికలోనూ ఉన్నత సామాజిక వర్గాల ఆర్థిక వెనకబాటు పై రిజర్వేషన్లు చర్చనీయాంశం కాబోతున్నాయి. కమలం పార్టీ ప్రధాన ఇష్యూ చేయబోతోంది. దీనిపై ఇప్పటికే బీజేపీ రాష్ట్రంలో వాయిస్ పెంచింది. రాజకీయంగా కేసీఆర్ కు ఎదురుదెబ్బలు మొదలయ్యాయి. ముస్లిం, ఎస్టీ రిజర్వేషన్ల అంశాన్ని మాత్రమే నమ్ముకుంటే లాభం లేదని ఆయన గ్రహించారు. ఫలితంగా ఆర్థిక బలహీన వర్గాల రిజర్వేషన్ల అమలుకు పూనుకుంటున్నారు. ఇది మంచి నిర్ణయమే. అయినప్పటికీ ఒకసారి రిజర్వేషన్ పొందిన కుటుంబ సభ్యులు, వారసులు తిరిగి అర్హత సాధించకుండా చూస్తేనే మేలు. ఇప్పటికి అమలవుతున్న ఎస్సీ,ఎస్టీ రిజర్వేషన్లలో అనేక లోపాలున్నాయి. సంస్కరణలు చేసేందుకు ప్రభుత్వాలు భయపడుతున్నాయి. ఒకసారి రిజర్వేషన్ సదుపాయం పొందిన కుటుంబాలే నూటికి డెబ్భై శాతం మళ్లీ మళ్లీ ప్రయోజనం పొందుతున్నట్లు సామాజిక సర్వేలు వెల్లడిస్తున్నాయి. అందువల్ల ఈ ఆర్థిక రిజర్వేషన్లను అయినా ఆ తరహా దురుపయోగం కాకుండా సమాజం మొత్తానికి విస్తరించేలా చూడటం మంచిది.
-ఎడిటోరియల్ డెస్క్