అట్లుంటది కేసీయార్తోని... ముచ్చట!
‘లాస్ట్ పంచ్ మనదైతే వచ్చే ఆ కిక్కే వేరప్పా’ అన్న డైలాగ్‌లాగే ఫస్ట్ గోల్ మనదైతే వచ్చే కిక్కు కూడా వేరు. కేసీయార్ ఆట మొదలు పెట్టారు. ఫస్ట్ గోల్ వేశారు. అధికారంలోకి వచ్చి తీరుతామన్న ధీమాలో ఉన్న రెండు జాతీయ పార్టీలకు సవాల్ విసిరారు. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అడ్వాంటేజీని తనకు అనుకూలంగా మలచుకుంటున్నారు.
‘లాస్ట్ పంచ్ మనదైతే వచ్చే ఆ కిక్కే వేరప్పా’ అన్న డైలాగ్‌లాగే ఫస్ట్ గోల్ మనదైతే వచ్చే కిక్కు కూడా వేరు. కేసీయార్ ఆట మొదలు పెట్టారు. ఫస్ట్ గోల్ వేశారు. అధికారంలోకి వచ్చి తీరుతామన్న ధీమాలో ఉన్న రెండు జాతీయ పార్టీలకు సవాల్ విసిరారు. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అడ్వాంటేజీని తనకు అనుకూలంగా మలచుకుంటున్నారు.
కేసీయార్ వ్యూహాలు ఎప్పుడూ ఇలానే ఉంటాయి. ప్రత్యర్థికి ఆట అర్థమయ్యేలోగానే స్కోర్ సాధించడం ఆయన స్పెషాలిటీ. ఈ ఏడాది ఎన్నికలకు నాలుగు నెలల ముందే భారాస అభ్యర్థులను ప్రకటించడం ద్వారా తెలంగాణ ముఖ్యమంత్రి రాబోయే సమస్యలను ముందస్తుగా ఎదుర్కోడానికి ప్లాన్ చేసుకున్నారు. టిక్కెట్ దక్కని వాళ్లు తిరుగుబావుటా ఎగురవేసినా, వాళ్లతో ‘డీల్’ చేయడానికి కావల్సినంత సమయం దొరుకుతుంది. భారాస అభ్యర్థులు జనంలోకి వెళ్లి, గెలుపు అవకాశాలను పెంచుకునే అవకాశం ఉంటుంది. ప్రాంతీయ పార్టీలతో పోలిస్తే కాంగ్రెస్, భాజపా లాంటి పార్టీలకు అంతర్గత కలహాలు ఎక్కువ. టిక్కెట్లు ఆశించే వారు కూడా ఎక్కువగానే ఉంటారు. టిక్కెట్ రాని అభ్యర్థులు తమ పార్టీ అభ్యర్థికి ఓటమికి ఇతోధికంగా సాయపడతారు. ఇలా ఇతర పార్టీలు స్వీయ విధ్వంసానికి పాల్పడుతూ ఉంటే, భారాస అభ్యర్థుల గెలుపు నల్లేరు మీద నడక అవుతుంది.
నాలుగు నెలల ముందే తమకు టిక్కెట్ కన్ఫర్మ్ కావడంతో భారాస అభ్యర్థులు జనాల మధ్య ఉంటారు. బలహీనంగా ఉన్న ప్రాంతాల మీద దృష్టి పెట్టి విజయావకాశాలను పెంచుకోవచ్చు. గెలుపు వ్యూహాలకు పదును పెట్టే వెసులుబాటు చిక్కుతుంది. ఏ రకంగా చూసినా ప్రస్తుతానికి కేసీయార్ ప్రత్యర్థులపై పైచేయి సాధించినట్లే.
ఇలాంటి ‘ముందస్తు’ వ్యూహాలు కేసీయార్‌కి కొత్త కాదు. 2018 ఎన్నికల్లో కూడా ఏడాది ముందే ఎన్నికలకు సిద్ధపడ్డారు. అప్పుడు కూడా కాంగ్రెస్ గెలుపుపై చాలా ధీమాగా ఉంది. హస్తం పార్టీకి తెలుగుదేశం కూడా జత కలిసింది. హైదరాబాద్, ఖమ్మం లాంటి ప్రాంతాల్లో చంద్రబాబునాయుడు విస్తృతంగా పర్యటించారు. ఆ కూటమిని ఎదుర్కొనడానికి కేసీయార్ మరోసారి తెలంగాణ సెంటిమెంట్‌ను ఉపయోగించారు. కాంగ్రెస్ గెలిస్తే తెలంగాణకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులన్నీ ఆంద్రప్రదేశ్‌లో తయారవుతాయని ఉద్యోగులకు వివరించారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ మళ్లీ ఆంధ్రోళ్ల చేతిల్లోకి వెళ్లిపోతుందని వాళ్లకు ‘అర్థమయ్యేలా’ చెప్పగలిగారు. తెలుగుదేశం నుంచే వెళ్లిన రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో కీలక స్థానంలో ఉండటంతో ఉద్యోగులు, తెలంగాణ వాసులు కేసీయార్ మాటలు నమ్మారు.
అంతవరకూ ప్రభుత్వంపై గుర్రుగా ఉన్న ఉద్యోగులు కాస్తా తెరాసకు మద్దతు పలికారు. ఆ ఎన్నికల్లో విజయం సాధించి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ సారి కాంగ్రెస్, భాజపా కూడా బలంగా ఉండటంతో, ముక్కోణపు పోటీలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి తమ పార్టీకి సానుకూలత ఉంటుందని ఆయన నమ్ముతున్నారు. దీంతో పాటు అన్ని వర్గాల పాజిటివ్ ఓటు కోసం కూడా ప్రయత్నిస్తున్నారు. కేసీయార్ దూకుడును జాతీయ పార్టీలు ఎలా ఎదుర్కొంటాయో చూడాలి.